Sunday, October 28, 2012

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
 ఈనాటి భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్ కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి ల సంగతులు తేలేలోగా, నిన్నటికి నిన్న, అదృష్టవశాత్తూ కొన్నాళ్ళు ఈ దేశప్రధానిగా కాలం వెళ్ళబుచ్చిన కర్నాటక రాష్ట్ర నాయకుడు దేవగౌడ, తాజా మాజీ సీఎం యడ్యూరప్ప మరియు ఇంకొందరి మీద ఆరాష్ట్ర లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
శీమతి సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాధ్రా గారు, డీ ఎల్ ఎఫ్ తో వారికున్న స్నేహాన్ని పురస్కరించుకొని వారికి ఓ నాలుగు ప్రాజెక్టులు ఇప్పిస్తే ఆ కంపెనీ వాళ్ళు ఈయనకి తమ లాభం కొంత పంచిచ్చారు అదే ఫ్రెండ్షిప్ కొద్దీ…! గడ్కరీ గారు ఎంతో ఉదారంగా తమ డ్రయివర్ ని ఒక పది కంపెనీలకి డైరెక్టర్ని చేస్తే పాపం ఆ డ్రయివరు రాముడు పది కంపెనీలకి డైరెక్టర్ని కదా అని తల ఎగరెయ్యకుండా మరింత శ్రద్ధగా తన డ్రయివరుగిరీ కొనసాగించి తన స్వామి భక్తినీ, విశ్వాస పాత్రతనూ చాటుకొన్నాడు…! ఈ రెండూ కూడా కొద్ది రోజుల వ్యవధిలో బయటకొచ్చిన సంగతులే. కొసమెరుపేంటంటే అల్లుడుగారికి క్లీన్ చిట్టూ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారి మీద విచారణకు ఆదేశించడం, రెండు నిర్ణయాలూ ఆగమేఘాల మీదే తీసుకొన్నాయి ఆయా ప్రభుత్వాలు, లేదా వ్యవస్థలు. ఇవి చాలదన్నట్టు ఒక టీవీ చానెల్ వారికీ, ఒక ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తకూ మధ్య జరుగుతున్న తంతు కూడా రోత పుట్టిస్తోంది.
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html
 ప్రభుత్వాలలో, రాజకీయ పార్టీలలో, లేదా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి ఇలా ఉంటే రోజూ మన కళ్ళ ఎదురుగా జరిగే సంగతులు కొన్నిఇలా ఉంటాయి :
మనం రైల్వే స్టేషన్ కి మన బంధువులని తీసుకురావడానికి వెళ్తాము. అక్కడ మన కారు పార్క్ చెయ్యడానికి పది రూపాయలు తీసుకొంటాడు. మనం ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికే చూస్తాము. రుసుము వసూలు చేసేవ్యక్తి కళ్ళుగప్పి చల్లగా జారుకోవడమో, లేక పార్క్ చేయలేదని, అసలు ఆగనేలేదని దబాయించడమో చేసి బోల్డు సంబర పడిపోతాము.  తనిఖీ జరగటం లేదని తెలిసిందా ప్లాట్ ఫాం టికెట్ అసలు తియ్యనే తియ్యం. కూరలు, పళ్ళూ అమ్మే చిరువ్యాపారుల దగ్గర వాళ్ళు పొరపాటున మనకి చిల్లర ఎక్కువ ఇచ్చేసినా గప్ చుప్ గా వెళ్ళిపోతాం. మనం కొన్న వస్తువుల జాబితాలోకి పక్కవాడి వస్తువు పొరపాటున కలిసిపోయిందనుకోండి.., మొదట బిల్లు లో అది కలిసిందా లేదా చూస్తాం. కలిస్తే నానా యాగీ చేస్తాం లేదా చాలా నిజాయితీ పరుడిలాగా ఫోజు పెట్టి అది మాదికాదని చెప్తాం. ఒకవేళ బిల్లు లో కలవక పోతే మాత్రం ఆహా ఇవాళ లేచిన వేళా విశేషం.. అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ’ఆమ్ ఆద్మీ అవినీతి’ జాబితా కొండవీటి చేంతాడంత అవుతుంది. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోకావచ్చు, బిల్లు కట్టడానికి క్యూలో నిలుచున్నప్పుడు కావచ్చు, . అవకాశం దొరికిన ప్రతీసారీ పక్కవాడి దాంట్లోంచీ చిలక్కొట్టుడు కొట్టేస్తాం. కానీ మన నిజాయితీ ఇమేజికి భంగం కలగ కుండా ’సమయానికి తగు మాటలాడి’ ఒక పకడ్బందీ సాకు వెదికి, తప్పు మనది కాదంటూ తీర్మానించి, అది అవతల వాడిమీదకి తోసేసి చేతులు దులుపుకొంటాం. 

