
మొన్న యాదృఛ్చికంగా ఎన్డీటీవీ వీడియో లో శ్రీ అనంత్ పాయ్ గారి గురించీ కనిపిస్తే బ్లాగులో ఆయన గురించి వ్రాద్దామనుకొని..ఆ లింక్ లు సేవ్ చేసుకున్నాను. కానీ చూడలేదు. ఒకటి రెండు రోజుల్లోనే శ్రీ సురేఖ గారి బ్లాగు చూసి విస్మయానికి గురయ్యాను. మన ముళ్ళపూడి గారు పరమపదించిన రోజునే శ్రీ పాయ్ గారు కూడా మనల్ని విడిచి వెళ్ళారని తెలిసి చాలా బాధపడ్డాను.
ఎన్డీటీవీ వీడియోలు :
http://www.dailymotion.com/video/xck91b_amar-chitra-katha-on-tv_shortfilms
http://www.dailymotion.com/video/xh89ee_how-uncle-pai-created-amar-chitra-katha_news#hp-v-v1
చందమామ, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి, చదివేరోజుల్లోనే.. మాకు బాగా నచ్చిన మరో పత్రిక ’టింకిల్’. అప్పుడే తెలుగులో రిలీజ్ అయింది. మేము ఆ రోజుల్లో భీమిలి లో వుండేవాళ్ళం. మా నాన్నగారు అక్కడే స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. మా తాతగారిల్లు విశాఖపట్నం కావడంతో రాకపోకలు ఎక్కువగానే వుండేవి. తాతగారింటికి వెళ్ళే ఆనందం ఎప్పుడైనా వుండేదే..!! అయితే... మాకు మరో రెండు కారణాలు కూడా వుండేవి..!! ఒకటి.. మాతాతగారింట్లో ఉండే లైబ్రరీ, రెండు.. ఈ ప్రయాణంలో మా నాన్నగారు మాకు కొత్తవి కథల పుస్తకాలు కొనేవారు.
మాతాతగారి ఇంటిలో పెద్ద లైబ్రరీ వుండేది..!! పుస్తకాలు అద్దెకిచ్చేవారు. బయట వాళ్ళ సంగతేమో గానీ.. మేము మాత్రం మళ్ళీ వెనక్కి బయలుదేరే దాకా ఎక్కువ సమయం ఆ లిబ్రరీ లోనే గడిపే వాళ్ళం. చందమామలూ మొదలైన వాటితో పాటు పాకెట్ నవలలు జానపదం నేపధ్యం లో వుండేవి. అవి చదువుతుంటే ఎన్ టీ ఆర్, కాంతారావు ల సినిమాలు చూస్తున్నట్టుండేది. పైగా ఒకసారి లైబ్రరీ లోకి వెళ్ళి తలుపేసుకుంటే మాగురించి అడిగేవాళ్ళు లేరు.
సరిగ్గా ఆరోజుల్లోనే మొట్ట మొదటి సారిగా టింకిల్ తెలుగులో విడుదలయింది. అప్పుడే మొదటిసారిగా శ్రీ అనంత్ పాయ్ గారి పేరు చదవడం. (తరువాత కొన్నాళ్ళకి మా లైబ్రరీ లోనే రాము – శ్యాము అని పిల్లల చిలిపి చేష్టలు, వారి అమాయకత్వం ఇతివృత్తం గా వుండే పుస్తకం కనిపించింది. అదికూడా ఆంధ్ర ప్రభ వారపత్రికలోనో, జ్యోతి లోనో ధారావాహిక వస్తే పేజీలు వేరుచేసి కుట్టినదే. రాము శ్యామూ బొమ్మలకింద కధ: అనంత్ పాయ్ – బొమ్మలు: మోహన్ దాస్ అని వుండేది.) అప్పటి నుంచీ టింకిల్ తప్పనిసరిగా కొనేవాళ్ళం. దానిలో వచ్చే కధలూ, పజిల్స్ శీర్షికలూ, అన్నీ మమ్మల్ని వేరేలోకాలకి తీసుకుపోయేవి. ప్రతీ సారీ ఒక్కో జంతువునో, పక్షినో పరిచయం చేసేవారు.. పులిని కలుసుకొండి.. పాంగోలిన్ ను కలుసుకోండి..అంటూ..!! నీటిగుర్రం, నీటి ఏనుగు, క్రోక్విల్, మొదలైన వాటిని నిజం గా చూస్తున్నామా అన్నంత బాగుండేవి బొమ్మలూ, వ్యాఖ్యానం. బొమ్మలు ఎంత బాగుండేవో వ్ర్రాత కూడా అంత చక్కగానూ వుండేది.
అలాగే అమరచిత్ర కథల విషయానికొస్తే మన పురాణ పురుషులనీ, దేశనాయకులనీ, జాతక కథలనీ, జానపదాన్నీ ఒకటేమిటి మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను సమస్తం తన బొమ్మల పుస్తకాలలో నిక్షిప్తం చేసారు..పాయ్ అంకుల్ గా పిలువబడే శ్రీ అనంత్ పాయ్ !! క్లాసు పుస్తకాలలో ఇలాంటివి కనబడక పోవడం చేత వాటికన్నా ఒక్కోసారి వీటినుంచీ తెలుసుకొన్న విషయాలే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదేమైనా చిన్నప్పటినుంచీ మాతరంలో ఒక మరపురాని అనుభూతిని మిగిల్చి ఒకతరం మొత్తానికి వారి దేశం పట్ల మమకారాన్నీ, అభిమానాన్నీ, గౌరవాన్నీ పాదుకొల్పగలిగిన శ్రీ అనంత్ పాయ్ నిజంగా ధన్యుడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా ప్రార్ధిద్దాం.
అలాగే వారి కృషిని మరిన్ని తరాలకు అందేలా నేటి సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్న అమరచిత్రకథ మరియు టింకిల్ యాజమాన్యాలు అభినందనీయులు. అలాగే మన తరాల్లో పరిచయమైన అవే బొమ్మలని, ఏనిమేషన్ లో కూడా అందుబాటులోకి తేవడం ద్వారా నేటి తరం బాలబాలికలకు మరింత చేరువయ్యారు. పాశ్చాత్య సంస్కృతి తుఫానులో కొట్టుకుపోతున్న ఈ తరం బాలసాహిత్యానికి ఈ పుస్తకాలు చుక్కాని కాగలవనడంలో సందేహం లేదు.
బొమ్మల కథల పై మరింత సమాచారం కోసం శ్రీ సురేఖ గారి రేఖాచిత్రం బ్లాగులో చూడండి. వారికి నా ధన్యవాదాలు.








