Sunday, November 3, 2024

 

 

 

 

 

 






 

 

 

 

 

 

 

మేఘవిస్ఫూర్జితవృత్తము

శిరః కల్హారామోదవశ మధులిట్ఛ్రేణి ఝంకారముల్, శ్రో/
ణి రాజత్కాంచీ కింకిణి రణితముల్, స్నిగ్ధవక్షోరుహద్వం/
ద్వరోధోలోలత్ కచ్ఛపిముఖ మృదుక్వాణముల్.. సర్వనాదై/
కరూపాత్మౌజ శ్శ్రీ బయలు పరుపన్ గ్రాలు వాణిన్ భజింతున్!

(అవధానిపితామహ శ్రీ సి వి సుబ్బన్నశతావధానిగారు.. 1971 నెల్లూరు శతావధానములో..వాగ్దేవీ ప్రార్థనము)

పూర్తిగా చదవండి...

Thursday, March 3, 2022

బ్రహ్మానందంగారి కారులో నేను..!


మీకు ఎప్పుడైనా హాస్యనటుడు బ్రహ్మానందంగారి కారు ఎక్కే అవకాశం వచ్చిందా..!?

నమ్మండి నమ్మకపొండి..! నాకొచ్చింది.

నేను ఇంటర్ పూర్తయి ఆర్కిటెక్చర్ లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం..! అప్పటికి ఇంకా మాకాలనీలో రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం సాయంత్రాలలో..! ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఉండగా మా పక్కనే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆగింది. కారులో వెనుక సీటులో ఇద్దరు కూర్చున్నారు. ఎడమచేతి వైపు ఉన్నతను కారు కిటికీలోంచి తల బయటకిపెట్టి ఒక అడ్రెస్ ఏదో చూపించి ఎక్కడ అని అడిగారు. మా కాలనీకి ఒక అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరో కాలనీ అడ్రెస్ అది. నేను ఎలా వెళ్ళాలో చెబితే, ఒక్కసారి కూడా వచ్చి చూపించగలవా, మళ్ళీ ఇక్కడే దింపేస్తాం అని అడిగారు.

సరే దాందేముంది అని కారు ఎక్కాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాను. తీరా తలతిప్పి చూస్తే డ్రైవర్ వెనుక సీట్లో, నాకు cross గా… మీరు నమ్మండి నమ్మకపొండి… None other than the great బ్రహ్మానందం..! నాకు మతిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అడిగిన Address కి యాంత్రికంగా తీసుకుపోయాను. శ్రీ బ్రహ్మానందం గారు ఆ ఇంటి గేట్ దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయారు. నేను, ఇందాక నన్ను పిలిచి అడ్రెస్ అడిగిన రెండో వ్యక్తి,, కారు డ్రైవరు.. మిగిలాం, రోడ్డు మీద కారు దిగి..! వారు అప్పటికే అహనాపెళ్ళంట, ఇత్యాది చిత్రాల సూపర్ హిట్లతో మంచి కమెడియన్ గా తెరమీద జోరు మీద ఉన్నారు. అంతకు ముందే దూరదర్శన్ లో వారి మిమిక్రీ కార్యక్రమాలు కూడా ఒకటి రెండు చూసి ఉన్నాను.

ఇక చూస్కోండి..! నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

బ్రహ్మానందం గారు కదండీ..! ఇలా వచ్చారేమిటీ, ఏదైనా షూటింగా, అంటూ ఆ రెండో వ్యక్తిని ఏవేవో ప్రశ్నలతో దంచేశాను. ఆయన చాలా ఓపిగ్గా ఔను బాబూ, షూటింగ్ కే వచ్చాం. ఇది వాళ్ళ చుట్టాలెవరిదో ఇల్లు..! పది నిమిషాలలో వచ్చేస్తారు అని, అంటూ నన్నెక్కడైనా చూశావా అని అడిగారు..!

