Tuesday, March 15, 2011

అమర చిత్ర కథ మరియు టింకిల్ సృష్టి కర్త - అనంత్ పాయ్



మొన్న యాదృఛ్చికంగా ఎన్డీటీవీ వీడియో లో శ్రీ అనంత్ పాయ్ గారి గురించీ కనిపిస్తే బ్లాగులో ఆయన గురించి వ్రాద్దామనుకొని.. లింక్ లు సేవ్ చేసుకున్నాను. కానీ చూడలేదు. ఒకటి రెండు రోజుల్లోనే శ్రీ సురేఖ గారి బ్లాగు చూసి విస్మయానికి గురయ్యాను. మన ముళ్ళపూడి గారు పరమపదించిన రోజునే శ్రీ పాయ్ గారు కూడా మనల్ని విడిచి వెళ్ళారని తెలిసి చాలా బాధపడ్డాను.

ఎన్డీటీవీ వీడియోలు :

http://www.dailymotion.com/video/xck91b_amar-chitra-katha-on-tv_shortfilms

http://www.dailymotion.com/video/xh89ee_how-uncle-pai-created-amar-chitra-katha_news#hp-v-v1


చందమామ, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి, చదివేరోజుల్లోనే.. మాకు బాగా నచ్చిన మరో పత్రికటింకిల్’. అప్పుడే తెలుగులో రిలీజ్ అయింది. మేము రోజుల్లో భీమిలి లో వుండేవాళ్ళం. మా నాన్నగారు అక్కడే స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. మా తాతగారిల్లు విశాఖపట్నం కావడంతో రాకపోకలు ఎక్కువగానే వుండేవి. తాతగారింటికి వెళ్ళే ఆనందం ఎప్పుడైనా వుండేదే..!! అయితే... మాకు మరో రెండు కారణాలు కూడా వుండేవి..!! ఒకటి.. మాతాతగారింట్లో ఉండే లైబ్రరీ, రెండు.. ప్రయాణంలో మా నాన్నగారు మాకు కొత్తవి కథల పుస్తకాలు కొనేవారు.

మాతాతగారి ఇంటిలో పెద్ద లైబ్రరీ వుండేది..!! పుస్తకాలు అద్దెకిచ్చేవారు. బయట వాళ్ళ సంగతేమో గానీ.. మేము మాత్రం మళ్ళీ వెనక్కి బయలుదేరే దాకా ఎక్కువ సమయం లిబ్రరీ లోనే గడిపే వాళ్ళం. చందమామలూ మొదలైన వాటితో పాటు పాకెట్ నవలలు జానపదం నేపధ్యం లో వుండేవి. అవి చదువుతుంటే ఎన్ టీ ఆర్, కాంతారావు సినిమాలు చూస్తున్నట్టుండేది. పైగా ఒకసారి లైబ్రరీ లోకి వెళ్ళి తలుపేసుకుంటే మాగురించి అడిగేవాళ్ళు లేరు.


విశాఖ పట్నం నుంచీ ఆర్ టీ సీ బస్సు లో కాంప్లెక్సు నుండీ బయలుదేరి భీమిలీ చేరుకొనే వాళ్ళం. బస్సు ఎక్కే లోపల తప్పనిసరిగా అక్కడ వుండే బుక్ స్టాల్ లో కొన్ని పుస్తకాలు కొనుక్కొని బయలుదేరేవాళ్ళం. అంతకు ముందు నుంచీ కూడా ఈనాడు దిన పత్రికలో అడుగున కుడిచేతిపక్క పేజీ ఎత్తి చూస్తే అమరచిత్రకథ వాళ్ళవి బొమ్మల కథలు తెలుగులొ వుండేవి. ౩౦ రోజులపాటు ధారావాహిక గా వచ్చేవి. దశావతారాలు, నారద గాధలు, అభిమన్యుడు, భగవద్గీత, అర్జున గర్వభంగం, ఇలా చాలా వచ్చేవి. కధ పూర్తి కాగానే వాటిని జాగ్రత్తగా కత్తిరించి పుస్తకాలుగా కుట్టుకొనేవాళ్ళం. అయితే పుస్తకాలన్నీరంగుల్లో అమరచిత్రకథ వారి పుస్తకాలుగా కాంప్లెక్సు లో దొరికితే అవికూడా కొనుక్కొనే వాళ్ళం.




సరిగ్గా ఆరోజుల్లోనే మొట్ట మొదటి సారిగా టింకిల్ తెలుగులో విడుదలయింది. అప్పుడే మొదటిసారిగా శ్రీ అనంత్ పాయ్ గారి పేరు చదవడం. (తరువాత కొన్నాళ్ళకి మా లైబ్రరీ లోనే రాముశ్యాము అని పిల్లల చిలిపి చేష్టలు, వారి అమాయకత్వం ఇతివృత్తం గా వుండే పుస్తకం కనిపించింది. అదికూడా ఆంధ్ర ప్రభ వారపత్రికలోనో, జ్యోతి లోనో ధారావాహిక వస్తే పేజీలు వేరుచేసి కుట్టినదే. రాము శ్యామూ బొమ్మలకింద కధ: అనంత్ పాయ్బొమ్మలు: మోహన్ దాస్ అని వుండేది.) అప్పటి నుంచీ టింకిల్ తప్పనిసరిగా కొనేవాళ్ళం. దానిలో వచ్చే కధలూ, పజిల్స్ శీర్షికలూ, అన్నీ మమ్మల్ని వేరేలోకాలకి తీసుకుపోయేవి. ప్రతీ సారీ ఒక్కో జంతువునో, పక్షినో పరిచయం చేసేవారు.. పులిని కలుసుకొండి.. పాంగోలిన్ ను కలుసుకోండి..అంటూ..!! నీటిగుర్రం, నీటి ఏనుగు, క్రోక్విల్, మొదలైన వాటిని నిజం గా చూస్తున్నామా అన్నంత బాగుండేవి బొమ్మలూ, వ్యాఖ్యానం. బొమ్మలు ఎంత బాగుండేవో వ్ర్రాత కూడా అంత చక్కగానూ వుండేది.