 అంటే మనలో అందరూ లేదా చాలా మంది ఏదో ఒక విధమైన అవినీతిలో తెలిసో తెలియకో, కావాలనో లేక అసంకల్పితంగానో భాగస్తులమే అన్నది నిర్వివాదం. అందువల్ల ప్రొమోషన్ లిస్ట్ లో మనతోటివాళ్ళ కన్నా పైకి ఎగబాకడానికి పై లెవెల్లో లంచమిచ్చి మేనేజ్ చెయ్యడానికి వెనుకాడం.  డ్రైవింగ్ లైసెన్సో, పాస్ పోర్టో అర్జెంటుగా కావాలంటే  లంచమిచ్చి తెచ్చుకోవడాన్ని అవినీతిగా పరిగణించం. కానీ పేపర్లో రోజుకొకటి కనిపించే అవినీతిని మాత్రం చూసిమాత్రం గుండెలు బాదుకొని తీవ్రంగా నిరసిస్తాం. మళ్ళీ అవే రాజకీయ పార్టీలు ఏదైనా తాయిలాలు ఇస్తామంటే మాత్రం ఆ నాయకులు మనకు దైవ సమానులై  పోతారు. అంటే ఇందాక గుండెలు బాదుకున్నది దానిలో మనకు (మనం అంటే మనం అనే కాదు ఆ స్కాము వల్ల లబ్ధి పొందని/ పొందలేకపోయిన/ పొందడానికి అవకాశం రాలేని వాళ్ళందరూ ) భాగం రాలేదనా…!! ఇప్పుడు ఈ అవినీతిమయ రాజకీయ పార్టీలలోకి జరుగుతున్న వలసలూ, లేదా క్రొత్త సభ్యత్వాలూ జరుగుతున్నది ఆ పార్టీల / నాయకుల మీద ప్రేమా..??!! లేక ఆయన పంచన చేరితే అవినీతి సొమ్ములో ఆయన తినగా మిగిలిన ఎంగిలి మెతుకులైనా దక్కుతాయనే మోహమా..??!! ఓ నాలుగేళ్ళు అప్రెంటీసు చేసి ఆ కిటుకేదో కనిపెడితే భవిష్యత్తుకి ఢోకా ఉండదనే కపటమా..??!!
పూర్వం ఒకప్పుడు.., చాలా దశాబ్దాల క్రితం.., ప్రాచీన కాలంలో.., నాగరికత ఇంత అభివృద్ధి చెందని కాలంలో.., (అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే.. మీకూ నాకూ మనలో ఎవ్వరికీ తెలియని కాలంలో) సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడనే పదాలు భగవంతుడికి పర్యాయపదాలుగా వాడేవారు. కలడు కలండనెడువాడు కలడో లేడో.. కానీ ఇప్పుడా పదాలు “అవినీతి భూతానికి” సరిగ్గా సరిపోతున్నట్టున్నాయి. ఎందుకనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ, ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ, స్వామీజీలూ, ఒక్కరేమిటి అందరూ ఆ తాను ముక్కలే. ఈ నేపధ్యంలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడు స్థాణువై శిలామాత్రంగా మిగిలిపోతున్నాడు. 
ఒక్కడు బురదలో నడిస్తే గట్టున ఉన్నపదిమంది అసహ్యించుకుంటారు.., లేదా మొహం వాచేలా చీవాట్లు పెడతారు. అదే గట్టున ఉన్నది ఒక్కడూ, బురదలో నడుస్తున్నది పదిమంది అనుకోండి. ఈ గట్టున ఉన్న ఒక్కడినీ చూసి ఆ పదిమందీ పగలబడి నవ్వుతారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాడికీ ఆ మకిలి కాస్త అంటించేసి వెక్కిరిస్తారు. ఇప్పటి రాజకీయాలు, అవినీతి బురద పూసుకొని, ఆ బురదని మరో పదిమందికి పూసి ఆ కుళ్ళు మొహాలనే నేటి తరం ఫ్యాషన్ గా చెలామణి చేసేస్తున్నాయి..! నిదర్శనం కావాలంటే సగటు భారతీయుడిని నేటి అవినీతిమయ రాజకీయాలపైన అభిప్రాయం చెప్పమనండి..! ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాధపడేవాళ్ళ కన్నా, ఆ అవినీతికి సూత్రధారి అయిన పెద్దమనిషి తెలివితేటలకి అబ్బురపడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఈ లెవెల్ అవినీతికి ఆల్రెడీ ఆమోదముద్ర పడిపోయిందన్నమాటేకదా..! ముఖ్యంగా యువతలో..!!! 
నిజంగానే దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html

పూర్తిగా చదవండి...

