Sunday, September 25, 2011

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

     ఈ పోస్ట్ వ్రాయడం మొదలుపెట్టింది హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న రోజున..!! కానీ టైం కుదరక.. అర్ధంతరంగా ఆపేసాను. కానీ ఈ రోజు విశాఖపట్నం లో నేలకూలిన అతిపెద్ద వినాయక ప్రతిమను చూసి, ఉండలేక మళ్ళీ మొదలుపెట్టాను.
                శ్రీ సంపత్ వినాయక ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఆర్భాటం గా పెట్టిన వినాయకుడు 127 అడుగుల ఎత్తు, 6300  కేజీల అతిపెద్ద లడ్డు నైవేద్యం -  లాంటి విషయాలలో ప్రత్యేకతను సంతరించుకొంది. విగ్రహ ప్రతిష్టాపన జరుగవలసిన వినాయక చవితి రోజున ప్రొద్దున్నే పెద్ద వర్షం కురవడంతో ఆ కార్యక్రమం మర్నాడు జరిగింది. ఏదేమైనా నిమజ్జనం ఇంకొద్ది గంటల్లో జరగనుందనగా మొత్తం విగ్రహం నేల కొరగడం చాలా దురదృష్టకరం. కార్య నిర్వాహక సమితి వాళ్ళు ప్రాయశ్చిత్త విధులూ, గణేశ హోమాలూచేసి నిమజ్జనం విగ్రహం ఉన్నచోటే (?) చేసేసి అయిందనిపించారు.
                   ఈలోగా మన పాత్రికేయ మిత్రులు యధావిధిగా లైవ్ కవరేజ్ చేస్తూ, ఈ దుర్ఘటన వాళ్ళ ఏమైనా అనర్ధాలుంటాయా..! అపచారమేదైనా జరిగిందంటారా..?? అంటూ లీడ్ విశ్లేషణలూ.., దానికి ఒకరు.. "అబ్బే.. ఇక్కడ పూజలేవీ పధ్ధతి ప్రకారం జరగనే లేదండీ" అంటూ సన్నాయి నొక్కులు..!!
                 అదృష్టవశాత్తూ నిర్వాహకులు ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, భక్తులకు దర్శనాలు నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కూలిన సమయం లో దగ్గరలో ఎవ్వరూ లేరు. ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ మధ్యే ఎవరో రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని ఇలాగే తాత్కాలికంగా వేసిన పందిరి లోపెట్టబోతే అది నిర్మాణం కూడా పూర్తికాకుండానే నేలకూలింది. ఇంతకుముందు ఇలాంటి భారీ వినాయకుడి పెండాల్ లోనే షార్ట్ సర్క్యుట్ కారణం గా విగ్రహం పూర్తిగా తగలబడిపోయింది. కనీసం మంటలార్పే సాధనాలుకూడా నిర్వాహకుల వద్ద లేవు. అన్ని సందర్భాలలోనూ ఏదో ఘనత సాధించాలనీ, రికార్డుల కెక్కాలనే సరదా నే తప్ప.. ప్రమాదం జరిగే అవకాశం వుందనికానీ, ఒకవేళ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గానీ నిర్వాహకులకి కొరవడుతోంది. అసలు అంతపెద్ద విగ్రహాలను పెట్టడం లో గల ఆంతర్యం ఏమిటో ఆ విగ్రహాలు పెట్టిన నిర్వాహకులకే తెలియాలి.
              ఈసారి ప్రజల చైతన్యం పుణ్యమా అని దాదాపు అందరూ మట్టి విగ్రహాలకే మొగ్గుచూపారు. అందరితో పాటే ఈ పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా 'ఎకో ఫ్రెండ్లీ' వినాయకుడని చెప్పుకుంటూ మట్టి తోనే విగ్రహాలు తయారు చేసారు. అంతవరకూ బాగానే వుంది. కానీ నిమజ్జనం దగ్గరికొచ్చేసరికీ సమస్యలు మొదలు. అంత భారీ విగ్రహాన్ని వున్నచోట నుంచీ కదిల్చే పరిస్థితి  లేదు. దాంతో ఉన్నచోటే నిమజ్జనం చెయ్యడం మొదలుపెట్టారు. అన్ని రోజులు పూజలందుకొన్న వినాయకుడు.. మన కళ్ళ ముందే  తన సుందర రూపాన్ని కోల్పోతూ వుంటే చూడడానికి నాకైతే మనస్కరించదు. పైగా ఈ నిమజ్జన కార్యక్రమం లో కార్పోరేషన్ నుంచి తెచ్చే మంచినీరు (శుద్ధి చెయ్యబడిన, ప్రజలకు అందాల్సిన త్రాగునీరు) టాంకుల కొద్దీ తెచ్చి విగ్రహం మీదకి పిచికారీ చేస్తూ విగ్రహాన్ని కరగ బెడతారు. ఎంతనీరు వాడారో అంతా వృధాగా పోవలసిందే. విగ్రహం సైజు పెరిగే కొద్దీ ఈ మంచినీటి వృధా ఇంకా పెరుగుతూ వుంటుంది. 
(ఈ మధ్యే పేపర్లో చూసాను..! నగరం లో సామాన్య ప్రజలకు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నెలకొల్పబడిన రక్షిత మంచినీటి కొళాయిలను ప్రభుత్వం అంచెలవారీగా తీసివేస్తుందట..!!) నీటిని ఇంతలా వృధా చేస్తూ ఆ వినాయకుడిని ఎకో ఫ్రెండ్లీ అని ఎలా భావించాలో అర్ధం కాదు.
 నిమజ్జనం యొక్క అసలు స్ఫూర్తి ఇది. ఈ బాలలు చేస్తూన్న వినాయకుడు నిజమైన పర్యావరణ మిత్రుడు.
 ఈ రకమైన కృత్రిమ నీళ్ళ టాంకు లను అందుబాటులోకి తెస్తే మంచి నీటి వృధాని చాలా వరకు తగ్గించ వచ్చు.
 *********
గణేశ  నిమజ్జనాల  తరువాత కనిపించే ఈ దృశ్యాలు ఎవ్వరినైనా కలవరపెట్టక మానవు.









