పరమపద సోపాన పటము :
వైకుంఠపాళి అని మన తెలుగువారికి సుపరిచితమైన ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా వేరువేరు పేర్లతో ప్రచారంలో వుంది. పేరులో ఏముంది కానీ ఈ ఆటని తెలియని వారుండరు. పైన చూపించిన బొమ్మ పెద్ద కాలండర్ సైజు లో మా చిన్నప్పుడు సంక్రాంతి, శివరాత్రి మొదలైన పండగలకు వీధిలోకి తెచ్చి అమ్మేవారు. అప్పట్లో బయట పుస్తకాల షాపుల్లో కూడా దొరికేవి. అప్పట్లో మేము గవ్వలతో ఆడేవాళ్ళం. చివరిసారిగా నేను ఈ పటాన్ని ఎనిమిది చదువుతున్నప్పుడు చూసాననుకుంటా. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించింది. అప్పుడు black&white లో వుండేది. మేము ఇది కలర్ లో చూడలేదు.
ఇప్పుడు "పాములూ నిచ్చెనల" పేరుతో నేటితరం పిల్లలందరూ ఆడుతున్నారు. గూగుల్ లో దేనికోసమో వెతుకుతుంటే ఇది కనబడింది.
ఈ ఆట యొక్క రూపకర్తలకు నిజంగా జోహార్లు. ఎన్నో విశేషాలు వున్నాయిందులో..! ఆట పేరు పరమపద సోపాన పటము. "పరమ పదం అంటే వైకుంఠం లేదా సద్గతి. తద్విష్ణోః పరమం పదం అనేది వేదోక్తి. దీని ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదం." అంటే వైకుంఠం. పరమ పదం మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణ వచనం. మోక్షప్రాప్తి తరువాత సద్గతి పొందిన మనిషికి మరుజన్మ ఉండదు. ఆ లక్ష్యాన్ని అందుకొనడానికి ప్రయత్నించడమే ఈ ఆటలోని ముఖ్యోద్దేశం. మనం జీవితంలో ఏ పనులు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళ్తామో ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనల గళ్ళలో వ్రాసి వున్నాయి. అవి వరుసగాఇలా వున్నాయి..:
సుగుణం ...సాలోక్యానికి, సత్ప్రవర్తనము... గోలోకానికి, నిష్ఠ ... తపోలోకానికీ, యాగము... స్వర్గలోకానికీ , భక్తి.... బ్రహ్మ లోకానికీ, చిత్తశుద్ధి ...మహా లోకానికీ, జ్ఞానము.. కైలాసానికీ, సోపానాలుగా ఉన్నట్లు చూడగలం. అక్కడకు చేరిన తరువాత ఇక జన్మరాహిత్యం, ఈశ్వరత్వం తో కూడిన పరమపదాన్ని చేరటానికి మన వంతు వచ్చేవరకూ (అంటే సరైన పందెం పడేవరకూ..)ఎదురు చూడడమే. అలాగే అంతవరకూ పోయిన పిదప మత్సర్యమూ, అహంకారం దరి చేరామా మ్రింగడానికి పాము సిద్దంగా వుంటుంది. అది మనల్ని పుణ్య హీనులుగా చేసి రాక్షసులను, హీన జన్ములుగానూ చేస్తుంది.
ఈ మొత్తం త్రోవలో మనం మనలోని పాముల లాంటి అవలక్షణాలను ఎన్నో దాటుకొని రావలసి వుంటుంది. అవి మన లోనే వుండక్కరలేదు. ఆ లక్షణాలు కలిగిన రాక్షసుల దరి చేరినా అధోగతి ( పాము మింగి క్రిందకు పడిపోతాం) పట్టక తప్పదు.
ఈ రకంగా సత్య పథం లో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక 'సూచిక' గా మనం అన్వయించుకోవచ్చు.
ఇదే ఆట పాశ్చాత్య శైలిలో :
ప్రక్కన చూపిన రెండో బొమ్మ చూడండి. ఇది ఇంగ్లీషులో వుంది. చాలా పాతది అనుకుంటాను. దీనిలో కూడా పైన చెప్పిన మన పరమపద సోపాన పటం లగే వుంది. మనిషి యొక్క ఉన్నతికి, పతనానికీ దోహదం చేసే లక్షణాలను నిచ్చెనలూ, పాముల రూపం లో చూపించారు. చిన్నపిల్లలు / పెద్దవారు ఆడుకొనే ఆటలో ఎన్ని విశేషాలు జతచేసారో చూడండి.
ఈ ఆట మొదట ఎక్కడ / ఏదేశంలో మొదలైందో తెలీదు. అయితే ఇప్పుడు 'స్నేక్స్ అండ్ లేడర్స్' మాత్రమే కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా డైస్ తో ఆడుతున్నారు. గవ్వలతో ఎవరూ పెద్దగా ఆడటం లేదు. 'అష్ట - చమ్మ, 'పులి మేక', లాంటి సంప్రదాయ క్రీడలు, వాటి రూపకల్పనలో దాగివున్న జీవితానికి పనికి వచ్చే నీతి సూత్రాలు లేదా సిద్ధాంతాలు మరుగున పడిపోతున్నాయి.
అలాంటి పాత / సంప్రదాయ క్రీడలను వెలికి తీసుకు రావడానికి
http://gamepandit.com/index.html వారు కృషి చేస్తున్నారు. చూసి ఆనందించండి.
పైన చూపిన పరమ పద సోపాన పటం బొమ్మ