Monday, March 14, 2011

జరిగింది..విగ్రహ విధ్వంసమా లేక...

సంఘటన జరిగినప్పటి నుంచి.. రెండుప్రాంతాల వారి బ్లాగులూ చదువుతూనే వున్నాను. ఇక్కడ విషయాన్ని రెండు పక్షాలవారూ రెండు దృక్కోణాలనుంచి చూస్తున్నారని పిస్తోంది. క్షమించాలి.. మమందరం మొదట భారతీయులం ఎలాగో..అలాగే మన ప్రాంతీయత కంటే ముందు మనందరం తెలుగు వాళ్ళం అని నమ్మేవాడిని నేను. రెండు విరుద్ధ భావనల్నిప్రతిబింబించే వాదనలు చేస్తున్నపక్షాలని రెండు గా వేరుచేసి చూడవలసి వస్తోంది. ఇక్కడ రెండు పక్షాలు అంటే.. తెలంగాణా, సీమాంధ్ర అని కాదని మనవి. ఆ విగ్రహాలకి ప్రాంతీయతని ఆపాదించకుండా తెలుగు జాతి సాంస్కృతిక వారసత్వానికీ, వారు ప్రతిపాదించిన విలువలకీ ప్రతీకలుగా భావించే వారు (ఇలాంటి భావన కలిగిన తెలంగాణాకు చెందినా వారి బ్లాగులను చూసాను) ఒక పక్షం అయితే.. ఆ విగ్రహాలని కేవలం ప్రాణం లేని బొమ్మలుగా, తమ మీద రుద్దబడిన తమది కాని చరిత్ర గా మాత్రమే భావించి తీవ్రమైన భావావేశం తో పరుష పదజాలం తో మొదటి పక్షం మీద విరుచుకు పడుతున్నపక్షం రెండోది. ఈ 'బ్లాగ్యుద్ధం' ఎంతదాకా వెళ్లిందంటే ఆఖరుకి దేవుళ్ళనీ..ఫ్లై ఓవర్లనీ కూడా ప్రాంతీయత పేరుతో వేరుచేసే దాకా..!!



ఇక్కడ ఈ రెండో వర్గం చేసిన, చేస్తున్నయాగీ, అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు ఉంది. తెలుగు భాషా సౌరభాన్ని గుబాళింప జేసి, వారి రచనల ద్వారా తెలుగు ప్రజల మనోవికాసానికి కృషి చేసిన ఆ వైతాళికులు విశ్వమానవులు. వారు ప్రతిపాదించిన విలువలను వారి జీవితం లో ఆచరించి చూపిన పుణ్యాత్ములు. అలాంటి మహాత్ముల విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ద్వారా వీరు సాధించ దలచిందేమిటి..? ఆ రోజు, మరియు దానికి ముందు జరిగిన సంఘటనల నేపధ్యం లో ఈ విగ్రహ ధ్వంసం..క్షణికావేశం లో జరిగినదే అని సమాధాన పడదామన్నా..దాని తరువాత వస్తున్న సమర్ధింపులు ఏ రకంగా అంగీకారయోగ్యం..?? ఇదంతా ఈ రాజకీయ నాయకులు వారి ఉనికి కోసం చేసే దిగజారుడు చర్యలనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తపించేవారి ఆవేదనని అర్ధం చేసుకున్నా, ఇలాంటి వికృత చేష్టలకి పాల్పడే వారిని రకంగా అర్ధం చేసుకోవాలో తెలియదు. పైగా వారు సమస్యకి మూల కారణమైన రాజకీయ నాయకులని వదలి కవులు, కళాకారుల విగ్రహాలను కూలగోట్టడం..ఎక్కడి వీరోచిత కార్యమో అర్ధంకాదు.


హిందూ - ముస్లిం లు ఇక్యం గా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, మహమ్మద్ అలీ జిన్నా యొక్క కుటిల రాజనీతి ఏ రకంగా కలుషితం చేసిందో మనకు తెలుసు. మనస్సులో విషబీజాలు నాటి, రెండు మతాల మధ్య సృష్టించిన అగాధంలో తమ విజ్ఞతని పాతిపెట్టి, కలసి పని చేసిన మిత్రులు, సోదరుల్లా మెలిగిన వారే తోటివారి రక్తాన్ని కళ్ళ జూసే స్థాయికి దిగజారి మానవత్వాన్ని మంటగలిపిన ఉదంతాలు మనం చూశాం. విద్వేషం..అది రగిల్చిన వారికంటే అనుభవించిన వారికే ఎక్కువ ప్రమాదకరం.