  • ప్రభుత్వం ఈ విగ్రహాల సంఖ్య మీద ఖచ్చితంగా నియంత్రణ విధించాలి. ప్రతీ సంవత్సరమూ నిర్వాహకులు క్రొత్తగా పుట్టుకొస్తున్నారు. అలాగే విగ్రహాల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతోంది. ఫలితంగా కాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోంది.
  • ఊరేగించలేని లేదా హాండిల్ చెయ్యలేని సైజు లో విగ్రహాలు పెట్టడానికి అనుమతించకూడదు. 
  • చెవులు చిల్లులు పడేలా పెట్టే సౌండ్ సిస్టం మరియు అర్ధ నగ్న నృత్యాలు, మరియు చెత్త పాటలకి స్వస్తి పలకాలి.
  • నిర్వాహకులు వారి రికార్డుల కోసం, తద్వారా అక్కడకు వచ్చే భక్తులనుంచి డబ్బులు రాబట్టడం, లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో వుండే విగ్రహాలని ప్రజలే బాయ్ కాట్ చేస్తే మరీ మంచిది.
  • పర్యావరణ, కాలుష్య నియంత్రణ, అగ్ని మాపక శాఖ, పోలీసు, మరియు నగరపాలక సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి చేయాలి. ( MVP కాలనీ లో కూలిన విగ్రహానికి ఈ అనుమతులు లేవంటూ మర్నాడు పేపర్లో వచ్చింది. అవి లేకుండా ఇరవై రోజుల పాటూ దర్శనానికి ఎలా అనుమతించారో తెలీదు. నగర ప్రముఖులంతా దర్శనాలు చేసుకున్నారు. అలాంటి VIP లు వుండగా ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో..!!??) 
  • కొంత మంది సిక్స్ ప్యాక్ వినాయకుడు, అపరిచితుడు, అవతార్ లాంటి సినిమా గెటప్ లతో కూడా విగ్రహాలు పెడుతున్నారు. వాటివల్ల ఏ రకమైన భక్తిభావం కలుగుతుందో వారికే తెలియాలి.
  • రంగులు కూడా ప్రమాదకరమైన రసాయనాలతో తయారవడం వల్ల చెరువుల్లో వుండే చేపలూ మొదలైన జీవ జాతులకు కూడా అపాయం కలుగుతోంది. అందువల్ల వాటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. 
 
