Wednesday, January 11, 2012

అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు..

అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు..

కాకినాడలోని అభ్యుదయ ఫౌండేషన్ వారు ఈ పోటీలను మొదట ప్రాంతీయ కేంద్రాలలో నిర్వహించి, ఆ పోటీలలో మొదటి రెండవ బహుమతులు గెలుచుకొన్న వారికి ఈ నెల రెండవ తేదీన కాకినాడలో రాష్ట్ర స్థాయి లో పోటీలు నిర్వహించారు. శ్రీ బాదం మాధవరావుగారి ఆధ్వర్యం లో జరిగిన ఈ పోటీలు గాత్రం, వీణ, ఫ్లూట్, వయోలిన్, సన్నాయి, మృదంగం, డోలు, సాక్సోఫోన్, మాండొలిన్ మొదలైన విభాగాలలో సీనియర్స్ జూనియర్స్ కి వేరువేరుగా జరిగాయి.

సుమారు డెబ్భై మంది వరకు ఈ పోటీలలో పాల్గొన్నారు. వారందరూ హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు కాకినాడల లో జరిగిన ప్రాంతీయ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి ఇక్కడకు వచ్చిన వారే. అందువల్ల పోటీలు పూర్తవటానికి రెండురోజులు పట్టింది. రెండోరోజు సాయంత్రం శ్రీ మల్లాది సూరిబాబుగారు విశిష్ట అతిధిగా జరిగిన కార్యక్రమంలో మొదటి బహుమతి గ్రహీతలతో ప్రదర్శన కూడా ఇప్పించారు.


న్యాయనిర్ణేతలుగా వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు పోటీలు ఒకే రోజులో పూర్తవక రెండవరోజు కూడా ఉండిపోవలసి వచ్చింది.  అంతమంది చిన్నపిల్లలు..( సీనియర్స్ కూడా ఇరవై ఏళ్లకు మించని వారే కావడం విశేషం) చాలా చక్కటి ప్రతిభలనంది పుచ్చుకొని ఇలాంటి సృజనాత్మక కళా రంగాలలో రాణించడం ముదావహం. 'స్పర్థయా వర్ధతే విద్యా' అన్నారు. కాని ఈ కుర్రవాళ్ళు అందరూ చాలా sportive spirit  తో మెలిగారు. పోటీలో ఒకరు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళని మిగతావారు ప్రోత్సహించడం, వాద్య కళాకారులకి తాళం వేస్తూ సహాయపడడం.. చూస్తోంటే చాలా ముచ్చటేసింది.

ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం లో ఇంతపెద్ద ఎత్తున శాస్త్రీయ సంగీతం లో పోటీలు నిర్వహిస్తూ, దాని వ్యాప్తికి కృషి చేస్తున్న అభ్యుదయ ఫౌండషన్, కాకినాడ వారు శ్లాఘనీయులు. 

మా అమ్మాయి కృష్ణప్రియకి జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసురాలు, మా శ్రీమతి కి గురువుగారు అయిన  శ్రీమతి మండ సుధారాణి గారి అమ్మాయి కుమారి ప్రత్యూష శ్రుతి రవళి కి సీనియర్స్ విబాగం లో మొదటి బహుమతి మరియు వయోలిన్ లో రెండవబహుమతి, ఉత్తమ ప్రతిభ కనబరచి నందుకుగాను బంగారు పతాకాన్ని కూడా కైవశం చేసుకొంది.  అలాగే జూనియర్స్ గాత్రం లో రెండవ బహుమతి పొందిన సువర్ణజ్యోతి (అంధ బాలిక) తన వైకల్యాన్నితన ప్రతిభతో అధిగమించి శభాష్ అనిపించుకొంది. మృదంగం లో జూనియర్స్ మొదటి బహుమతి పొందిన చిన్నారి కార్తికేయ అపర నందీశ్వరుడే అనిపించుకొన్నాడు. జూనియర్స్ వయోలిన్ లో మొదటి బహుమతి పొందిన హైదరాబాదు కి చెందిన శ్రీవత్స తొమ్మిదవ తరగతి చదువుతున్నాడట. తొమ్మిదేళ్ళ నుంచీ నేర్చుకొంటున్నాడట. సీనియర్స్ కి దీటుగా వాయించాడు.

వీరందరికీ ఆ సరస్వతీ దేవి కటాక్షం సంపూర్ణం గా లభించి భవిష్యత్తులో ఉత్తమ కళాకారులుగా ఎదిగి మన తెలుగువారికి  గర్వకారణం ఔతారని ఆశిద్దాం. 
No comments:

Post a Comment

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)