ప్రత్యేక రాష్ట్రం కోసం సమిధలైన వారిని గురించి బాధపడని మానవతావాదులకు ఈ ప్రాంతం లో కొదవు లేదు. 600 మంది అమరులైనారని తలచుకున్న ప్రతీసారీ గుండెలు పిండినట్టవుతుంది. అదే రీతిలో ఏమాత్రం ఉద్యమానికి సంబంధం లేని వారి విగ్రహాలను కూలగొట్టడం కూడా బాధ కలిగిస్తుంది. కానీ ఈ చర్య వల్ల విచక్షణ మర్చిపోయి తెలంగాణాకు చెందిన మన సోదరులనందరినీ ఒకే గాటన కట్టి, ద్వేషపూరిత భావాలతో మన మనసుల్ని కలుషితం చేసుకోవడం..ఏ రకం గానూ సమర్ధనీయం కాదు. కుల,మత,వర్గ, రహితమైన.., ప్రాంతీయ విభేదాలను దరిచేరనివ్వని.., సమ సమాజ స్థాపనకై కలలుగన్న ఆ మహనీయులకు 'లేని' ప్రాంతీయతని ఆపాదిస్తే అది విశ్వవ్యాప్తమైన వారి వ్యక్తిత్వాన్ని అంగుష్ఠ మాత్రం చెయ్యబూనటమే. గాంధీని, తిలక్ నీ, అంబేడ్కర్ని, వీర శివాజీనీ, ఏదో ఒక మతానికీ, వర్గానికీ, కులానికీ, ప్రాంతానికీ మాత్రమే ప్రతినిధులుగా ఆలోచించే సంకుచిత మనస్తత్వం వల్ల మన తరువాతి తరానికి మనం ఇస్తున్నది ఏమిటో తెలుసుకో గలిగితే వొళ్ళు గగుర్పొడుస్తుంది. నాయకులుగా మనం నమ్మిన వారి విలువలని పంచటం లేదు సరికదా.. వైషమ్యాలని పెంచి వారికి విషాన్ని పంచుతున్నాం. ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వం, లాంటి భావాలకి వారిని దూరం చేస్తున్నాం. అరవయ్యేళ్ళు అయినా ఇంకా మన పొరుగు దేశానికి చెందిన వారు ఇంకా మన మీద విరుచుకు పడడానికి ప్రయత్నిస్తున్నారంటే.. వారి భావజాలం యొక్క మూలాలు (విత్తనం), ఎంత ప్రమాదకరమైనవో తెలుస్తోంది.


తమ చరిత్ర నిర్మించుకోవాలనే ఆరాటం లో మన మూలాలను ప్రక్కవారివి గా భావించి, వాటి సమాధులని తమకు పునాదులుగా వాడుకోవాలని చూస్తే చరిత్ర హీనులు కాకతప్పదు. వేరు పడాలనే ఒకే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు చెప్పే 'మా ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేదు..కనుక వేరు పడాలి అనుకుంటున్నాం.. ' లాంటివాక్యాలు రేపు..రాష్ట్రం ఏర్పడ్డాక మండలాల వారీగా ప్రాతినిధ్యాలకి జవాబు చెప్పేటప్పుడు.. మనమంతా ఒకటే కదా..అని పాలకులు అనకా తప్పదు ..! "లేదు.. మాకు ప్రత్యేకం ఉండాల్సిందే " అని పోరుపెట్టే చోటా నాయకులకూ కొదవుండదు.

ఏదైనా మనం చూసే దృష్టిలోనే మనం గ్రహించే విషయం ఉంటుందనేది సుస్పష్టం..! అందమైన జాబిల్లిని మారుతున్న కళలతో చూడవలసి రావడం భూమినుంచి చంద్రుడిని మనం చూసే స్థిరమైన దృక్కోణం వల్లనూ, మరియు ఖగోళ భౌతిక శాస్త్ర నియమాల వల్లనే అనేది జగద్విదితం. కానీ చంద్రుడికి తన వెలుగులను పూర్తిగా పంచటం లేదని సూర్యుడి మీద అలుక పూనటం అవివేకం.

8 comments:

  1. రాధేశ్యాం గారు, శుభోదయం. చాలా చక్కని విషయం విపులంగా చెప్పారు.
    ఏదైనా మనం చూసేదానిపై, మన ఆలోచన మీద వుంటుంది, ఆకాశంలో
    చందమామ మంచి హృదయంతో చూస్తే వెన్నెలలు కురిపిస్తూ అగుపిస్తాడు.
    అదే చెడు దృషిగలవాడికి హర్రర్ కధల్లో ఏ తోలేడు మనిషో, డ్రాక్యులాయో
    గుర్తురావచ్చు. ఓ మంచి బొమ్మను గీయడానికి, ఓ శిల్పాన్ని చెక్కడానికి
    ప్రతిభ కావాలి. కాని చించడానికి, విరగ గొట్టడానికి అవసరం లేదు కదా?!
    ఓ అందమైన బొమ్మను తుడుస్తున్నప్పుడు చేయిజారి విరిగిపొతే , ఆ తప్పు
    మనదైనా మనసు ఎంత విలవిల లాడుతుంది. ఇది గుర్తించాలి.