Thursday, August 30, 2012

ఊలూకం లేక గుడ్లగూబ కథ

మా ఇంటి మేడ మీద గత నాలుగు రోజులుగా రాత్రి అయ్యేసరికి దర్శనమిస్తున్న గుడ్లగూబలు ఇవి. పొద్దున్న ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తాయో తెలీదు. కానీ రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయి. మా పిల్లలు గబ్బిలాలు అని ఒకసారి, గుడ్లగూబలు అని ఒకసారి అంటూ ఉంటే పెద్ద పట్టించుకోలేదు. నిన్న మా నాన్నగారు కూడా చెబితే చూసాను. గుడ్లగూబలు అంటే చిన్నప్పుడు చదివిన చందమామ సీరియల్ తోకచుక్క లో చతుర్నేత్రుడి బంటు ఊలూకుడి లాగా నల్లని శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే కళ్ళతో,  దిక్కులు పిక్కటిల్లేలా కూత పెట్టే భయంకరమైన రూపమే తట్టే నాకు ఇవి చాలా అమాయకంగా కనిపించాయి. రెండు పక్షులు, ఎత్తు సుమారు 12 నుంచీ పదిహేను అంగుళాల  పైనే ఎత్తు తో ఉన్నాయి.  ఎగిరినప్పుడు వాటి రెక్కల అంచుల వరకూ సుమారు మూడడుగుల పైనే ఉంటుంది. పైగా చాలా నిశ్శబ్దం గా ఉన్నాయి.
సాధారణంగా ఒళ్ళంతా మట్టి రంగు ఈకలతో లైట్ బ్రౌన్ కలర్ లో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుడ్లగూబలకు భిన్నంగా ఇవి ముందరి భాగం అంతా తెల్ల ఈకలతో ప్రత్యేకంగా కనిపించాయి.  వెంటనే ఫోటోలు తీయటానికి ప్రయత్నించాను. బయట బాగా మబ్బు పట్టి కొంచం వర్షం కూడా పడుతూ ఉండడం తో చాలా చీకటి గా ఉంది. ఇంతలో మా మాటలూ, మా పిల్లల అరుపులతో అవి మాఇంటి మీదనుంచీ, పక్క వాళ్ళ మేడమీద వాలాయి. అప్పుడే ఫోటో తీశాను. దూరం గా వుండడం తో ఫోటోలు సరిగ్గా రాలేదు.

మాఇంట్లో కనిపించిన గూబలతో పోలిన గుడ్లగూబలని గూగిలీకరించి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే  కనిపించిన ఫోటో ఇది:
వీటిలో చాలా రకాలు వున్నాయిట. దగ్గరగా పోలినవి రెండు రకాలు కనిపించాయి. ఒకటి Common Barn Owl, రెండు Masked  Owl.  మాకు కనిపించినవి ఏవో ఖచ్చితంగా తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

నేను తీసిన ఫోటోలు:






సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే పల్లెటూర్లలోనూ, పొలాల్లోనూ కనిపించే ఈ పక్షులు ఎలకలనీ, చిన్న చిన్న కోడిపిల్లల్నీ తిని బ్రతుకుతాయి. అలాంటిది ఇవి చెట్లన్నవే కనిపించని, మనుష్యులుండే హౌసింగ్ కాలనీలలోకి వచ్చేస్తున్నాయంటే, వాటి పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. వికిపీడియా లో  చూస్తే ఈ ప్రాణులను కొన్ని దేశాలలో అంతరించి పోతున్న జాతులలో చేర్చారట. కానీ మనం ఇంకా వీటి గురించిన విషయాలో చాలా భయాలూ, భ్రమలతో ఉంటున్నాం. ఇవి ఇంటిమీద వాలితే మంచిది కాదని, దాని అరుపు వింటే అరిష్ఠమనీ (నిజానికి వాటి అరుపు వినగానే చంపెయ్యడానికి సిద్ధపడే మనుషుల నుంచి వాటికే అరిష్టం.. అంతేకానీ మనుషులకి కాదు) ఇలా చాలా అశాస్త్రీయమైన మూఢ నమ్మకాలతో వాటి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాం. 
ఇది ఎలాంటిదంటే ఎవరో చేతబడి, బాణామతి లాంటివి చేస్తున్నారనే అర్ధం లేని అనుమానాలతో సాటి మనుషులని కూడా ఆలోచించకుండా వాళ్ళ పళ్ళు పీకడం, గాయ పరచడం, చంపెయ్యడం ఎంత అనాగరికమో ఇదీ అంతే. మనుషులు కాబట్టీ వార్తల్లోకి వస్తారు. వీటికి వార్తల్లోకి వచ్చే అంత  ప్రాముఖ్యం లేదు. అంతే తేడా..!    

నేను ఇవాళ పొద్దున్నే మా విశాఖపట్నం 'జూ' అసిస్టెంట్ క్యురేటర్ శ్రీ మహాలక్ష్మి నాయుడు గారితో మాట్లాడాను. వారు ఈ పక్షుల 'రకం' గుర్తించడానికి నిపుణుడైన వ్యక్తిని పంపుతానన్నారు. అలాగే ఈరోజు రాత్రి అవసరమైతే వాటిని జాగ్రత్తగా పట్టుకొని జూకు తరలించే ఏర్పాటు కూడా చేస్తామన్నారు.  చూడాలి ఏం జరుగుతుందో..!!


ఇవి మా విశాఖపట్నం జూలో నిద్రావస్థలో ఉన్న బార్న్ఔల్ రకానికి చెందిన గుడ్లగూబలు. వీటికి గల ప్రత్యేకత ఏమిటంటే వాటి ముఖం చుట్టూ ఉన్న హృదయాకారపు రింగు..!! అదే మాస్క్ డ్  ఔల్ రకానికి చెందిన పక్షికి ఆ రింగు కొంత భిన్నం గా ఉంటుంది.
(ది  హిందూ పత్రిక సౌజన్యం తో) 

అప్ డేటెడ్ సమాచారం
ఆ పక్షులకి కొంత దగ్గరగా వెళ్ళి ఫొటోలు తీశాను :

పూర్తిగా చదవండి...