కనీసం రాబోయే దుర్గా పూజలకైనా లేనిపోని భేషజాలకు పోకుండా విగ్రహాలు కాలుష్య రహితంగా విగ్రహాలను ఏర్పాటు చేసే సద్బుద్ధినీ శక్తినీ ఈయమని కోరుకుందాం.

పూర్తిగా చదవండి...

Wednesday, August 31, 2011

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!


హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు  రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ  విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫోటోలు క్రింద చూడండి.




 


 






విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీలో తుది మెరుగులు: 
ఇక్కడి దాకా పోతపోసే అచ్చులుంటాయి కాబట్టీ ఒక రకం గా పని సులువే. కానీ ఇకపై ఉండేదంతా చేతితోనే చెయ్యాలి. అన్ని విగ్రహాల మీదా ఒకేరకమైన శ్రద్ధ చూపాలి. ఆహార్యం, అలంకరణ, ఆభూషణాలూ అన్నీ ముఖ్యమైనవే..!కళాకారుడి పనితనం తెలిసేది ఈ చివరి అంకంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.






మరింత పెద్ద విగ్రహాలు - ఎత్తు ముప్పై అడుగుల పైమాటే..!!
 కానీ ఈవిగ్రహాలలో చాలా వరకు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచెయ్యబడినవేనట. ఈసారి ప్రజలలో కూడా మట్టి విగ్రహాల వాడకంలో మంచి చైతన్యం వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొందరు మాత్రం పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నూ, రసాయన పదార్ధాలు కలిసిన రంగులనూ వాడుతున్నారు. అయితే విశాఖపట్నం లో తయారవుతున్న రెండు అతి భారీ విగ్రహాలు మాత్రం పర్యావరణానికి అస్సలు హానిచేయని రీతిలో పూర్తిగా మట్టితోనే తయారయి "మట్టితో భారీ విగ్రహాలను తయారు చెయ్యడం సాధ్యమేనా..?" లాంటి అనుమానాలను పటాపంచలు చేసాయి. రెండిటి లో ఒకటి 117 అడుగులు (గాజువాక) కాగా రెండోది (ఎం.వీ.పీ. కోలనీ) 95 అడుగుల పొడవు.
క్రింద వీడియో చూడండి.


 మట్టి విగ్రహాలు దొరికే స్థలాలూ, మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద చూపించిన లింకుల పై నొక్కండి.
పూర్తిగా చదవండి...

Sunday, August 28, 2011

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!


ప్రతీ ఏటా వినాయక చవితికి (వీలైనప్పుడల్లా) నేను మట్టితో వినాయకుడిని చేస్తాను. నా clay modelling talent ని బతికించి ఉంచడానికి ఒక కారణమైతే... ఇంకొకటి పర్యావరణ పరిరక్షణ. నేను మొట్టమొదట వినాయకుణ్ణి చేసింది మేము యలమంచిలి లో వుండగా..!! అప్పుడు నేను ఎనిమిదో క్లాసు చదూతున్నాను. మా  పక్కింట్లో ఒకతను వుండేవారు. ఆయన చెయ్యగా చూసాను. అడుగున్నర విగ్రహం..! అదే  స్ఫూర్తితో  వెంటనే వచ్చి ఇంట్లో తయారు చేసేసాను. ఆరంగుళాలు ఎత్తు..దానికి water colour painting కూడా చేసాను. కానీ అంత బాగా రాలేదు.