"లేదండీ, గుర్తులేదు..!" అన్నాను. నేనింకా బ్రహ్మానందం కారెక్కాను అన్న షాక్ లోంచి ఇంకా తేరుకోలేదు. ఓహో, అని క్షణం ఆగి,

" సినిమాలు చూస్తావా..?" అని అడిగారు.

"చాలా తక్కువండీ" అన్నాను కాస్త విసుగ్గా, ఆ యింట్లోకి తొంగి చూస్తూ..!
" అహ నా పెళ్ళంట సినిమా చూశావా..?" మళ్ళీ ఆయనే అడిగారు.
"ఆఁ, చూశానండీ, దాన్లో బ్రహ్మానందంగారు కడుపుబ్బా నవ్వించారు కదండీ" అన్నాను.
ఆయన కూడా చిన్నగా నవ్వుతూ ఆఖరి సీను గుర్తుందా అని అడిగారు. "అక్కడ ఐతే అసలు సీట్లలోంచి దొర్లిపోయేటట్టు నవ్వొచ్చింది." అప్పటికే అది తలుచుకొని నవ్వేస్తున్నాను నేను.
"ఆ సీన్లో బ్రహ్మానందం ప్రక్కన చేరి ఆయన ఏదో కష్టపడి కష్టపడి చెప్తే అంతా అయ్యాక.. వినబళ్ళా అంటూ ఉంటాడు..!?"

అయ్యబాబోయ్ ఆ సీను.. అంటూ మరింత గట్టిగా నవ్వుతున్న వాడిని బాక్ గ్రౌండ్ లో గ్లాసు పగిలిన సౌండ్ వచ్చి,

నవ్వు సడన్ గా ఆపేసి, "మీరు.. మీరే కదండీ..!" అన్నాను..! "సారీ సర్, గుర్తు పట్టలేకపోయాను.., ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటున్నాను కానీ తట్టలేదండీ..! వెరీ సారీ అండీ" అంటూ తెగ ఇదై పోయి.., "ఇంతకూ మీ పేరు గుర్తు లేదండీ" అనిన్నీ అన్నాను. "పరవాలేదండీ, నన్ను గుండు హనుమంతరావు అంటారు..!" అన్నారు.!


 

చాలా మొహమాటం వేసింది అలా మర్చిపోయినందుకు.

మళ్ళీ నన్ను తెచ్చి మా వీధి చివర్న దించేసి వెళ్ళిపోయారు.

ఆ తరువాత మరోసారి (అప్పటికి నేను ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీసు చేస్తూ 15 years పైనే అవుతోంది. అంటే నేటికి సుమారు 10 years క్రితమన్నమాట) ఏదో ప్రాజెక్ట్ పని మీద విశాఖనుంచి హైదరాబాద్ విమానంలో వెళ్తూ ఉంటే నా సీటు శ్రీ గుండు హనుమంతరావు గారి ప్రక్కనే వచ్చింది. వారిపక్కన విండో సీటులో గీతా సింగ్ గారు మంచి నిద్రలో ఉన్నారు.

పై స్టోరీ అంతా వారి చెప్తే హాయిగా నవ్వేశారు..!

వాళ్ళిద్దరితో నేను ఫ్లైట్ లో తీసుకున్న ఫోటో ఉండాలి. ప్రస్తుతం కనబడలేదు.

ఇప్పుడే తెలిసింది శ్రీ గుండు హనుమంతరావుగారు 2018 ఫిబ్రవరి 19 న స్వర్గస్తులయ్యారని..! వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

పూర్తిగా చదవండి...