Wednesday, August 1, 2012

మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు

(ఈ పోస్టు చాలా రోజులైంది మొదలుపెట్టి..! పూర్తి  చెయ్యడానికి ఇప్పటికి వీలు చిక్కలేదు. కాలదోషం పట్టినా పోస్టు చేశాను ఏమనుకోకండి..!)
మా పూరీ - భువనేశ్వర్ యాత్రా విశేషాలు (మొదటి రోజు - పార్ట్ 1)
ఎప్పటినుంచో పూరీ కోణార్క్ చూద్దామనుకుంటున్నాం, ఎలాగూ పిల్లలకి సెలవలే కదాని బయల్దేరాం. భువనేశ్వర్, పూరీ, కోణార్క్ లు చూడడానికి 3Nights and 4Days టూరిస్టు ప్యాకేజీ ఇంటర్నెట్ లో బుక్ చేసుకొన్నాం. టూర్ మొత్తానికి  ఏసీ కారు మనతో కూడా ఉంటుంది కదాని సమ్మర్ అయినా ధైర్యం చేసాం..!  వీకెండ్ కలిసొచ్చేటట్టు శుక్ర వారం బయలుదేరి, మంగళవారం ఫ్రొద్దున్నే తిరిగివచ్చేటట్లు ప్లాన్ చేసుకొన్నాం. 
భువనేశ్వర్ కి విశాఖపట్నం నుంచీ విమానంలో చేరుకోవడంతో మా టూర్ మొదటిరోజు ప్రారంభమయింది. ఎయిర్ పోర్ట్ కి మా గైడు కమ్ డ్రైవర్ వచ్చి రిసీవ్ చేసుకొన్నాడు. పదిన్నర కి ఎయిర్ పోర్ట్ బయట కాలు పెట్టడం తోనే అక్కడి ఎండ, వేడి, ఊక్కపోత అనుభవం లోకి వచ్చాయి. ఏసీ కారు లో కూర్చోగానే ప్రాణం లేచొచ్చింది. తిన్నగా హొటెల్ లో చెక్-ఇన్ చేసి అరగంటలో మళ్ళీ రోడ్డెక్కాం. ఆరోజు కార్యక్రమం నందన్ కానన్ జూ, బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ఖండగిరి-ఉదయగిరి హెరిటేజ్ సైట్, మళ్ళీ భువనేశ్వర్ లో రాత్రి బస.  
బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని మొట్టమొదట నందన్ కానన్ జూ కి వెళ్ళాం. డ్రైవర్ మమ్మల్ని గేటు దగ్గర వదిలేసి ఈ జూలో తెల్ల పులులూ, సింహాల సఫారీలు ప్రధాన ఆకర్షణ. ఎంట్రెన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళక ముందే గైడ్ నంటూ ఒక వ్యక్తి వెంటపడ్డాడు. ఇవి చూపిస్తాను అవి చూపిస్తానంటూ ఒకటే రొద పెట్టసాగాడు( పైగా వెయిటింగ్ టైమ్ లేకుండా..!). నేను అక్కర్లేదు పొమ్మని అక్కడి సమాచార కేంద్రం లో వివరాలు కనుక్కొంటే వాళ్ళు చెప్పిన సంగతులు ఇవి: లోపల తిరగడానికి మనకార్లు తీసుకెళ్ళకూడదట. బ్యాటరీ తో నడిచే ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసారట. అదికాక సఫారీకి వేరే బస్సు ఉంటుందట. వాటికి టిక్కెట్లు తీసుకోవడానికి జూ లోపలే మళ్ళీ క్యూలు ఉంటాయట. పైగా గంటకి ఒకటి వస్తుందిట.. అందుకని ఆయా వాహనాలు వచ్చేంత వరకూ వేచి ఉండాలిట. అర్రె.. అతడిని అనవసరంగా పొమ్మన్నానే..! అనుకుని తలతిప్పేసరికి అతను అక్కడే ఉన్నాడు మమ్మల్నే గమనిస్తూ..!! సరే కానిమ్మని అతనిని ఫాలో అయిపోయాం. మమ్మల్ని చెట్టునీడలో కూర్చోపెట్టి అతను వెళ్ళి బ్యాటరీ వాహనానికి క్యూలో నించున్నాడు. కౌంటర్ లో అడిగితే గంట సేపు ఆగాలన్నాడు బండి కోసం. ఈలోపల సఫారీకి వెళ్ళిపోవచ్చని, మమ్మల్ని ఆ లైనులో నిలబెట్టాడు మా గైడు. పదినిముషాలలో బస్సు వచ్చింది. 


తెల్లపులులూ, సింహాల సఫారీ లోకి వెళ్ళాము. సఫారీలో జంతువుల్ని చూడ్డానికి వచ్చిన వారిని  బస్సులో (బోనులో)  ఉంచి జంతువుల్ని స్వేచ్చ గా వదిలేస్తారు. ఎండవేడికి అవి బయటకు రావట్లేదుట ప్రతీరోజూ..!! లక్కీ గా ఆరోజు మాకు తెల్లపులులూ , జీబ్రా, సింహాలూ కనిపించాయి. అప్పుడు బాటరీ తో నడిచే వాహనం ఎక్కి మిగిలిన జూ చూశాం. పిల్లలకి చాలా నచ్చింది. అక్కడే ఉన్న బొటనికల్ గార్డెన్ లో కూడా కొంతసేపు గడిపాం.
 

అక్కడి నుంచీ బయల్దేరి ఖండగిరి - ఉదయగిరి చేరుకొనే త్రోవలో ఒరిస్సా ప్రభుత్వం నెలకొల్పిన ట్రైబల్ మ్యుజియం చూసాం.  ముందు అబ్బా..! ఏం చూస్తాంలే అనుకున్నా(ఎందుకంటే అంతకు ముందే అరుకు లో చూసాం) ఎలాగూ త్రోవే కదా అని వెళ్ళాం. 