అప్పటినుంచీ మట్టితో చిన్న చిన్నవి బొమ్మలు తయారుచెయ్యడం హాబీగా మారింది. ప్రతీ సారీ వినాయక చవితికి రెండు రోజుల ముందు తయారు చేసేవాడిని. ఈసారి ఇంకా ముందుగానే పదిరోజుల ముందే తయారు చేసేసాను. నాతో పాటూ మా అమ్మాయి కృష్ణప్రియ  కూడా ఈసారి  తయారుచేసింది. మొదటి సారి చేసినా పర్వాలేదనిపించింది.

అయితే ఈ విగ్రహం తయారు చేసినా మళ్ళీ వినాయక చవితి రోజు పత్రితో పాటూ ఇంకో మట్టి విగ్రహం కొని దానికే ప్రధానం గా పూజ చేస్తాము. నేను చేసిన విగ్రహానికి పూజ  (ఒక్కొక్క పత్రం, పుష్పం, ఫలం, తోయం..) సింపుల్ గా ముగించేసి ఊరుకుంటాము. (అష్టోత్తర శతనామాలూ, షోడశోపచారాలూ చేస్తే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేయ్యాలేమోనని..ఈ దుర్బుద్ధి). వినాయక చవితి అయిపోగానే దానిని నేను చేసిన మిగతా బొమ్మలతో కలిపేసి, showcase లో పెట్టేస్తాను. అలాగ ఇప్పటివరకూ ఒక 10 విగ్రహాలు చేసి వుంటాను. విరిగిపోయినవి పోగా రెండో మూడో ఉన్నట్టున్నాయి.

సర్సరే..!! ఇక మేము చేసి బొమ్మల గోల పక్కన పెట్టేసి, ఇంతకీ మన బ్లాగు మిత్రులకందరికీ చెప్పొచ్చే విషయం ఏంటంటే...మట్టి తోనే విగ్రహాలు చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకొందాం. పైగా పిల్లలతో కలిసి మట్టితో విగ్రహాలు చేస్తే ఆ సరదాయే వేరు. మా బొమ్మల్నించి స్పూర్తి పొందినవారెవరైనా, రేపు ఎలాగూ ఆదివారమే కాబట్టీ, మీ ఇంట్లో పిల్లలతో కలిసి ఆ పనిలో వుండండి. వినాయక చవితి నాటి విశేషాలు అందరితోనూ పంచుకోండి...

జై జై జై గణేశ జై జై జై జై..!!

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ..!
నీ అండా దండా ఉండాలయ్య చూపించయా  త్రోవ..!!
మీ కందరికీ ముందస్తుగా vinaayaka chaviti శుభాకాంక్షలతో,

మీ రాధేశ్యాం మరియు కృష్ణప్రియ..

  

మా అమ్మాయి కృష్ణ ప్రియ చేతిలో రూపు దిద్దుకొన్న చిట్టి వినాయకుడు:
కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం కూడా పెట్టేసింది..! ఇంకోపక్క గ్లాసు తో  నీళ్ళు కూడా..!! గమనించండి.
 

నేను వేసిన మరికొన్ని బొమ్మలు నా ’కలాపోసన’ పేజీ లో చూడండి.  

పూర్తిగా చదవండి...

Saturday, July 2, 2011

నా కొత్త బ్లాగు: వాగ్గేయ సుధా స్రవంతి

నా కొత్త బ్లాగు:


ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, పురందరదాసు, తూము నరసింహదాసు, రామదాసు వంటి మహనీయుల రచనలలోని వాగామృత ధార..!!

 

ఉపోద్ఘాతం..