అలాగే అమరచిత్ర కథల విషయానికొస్తే మన పురాణ పురుషులనీ, దేశనాయకులనీ, జాతక కథలనీ, జానపదాన్నీ ఒకటేమిటి మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను సమస్తం తన బొమ్మల పుస్తకాలలో నిక్షిప్తం చేసారు..పాయ్ అంకుల్ గా పిలువబడే శ్రీ అనంత్ పాయ్ !! క్లాసు పుస్తకాలలో ఇలాంటివి కనబడక పోవడం చేత వాటికన్నా ఒక్కోసారి వీటినుంచీ తెలుసుకొన్న విషయాలే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదేమైనా చిన్నప్పటినుంచీ మాతరంలో ఒక మరపురాని అనుభూతిని మిగిల్చి ఒకతరం మొత్తానికి వారి దేశం పట్ల మమకారాన్నీ, అభిమానాన్నీ, గౌరవాన్నీ పాదుకొల్పగలిగిన శ్రీ అనంత్ పాయ్ నిజంగా ధన్యుడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా ప్రార్ధిద్దాం.


అలాగే వారి కృషిని మరిన్ని తరాలకు అందేలా నేటి సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్న అమరచిత్రకథ మరియు టింకిల్ యాజమాన్యాలు అభినందనీయులు. అలాగే మన తరాల్లో పరిచయమైన అవే బొమ్మలని, ఏనిమేషన్ లో కూడా అందుబాటులోకి తేవడం ద్వారా నేటి తరం బాలబాలికలకు మరింత చేరువయ్యారు. పాశ్చాత్య సంస్కృతి తుఫానులో కొట్టుకుపోతున్న తరం బాలసాహిత్యానికి పుస్తకాలు చుక్కాని కాగలవనడంలో సందేహం లేదు.

బొమ్మల కథల పై మరింత సమాచారం కోసం శ్రీ సురేఖ గారి రేఖాచిత్రం బ్లాగులో చూడండి. వారికి నా ధన్యవాదాలు.

http://www.amarchitrakatha.com/

http://www.amarchitrakatha.com/products/Tinkle

4 comments:

  1. http://pustakam.net/?p=6615
    ఈ లింక్ కూడా చూడండి. పుస్తకం.నెట్ లో సౌమ్య గారు వ్రాసిన వ్యాసం. నేను రాసిన దానికన్నా ఇది ఇంకా బాగుంది. ముళ్ళపూడి గారు చెప్పినట్టు.. ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండడం అంటే ఇదేనేమో..!!

    ReplyDelete
  2. Radhe shyam garu.. ee vyaasam chadivinchi chaala venakku teesukellipoyeru mammalni. jaanapada kadhala pustakaalu Dabagardens ( prema samajam down) lo oka shop lo dorikevi.. vela: Rs 2/-. Na kosam enno pustakalu konevaaru ma nannagaru kooda. " kaalasarpiNi, Mantri geddam lo marmam.. etc " lu undevi nadaggara.. And meeru cheppinattu TINKLE lo Kaaliya kadhalu.. chamatka, doob doob, abba... Madhura jnapakaala thutta ni kadipincheru.. dhanyavaadalu meeku..

    ReplyDelete
  3. Anuradha satish said...
    రాధేశ్యాం గారు... ఈ వ్యాసం చదివించి చాలా వెనక్కు తీసుకెళ్ళిపోయేరు మమ్మల్ని.. జానపద కదల పుస్తకాలు డాబాగార్డెన్స్ (ప్రేమ సమాజం డౌన్) లో ఒక షాప్ లో దొరికేవి... వెల : Rs 2/-. నా కోసం ఎన్నో పుస్తకాలు కొనేవారు మా నాన్నగారు కూడా . " కాలసర్పిణి, మంత్రి గెడ్డం లో మర్మం.. etc " లు ఉండేవి నాదగ్గర...! And మీరు చెప్పినట్టు TINKLE లో కాలియా కధలు .. చమత్క, డూబ్ డూబ్ , అబ్బ ... మధుర జ్ఞాపకాల తుట్ట ని కదిపించేరు .. ధన్యవాదాలు మీకు...

    ReplyDelete
  4. @ అనురాధగారూ..
    చాలా సంతోషం అండీ..!! చాలా కాలానికి మిమ్మల్ని కూడా ఈవిధం గా కలుసుకోవడం నాకూ ఆనందంగా ఉంది.!
    మీ కామెంట్లు వ్రాస్తూ వుండండి.
    ధన్యవాదాలతో..
    రాధేశ్యాం

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)