  


కానీ మేం వెళ్లేసరికి అది క్లోజ్ చేసేసే టైం అయిపొయింది. ఆవిషయం మాకు తెలీదు. మేమే ఆరోజుకి లాస్ట్ ఎంట్రీ..!! లోపలి వెళ్ళాక అది చాలా నచ్చింది. అరుకు మ్యూజియం కన్నా చాలా బాగుంది. ప్రదర్శన కు ఉంచిన వస్తువులు కూడా ఎంతో ఆసక్తికరం గా ఉన్నాయి. ట్రైబల్స్ (ఈ మాటకు తెలుగు పదం తట్టట్లేదు) వాడే విల్లు బాణాలు, కత్తులు మొదలైన వేటకి వాడే వస్తువులూ, ఆయుధాలతో పాటూ, వారి సాంస్కృతిక, వారసత్వ, కళా రూపాలను కూడా ప్రదర్శనకి ఉంచారు. వారి సంగీత పరికరాలూ, చిత్రకళ, వ్యవసాయానికి వాడే పనిముట్లూ, వంటకి వాడే గిన్నెలూ గరిటెలు, వారి దుస్తులూ, అలంకరణ సామాన్లూ, ఆభరణాలూ ఒకటేమిటి..గిరిజన జీవన శైలిని ప్రతిబింబించే ప్రతీ వస్తువూ ఆయా విభాగాలకి అనుగుణంగా అమర్చబడి ఉన్నాయి. కానీ వాటి లోనే వారి సామాజిక హోదాకి  అద్దం  పట్టే విధంగా డిజైన్లలోనూ, ఆకారాలలోనూ, మెటీరియల్ లోనూ ప్రస్ఫుటమైన తేడాలు ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
మ్యూజియం నుండీ బయటకు వచ్చినతరువాత ఆరుబయలులో ఆ ప్రాంతపు ప్రజల గృహనిర్మాణ పద్దతులు, ప్రార్ధనా స్థలాలకూ కూడా నకళ్ళు నిర్మించారు. బయట తప్ప లోపల ఫోటోలు తీయటానికి అనుమతించలేదు. కానీ అక్కడి ఉద్యోగులు చాలా ఓపిగ్గా అన్ని వివరాలు చెబుతూ చూపించారు (సమయం దాటిపోయినా సరే). తీరికగా చూస్తే కనీసం రెండు గంటలైనా పడుతుంది. వారిని మరి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వారికి కలిగించిన అసౌకర్యానికి మన్నించమని, ధన్యవాదాలు చెప్పి  బయటకు వచ్చేశాం.
        అప్పటికి ఎండ తగ్గి చల్లబడింది. అక్కడినుంచి ఖండగిరి - ఉదయగిరికి పది నిముషాలలో చేరుకొన్నాం. అవి అశోకుడూ, కళింగ యుద్ధం నాటి కన్నా ముందరే నిర్మించ బడిన ఏకశిలా జైన గుహాలయాలు. ద్రవిడ, ఒరిస్సా ఆలయ నిర్మాణ శైలులు (Dravidian and Orissan Styles of Architecture) పూర్తిగా రూపు దిద్దుకోక ముందరి నిర్మాణాలు. 


 మా అబ్బాయికి టూర్ మొత్తం మీద బాగా నచ్చిన ఈ ప్లేస్ గురించి వచ్చే పోస్టు లో...!! 
పూర్తిగా చదవండి...

Saturday, May 12, 2012

భారతదేశం లోని హస్తకళలన్నీ సంకలనం చెయ్యబడిన ఈ-పుస్తకం (ఆన్ లైన్)




మనదేశానికి హస్తకళల విషయం లో మొదటి నుంచీ మంచి పేరుందన్న  సంగతి  తెలిసిందే. యూరప్ లో ప్రజలకి ఇంకా బట్ట కూడా కట్టడం రాని సమయానికి మన దేశంలో తయారైన చేనేత వస్త్రాలకు మంచి పేరు ఉండేది. వస్త్రాన్ని కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాక వాటిని వైవిధ్యమైన పద్ధతుల్లో నేసి, వాటికి రకరకాల రంగులు, పూసలూ మొదలైన వస్తువులతో అలంకరణ కూడా చేసే స్థాయిలో పనితనం  చూపేవారు ఇక్కడి కళాకారులు. అలాగే నేత చీరలను అగ్గిపెట్టెలో పట్టేంత నాజూకుగా తయారుచేసిన చరిత్ర మనది. 

పైన చెప్పిన విషయం మచ్చుకి చెప్పిన చిన్న ఉదాహరణ మాత్రమే..! మన దేశ హస్తకళలు భారతీయులందరూ గర్వించదగ్గ వారసత్వ సంపద.  మన కళాకారులు వాడే ముడి సరుకు ఏదైనా గానీ  దానిని వారు తీర్చిదిద్దే తీరు తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మట్టి, రాయి, రెల్లుగడ్డి, వెదురు, తాటాకులు, కంచు ఇత్తడి  లాంటి  లోహాలు, కొబ్బరి పీచు, కొయ్య , లక్క, దారం లాంటి వస్తువులు మన దృష్టిలో  పెద్ద విలువైన  వస్తువులుగా  అనిపించవు. అవే చవకబారు వస్తువులు ఈ కళాకారుల చేతిలో పడితే మాత్రం అత్యద్భుత మైన కళాఖండాలుగా రూపు దిద్దుకుంటాయి. ఒక సారి చూసిన వారికి కళ్ళు తిప్పుకోలేకుండా చేస్తాయి. 