    ReplyDelete
  2. మంచి వ్యాసం వ్రాశారండి. నిష్పక్షపాతంగా ఉంది.

    ReplyDelete
  3. /తమ చరిత్ర నిర్మించుకోవాలనే ఆరాటం లో మన మూలాలను ప్రక్కవారివి గా భావించి, వాటి సమాధులని తమకు పునాదులుగా వాడుకోవాలని చూస్తే చరిత్ర హీనులు కాకతప్పదు/
    Good Analysis

    ReplyDelete
  4. Good piece but would have been more credible if you pointed that none of your RK beach statues are of Telangana people. The hypocrisy of andhra "leaders" is evident when they talk only about statues, not real people.

    ReplyDelete
  5. @అజ్ఞాత:
    నేను నా పోస్టులో రాసినది జాతిని విడదీసి పబ్బం గడుపుకొనే రాజకీయ నాయకుల గురించి, వాళ్ళు రగిల్చిన విద్వేషం తలకెక్కించుకొంటే కలిగే అనర్ధాల గురించి మాత్రమే.. ప్రాంతీయత గురించి కాదు. నేను స్పందించినది కూలగొట్టబడిన విగ్రహాల ప్రాంతీయతని దృష్టిలో పెట్టుకొని కాదు. అందువల్ల విశాఖపట్నంలోని విగ్రహాల ప్రాంతీయత గురించీ ఇక్కడ ప్రస్తావన రాలేదు.
    జరుగుతున్నమొత్తం విషయాలు..మొత్తం జాతికే బాధ కలిగించే విషయం అనటం లో సందేహంలేదు. ఆత్మహత్యలు చేసుకొంటున్నవిద్యార్ధులు లేదా సామాన్య తెలంగాణా ప్రజల సంఖ్య 600 కి చేరుతున్నా, వారిలో ధైర్యం నింపవలసిన నాయకత్వం చేతకానితనాన్నిచూసి బాధపడాలి. ఆవేశపడాలి. వారి కంటితుడుపు మాటలని ఎండగట్టాలి. అలా చెయ్యొద్దని కేవలం విజ్ఞప్తులతో సరిపుచ్చితే ఎలా సరిపోతుంది?? చేతికందాల్సిన, అందివచ్చిన పిల్లలు, క్షణికావేశంలో తమ జీవితాలని అర్ధాంతరంగా చాలించుకొంటే ఆ ముసలి తల్లిదండ్రులకి ఆసరా ఎవరు? దానికి ఎవరిది బాధ్యత? ఆ ఆరువందల కుటుంబాలని ఏ రకంగానైనా ఆదుకున్నారా..ఈ నాయకులు??

    రెండో పక్క దేవుళ్ళని కూడా ప్రాంతీయత పేరుతో ఈ చిచ్చులోకి లాగి, చలికాచుకొనే నాయకులు, వారి స్టేట్మెంట్ లని ఏంచెయ్యాలి??
    విషయం చిన్నదైనా పెద్దదైనా, దానిని ఆసరాగా చేసుకొని, వీళ్ళ స్వంత అభిప్రాయాలనీ, పైత్యాలనీ ప్రజలందరికీ ఆపాదించి, విద్వేషాగ్ని రగిల్చే ప్రయత్నం చెయ్యడం నిజంగా క్షమించరాని నేరం. తక్షణ రాజకీయ లబ్ది మీద లెక్కలు వేసే నాయకమ్మన్యులు.. కెమెరాల ముందు చేసే జనాకర్షక విన్యాసాలు మాని తమని ఎన్నుకున్న ప్రజల పట్ల తమ బాధ్యతలని గుర్తెరిగితే మంచిది. అలాగే ఇలాంటి వలలో చిక్కకుండా రెండుప్రాంతాల ప్రజలూ జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం.

    ReplyDelete
  6. >>ఆత్మహత్యలు చేసుకొంటున్నవిద్యార్ధులు లేదా సామాన్య తెలంగాణా ప్రజల సంఖ్య 600 cerindaa? edi list ivvandi. You too are spreading their lies unrealistic snd senseless claims.

    ReplyDelete
    Replies
    1. Sure!! You can get the list of people who commited suicide for Telangana by getting the FIR registered in all the police stations!! Mee seemandhra vetakaram kattipetti, Rasina rachayithani gouravinchatam nerchukondi.

      Delete
  7. పైన అజ్ఞాతా,
    "ఆత్మహత్యలు చేసుకొంటున్నవిద్యార్ధులు లేదా సామాన్య తెలంగాణా ప్రజల సంఖ్య 600 చేరిందా?" అంటున్నారు, మీరు అలా ఏమీ అడగకూడదు :)

    ysr పోయినప్పుడు వేలల్లో పోగా, వందల్లో పోకూడదా? ఆ లెక్కలు లాగానే, ఈ లెక్కలు అంతే!! (కాకి)లెక్కలు లెక్కలే మరి :))

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)