మన వాగ్గేయకారుల రచనల్లో భక్తితత్వానికి అగ్రతాంబూలం లభించినా మానవత్వానికీ, విలువలకీ, సామాజిక స్పృహకీ అద్దం పట్టే వారి వ్యాఖ్యలు వారి రచనల్లో సందర్భానుసారంగా దొర్లిన సందర్భాలు కోకొల్లలు. మనిషి అవలక్షనాలనూ, కుల మతాల ముసుగులోనో, ఆచార వ్యవహారాల పేరుమీదో సాటి మనుషుల మీద పెత్తనం చెలాయించే వర్గం యొక్క కుత్సితాన్నీ, బయట పెడుతూనే మానవ శ్రేయస్సుకూ వారి వ్యక్తిత్వ వికాసానికీ దోహదపడే సూచనలెన్నో మన వాగ్గేయకారుల రచనల్లో మనకు కనిపిస్తాయి. అలాంటి అమృతతుల్యమైన పలుకులను, కీర్తనలనూ, అందరం పంచుకోవడమే బ్లాగ్ ముఖ్యోద్దేశం. కుల, మత, భాషా, ప్రాంతీయ, భాషా భేదాలకతీతంగా 'వసుధైక కుటుంబం' గా ప్రజలందరూ మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది.

"సూక్తులు తెలియనిదెవరికి!? అంశం మీద బ్లాగులెన్ని లేవు..!? మళ్ళీ ఇదంతా అవసరమా..!!??"


కుండెడు తియ్యటి నీళ్ళని, చారెడు ఉప్పుతో రుచి మార్పించెయ్యోచ్చు. కానీ అదే కుండెడు ఉప్పునీళ్ళని మళ్ళీ మునుపటి తీయదనానికి తేవడం దాదాపు అసాధ్యం..! కానీ దానికి మరో పది కుండలు మంచినీళ్ళు కలిపితే ఉప్పదనం రుచికి అందదు..!! అందుకే ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తీయదనం పెరుగుతుందే గానీ తగ్గదు.


సూక్తులు అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టటానికి మానవ కల్పితమైన అవరోధాలు 'అవసరార్ధం' అనో, ' ఒక్కసారికీ..!' అనో గడిపేస్తుంటాం. మనో దౌర్బల్యానికి విరుగుడు మనం ఒకటికి పదిసార్లు 'వాక్సుధా స్రవంతి' ని మననం చేసుకొంటూ ఉండడమే. తద్వారా విలువలను మన జీవనంలో ఆచరిస్తూ సత్సమాజ నిర్మాణానికి మనవంతు తోడ్పాటు నందించగలం. 'వాగ్గేయ సుధా స్రవంతి' లక్ష్యానికే ఉడతాభక్తిగా తనవంతు కృషి చేస్తుంది

రెండునెలల క్రితం ప్రారంభించిన ఈ బ్లాగుని ఇప్పటికే చూస్తున్న వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి సలహాలూ సూచనలకు సర్వదా కృతజ్ఞుడిని. పైన చెప్పుకున్నట్లు మన వాగ్గేయ కారులు తమ రచనలలో కేవలం సంగీతం మాత్రమే కాకుండా మానవాళిని ఉద్ధరించే విలువలనూ, మరియూ సామాజిక స్పృహనూ కూడా అందించారు. అటువంటి అనర్ఘ రత్నాలను గుదిగ్రుచ్చి వీలైనంత మందికి మీ అందరి సహకారం తో అందించాలనీ, తద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వం మనందరి మనస్సులో విరబూయాలనే ఆకాంక్షతో చేస్తున్న ప్రయత్నమే ఇది. ఈ బ్లాగులోకం లో ఎందఱో మహానుభావులు, మేధావులూ, పండితులూ వున్నారు. ఇక్కడ ప్రచురింపబడే కీర్తనలకు వ్యాఖ్యానం నా చిన్న బుర్రకి తట్టినంత వ్రాద్దామనే ప్రయత్నం. ఇంకా విపులంగా చెప్పగల్గే పెద్దలు తమదైన  వ్యాఖ్యానాలను కామెంట్ల రూపం లో పంపి ఈ 'తత్వ శాస్త్రాన్ని' మరింతగా అర్ధం చేసుకోవడానికి తమ చేయూతనందిస్తారని ఆశిస్తూ..
- రాధేశ్యాం. 



పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)