ప్రొ . ఎం. పీ. రంజన్ గారు, అహ్మదాబాదు 
కాని అలాంటి కళాఖండాల తయారీ వెనుక ఉన్న కష్టం, అలాంటి కళాకారుల నేపథ్యం మొదలైన విషయాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. అలాంటి విషయాలన్నీ క్రోడీకరించి ఒక పుస్తకరూపంలో విడుదల చేయడానికి  పూనుకున్న వ్యక్తి ప్రొ. ఎం.పీ. రంజన్ గారు. 
భారతదేశం మొత్తం మీద కనిపించే ఇలాంటి హస్తకళలనూ, వివిధ ప్రాంతాల కళారూపాలను  Handmade in India: An encyclopedia of the handicrafts of India అనే పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ఈ  పుస్తక రూపకల్పనలోనూ   సంపాదకత్వం  లోనూ   వారి  శ్రీమతి  అదితి రంజన్ గారు కూడా  పాలుపంచుకొన్నారు. సుమారు అయిదు వందల యాభై పేజీలున్న ఈపుస్తకంలో ఇంత  సమాచారాన్ని  పొందుపరచడం వీరితో పాటూ  మరెందరి కృషి వల్ల సాధ్యపడిందో  తలుచుకుంటే  అబ్బురమనిపిస్తుంది.
ఈపుస్తకం ఖరీదు సుమారు నాలుగువేల రూపాయలు.  ఇలాంటివి మరో మూడు భాగాలు సిద్ధం కావలసి ఉందిట. 
అయితే ఈపుస్తకం లోని సమాచారాన్నంతా ఇంటర్నెట్ లో చూసుకోవడానికి వీలుగా ఈ క్రింది లింకులో ఉచితం గానే  ఉంచారు.
భారతదేశం లోని చేతివృత్తులన్నీ సంకలనం చెయ్యబడిన ఈ-పుస్తకం (ఆన్ లైన్) దేశంలోని రాష్ట్రాల వారీగా ఈ కళలను, వాటికి సంబంధించిన వివరాలను ఒక విజ్ఞాన సర్వస్వం లాగా  సమగ్రంగా  బొమ్మలూ, మ్యాపులతో సహా ఉంచారు. అలాగే ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషలో ఈ సమాచారాన్ని అందుబాటు లోకి తేవడం ఇంకా బాగుంది. దానిలో కూడా జిల్లాలవారీగా ఏయే హస్త కళలు  కనిపిస్తాయో, దానికి వాడే ముడి  పదార్ధాలూ, పనిముట్ల గురించి కూడా పొందు పరిచారు. మన రాష్ట్రానికి సంబంధించిన లింక్ ఈ క్రింద చూడండి.
ఆంద్ర ప్రదేశ్ గురించి ఇంగ్లీషులో
ఆంద్ర ప్రదేశ్ గురించి  తెలుగు లో

   


 Detail of the carved and painted wood work inside a prayer hall in Thiksey Monastery, Ladakh




పై పుస్తకం పై మరిన్ని వివరాలను, ప్రొ. రంజన్ గారి బ్లాగులు  చూడాలంటే ఈ క్రింది లింకులు నొక్కండి.

http://www.visible-information-india.blogspot.in/2007/08/information-architecture-for-handmade.html
http://design-for-india.blogspot.in/2007/08/handmade-in-india-handbook-of-crafts-of.html

Handmade in India: 
An encyclopedia of the handicrafts of India


576 pages, 3500 colour photographs and 140 maps, 9.5 x 13.5” (240 x 340 mm), hc, October 2007, ISBN: 978-81-88204-57-1 (Mapin), Series ISBN: 978-81-88204-49-6 (Mapin), Copublished in association with COHANDS
First published in India in 2007 by :
Council of Handicraft Development Corporations (COHANDS)
New Delhi

Printed and produced by:
Mapin Publishing Pvt. Ltd.
10B, Vidyanagar Society Part 1, Usmanpura, Ahmedabad 380014, India
T | 91-79-2754 5390 / 2754 5391     F | 91-79-2754 5392
E | mapin@mapinpub.com     www.mapinpub.com

Conceived, researched, edited and designed by:
National Institute of Design (NID), Ahmedabad

Text, photographs and graphics - 2007 National Institute of Design (NID), Ahmedabad and Development Commissioner (Handicrafts), New Delhi

Project funded by
Office of the Development Comissioner Handicrafts, Ministry of Textiles, Government of India

Crafts of India Series ISBN :978-81-88204-49-6
Handmade in India ISBN:978-81-88204-57-1
LC:2005929526

Editors:Aditi Ranjan, M P Ranjan
Designers:Zenobia Zamindar, Girish Arora
Printed at :Tien Wah Press, Singapore
పూర్తిగా చదవండి...

Monday, May 7, 2012

తాటాకు, తాటి చెట్టు ప్రశస్తి..!


ఎండాకాలం ఎండలు మండే కాలం. మా వైజాగులో వేడికి తోడు విపరీతమైన ఉక్కపోత. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు.. ఈ మధ్య నెలరోజులుగా కరెంటు కూడా తీసేస్తూండడంతో ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి. మొన్న ఒకరోజు పొద్దున్నే తీసేసి మళ్ళీ రాత్రి దాకా ఇవ్వలేదు. ఆ రోజు నేను ఆఫీసులో ఉండగా మా అమ్మగారు ఫోన్ చేసి అరడజను విసన కర్రలు కొని తెమ్మన్నారు. "అన్నెందుకు వేస్టు..!" అనుకోని బజారు కెళ్తే అయిదు రూపాయలకి ఒకటన్నాడు. ఒక్కసారి షాకయ్యా..!! వాటి ఖరీదు అంతతక్కువని అనుకోలేదు. (మా అమ్మగారూ షాకయ్యారు.. వాళ్ళ చిన్నప్పుడు పావలాకి ఒకటి, రెండూ వచ్చేవిట ) చిల్లర లేకపోవడంతో   యాభై రూపాయలకి 10 కొని పట్టుకెళ్ళా. కానీ ఇంటికి వెళ్లి చూస్తే గానీ పరిస్థితి అర్థం కాలేదు. పది కూడా చాలవనిపించింది.

చీకటి పడ్డాక ఊరంతా కరెంటు లేకపోవడంతో  మా ఇంట్లోవాళ్ళూ  క్రింద అద్దె కున్నవాళ్ళూ  అందరూ  భోజనాలు  ముగించి డాబా మీదకు  చేరారు. 
మేడ మీద చాపమీద పడుకొని విసనకర్రతో  విసురుకుంటూ ఆకాశం లో నిండు చందమామని (దగ్గరలోనే 'సూపర్ మూన్' కూడా ఉందిట) చూస్తూ ఉంటే ఆహా..! పైగా కొత్త విసనకర్ర  నుండి వచ్చే పచ్చి తాటాకు వాసన.. అబ్బో..మాటల్లో చెప్పలేం..!!
సరిగ్గా అప్పుడే తట్టింది ఈ తాటి చెట్టు, తాటాకు ప్రశస్తి..!
**************
అసలీ తాటి చెట్టు ప్రసక్తి రామాయణ భారతాల లోనే వుంది. శ్రీరాముడు  తనమీద సుగ్రీవుడికి  నమ్మకం  కలిగించడానికి  ఏడు  తాటి చెట్లను ఒక్క బాణం తోనే పడగొట్టాడట.  తాటి చెట్టు అనగానే వేసవిలో వచ్చే  తాటి ముంజులు గుర్తుకొస్తాయి. అవి తినడానికి ఇష్టపడని వాళ్ళెవరు చెప్పండి..?  ఒక్కో తాటికాయలో రెండు, మూడు లేదా నాలుగు ముంజులుంటాయి. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో పల్లెటూర్లలో చెట్టు మీద నుంచీ అప్పుడే దించిన కాయల్లో ముంజులు మన బ్రోటనవేలే స్పూన్లుగా డైరెక్టుగానే తినేసేవాళ్ళం. ముంజులు ఒలిచి తట్టల్లో పెట్టుకొని ఇళ్ళకి తెచ్చి అమ్మేవారు. ఇవికాక తాటి తాండ్ర, తాటి బెల్లం, తాటి తేగలు కూడా తింటారు. తాటి కల్లు సంగతి సరేసరి. ఇప్పటికీ ఇంకా వాడుతున్న/ వాడబడుతున్న, ఎంతోమందికి నోరూరించే తాటి ఉత్పత్తి.




 
 



చెరకు బెల్లం, తాటి బెల్లం 







తాటాకుల ఉపయోగాలు అనేకం..!
మొట్టమొదటగా కాగితాలూ, పుస్తకాలూ వినియోగం లోకి రాక ముందు తాటాకులే కవుల కావ్య రచనకు ఉపయోగపడేవి. వీటిమీద ఇప్పుడు బొమ్మలుగీసి కూడా అమ్ముతున్నారు.  పేదవాడి గూటికి పైకప్పుగా విరివిగా వాడతారు. వాసాలుగా తాటి దూలాలే వాడడం తెలిసిందే..! ఇప్పటి షామియానాలు రాకముందు పెళ్ళిళ్ళకి తాటాకు పందిళ్ళు వేసేవారు. విసనకర్రలు, చేదలూ(కొన్ని ప్రాంతాలలో దీనిని 'బొక్కెన' అంటారనుకుంటా)
'గిడుగు' అనబడే తాటాకు గొడుగు (దీనిలో సైజు లుండేవి..పెద్దది సుమారు 5 అడుగుల వెడల్పు వుండేది. ఇప్పటికీ పల్లెల్లో పశువుల కాపర్లు వాడుతుంటారు.), తాటాకు చాపలు కూడా తయారు చేసేవారు. ( పూర్వం పెళ్ళిళ్ళల్లోనూ లేదా ఎక్కువ మందికి భోజనాలు వండేటప్పుడు వండిన అన్నాన్ని గంజి వార్చిన తరువాత ఈ తాటాకు చాపల మీద కొంచం సేపు ఆరపోసేవారు.)


విసన కర్రలు, తాటాకు బుట్ట..

తాటాకుల మీద బొమ్మలు వేసే పద్ధతిని ఇక్కడ చూడండి

తాళ పత్రాలు 
గిడుగు

 

 పైనున్న వాటిల్లో మొదటిది తాటాకు చాప, రెండోది కొబ్బరాకుల చాప.

తాటి, కొబ్బరి ఆకులతో పెళ్లి మంటపాల అలంకరణ 
చిన్నపిల్లలు  తాటాకులతో బొమ్మలు తయారు చేసుకొని వాటికి బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసేవారట. అలాగే  తాటాకులతో బూర, వాచీ, లాంటి బొమ్మలు కూడా చేసుకొనే వాళ్ళు. 


బూర (whistle )

రిస్ట్ వాచీ.


తాటాకు గిలకలు.. ఇలా బంతుల లాగా తయారు చేసి దానిలో రాళ్ళు వేసి ఒక కర్రపుల్లని హాండిల్ గా పెట్టి ఆడిస్తే  గలగల లాడుతూ శబ్దం చేస్తాయి. చంటి పిల్లలకి ఆటవస్తువులుగా పనికొచ్చేవి.
తాటి రేకు  టపాకాయలు.
తాటి రేకుతోనే చేసిన ప్లేటు
తాటాకు చేద: బావిలో నీళ్ళు తోడుకోవడానికి ఉపయోగించే పరికరం. ఇప్పుడిది చాలా వరకు  కనుమరుగైపోయిదనే  చెప్పాలి. పూర్వం పల్లెల్లో ఇది వాడేవారు. కానీ ఈమధ్య ఎక్కువ మంది ప్లాస్టిక్ డబ్బాలే వాడుతున్నారు.  అయినా ఇప్పుడన్నీ బోరుబావులే కానీ మంచినీటి బావులే కరువైపోతున్నాయి కదా ఇప్పుడు..!


తాటాకు చేద లాగే ఉన్న ఈ సంగీత వాయిద్యాన్ని చూడండి. Sasando అంటారుట  దీన్ని. శబ్దం మాత్రం గిటార్, మాండొలిన్ లను పోలి ఉంది. దక్షిణ ఇండోనేషియా లో కనిపించే ఈ పరికరం మీద  వీనుల విందైన సంగీతం విని ఆస్వాదించండి.





ఇప్పటికీ గ్రామాల్లో పొలాలకి హద్దుగా తాటి పెండు (తాటి చెట్ల వరుస లేదా గుంపు) లనే  చూపుతారు. మోటార్లు  లేకమునుపు బావుల్లోంచీ పొలాలకి నీరు తోడడానికి వాడే 'ఏతాం' తాటి దుంగలతోనే చెయ్యబడేది. తాటి తోపుల్లో  దయ్యాలు ఉంటాయని అని నమ్మే వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు.
ఇకపోతే తాటి చెట్టు కి సంబంధించిన సామెతలు తెలుగులో చాలానే వున్నాయి. మొట్ట మొదటి పేరాలో ఒకటి ఆల్రెడీ వ్రాసేశాను. కోపం తాటాకు మంటలా ఉండాలంటారు. తాడిలా పెరిగాడంటారు. తాడిని తన్నేవాడితలదన్నే  వాడుంటారు   తాటి చెట్టు  వల్ల  ఇన్ని లాభాలు  ఉన్నా  తాటి  చెట్టు  నీడ, తాగుబోతు  మొగుడూ  ఎందుకూ  పనికిరారు అంటారు. చివరగా తాటి చెట్టు నీడ పనికిరాదన్న విషయాన్ని చెబుతూ  ఏనుగు  లక్ష్మణ  కవి  ఇలా  అంటాడు:
“ధర ఖర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై
త్వరతోడన్‌ పరువెత్తి చేరినిలిచెన్‌ తాళద్రుమఛ్ఛాయ త
ఛ్ఛిరమున్‌ తత్ఫలపాత వేగమున విచ్చెన్‌ శబ్దయోగంబుగా
పొరి దైవోపహతుండు పోవునెడకుం పోవుంగదా ఆపదల్‌”   
ఒక బట్టతలవాడు మండుటెండలో ప్రయాణం చేస్తూ  ఎండకు బుర్ర కాలిపోతూ ఉంటే, ఆ వేడికి తట్టుకోలేక నీడకోసం తాటిచెట్టు కిందికి పరుగెత్తాడట. ఎండ నుంచి రక్షించుకోవడానికి దానికింద చేరితే చెట్టు పైనుంచి తాటిపండు అతని నెత్తిమీద పడింది. పాపం అతని తల పెద్ద చప్పుడుతో పగిలిపోయిందట . దురదృష్టవంతుడు ఎక్కడికి పోయినా ఆపదలు వెంటాడుతాయనేది కవి వ్యాఖ్య. 
అందువల్ల ఒక్క నీడ విషయంలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ తాటి చెట్టుకి నూటికి నూరు మార్కులే..!! 
(ఇంతలో కరెంటు వచ్చేసింది. అందరూ 'తాటాకు పంఖాలు' వదిలేసి మళ్ళీ సీలింగ్ ఫ్యానుల కిందకి చేరారు.) 
మనం కూడా ఇంక ఈ ముచ్చట్లు ఆపి మళ్ళీ రేపటి వరకూ విసనకర్రలకి చెబుదాం  సె 'లవ్' (Say Love) 
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)