Friday, February 25, 2022

ఈనాడు దినపత్రికలో 80 లలో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్

కోరాలో "ఈనాడు దినపత్రికలో 80 లలో మూడో పేజీలో కింద బొమ్మల కథలు వచ్చేవి. అవి చదివిన జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడవి ఎక్కడైనా దొరుకుతాయా?" అన్న ప్రశ్నకు నేను వ్రాసిన సమాధానం:




80 లలో ఈనాడులో ప్రతి రోజూ అమర చిత్ర కథ వాళ్ళ పుస్తకాలన్ని(అప్పట్లో అలా అని తెలియదు) తెలుగులో అవే బొమ్మలతో వచ్చేవి సీరియల్ లాగా..! 30 - 32 రోజులు నడిచేది. చాలా పిచ్చిగా చదివేవాళ్ళం. పేపర్ రాగానే ముందు నేనంటే నేనని చదవడానికి కొట్టుకొనే వాళ్ళం. పేపర్ని నేలమీద పెట్టి ఎడమ చేత్తో మొదటి పేపర్ కుడిచేతి బాటమ్ కార్నర్ని పట్టుకొని పైకి ఎత్తి ఈ కామిక్ చదివేసి పేపర్ మా నాన్నగారికి ఇచ్చేసే వాళ్ళం. నెల పూర్తికాగానే క్రొత్త సీరియల్ మొదలయ్యేది. వెంటనే పాత నెల పేపర్లన్నిటిలో ఈ కామిక్ స్ట్రిప్‍ని కట్ జాగ్రత్తగా చేసి అన్నిపేజీలు ఒకే సైజుకి సరిచూసుకొని, పుస్తకాలలాగా కుట్టుకొని చాలా రోజులు చదువుకొనేవాళ్ళం. మా మామయ్యలు కూడా (మాకన్నా 6–7 యేళ్ళు పెద్దవాళ్ళు) ఇలాగే దాచుకునేవాళ్ళు. మేము వేసవి సెలవల్లో మా తాతగారింటికి వెళ్ళినపుడు వాళ్ళవద్ద ఉన్న పుస్తకాలు మేమూ మావి వాళ్ళూ తీసుకొని చదువుకొనేవాళ్ళం.

 



ఇది కాక ప్రతి ఆదివారం ఫాంటమ్ కామిక్ సీరియల్ తెలుగులో కామిక్ స్ట్రిప్ గా వచ్చేది. ఇప్పుడు మన ఆదివారం పుస్తకం సైజులో..! చాలా బావుండేది.


తరువాత భీమిలి నుంచి విశాఖపట్నానికి బస్సులో వెళ్తున్నప్పుడు RTC కాంప్లెక్సు లో బస్సు దిగినప్పుడల్లా అక్కడే ఎదురుగా ఉండే పుస్తకాల షాపుకి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అక్కడే మొదటిసారి ఈ అమరచిత్ర కథ పుస్తకాలు చూశాము. మేము ఈనాడులో బ్లాక్ అండ్ వైట్ లో పాకెట్ సైజులో చదివిన పుస్తకాలన్నీ A4 సైజులో రంగుల్లో కనిపించేసరికి మతిపోయింది. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు.


అప్పటివరకు మాదగ్గర ఉన్న పాకెట్ సైజు పుస్తకాలన్నీ రంగుల్లో, అంత పెద్ద సైజులో, అదీ తెలుగులో కనిపించేసరికి వెర్రెక్కిపోయి మానాన్నగారికి కొనమని అర్జీ పెట్టేసాము. ఆయనకూడా కాదనకుండా కొనేవారు. అలా ఎన్ని పుస్తకాలు కొన్నారో లెక్కలేదు. అదే సమయంలో టింకిల్ కూడా తెలుగులో మొట్టమొదటి సంచిక విడుదలైంది( ఆ మొట్టమొదటి తెలుగు టింకిల్ సంచికని మళ్ళీ చూసింది శ్రీ మట్టెగుంట వెంకట అప్పారావు గారింట్లో..! వారు కార్టూనిస్టు సురేఖ, రేఖాచిత్రం బ్లాగరుగా సుపరిచితులు. వారి గురించి, వారి దగ్గర ఉన్న పాత పుస్తకాల పాతర గురించి చెప్పాలంటే మాటలు చాలవు..!


నెలకి కనీసం రెండు మూడు సార్లు మేము విశాఖకు వచ్చేవాళ్ళం. వచ్చిన ప్రతిసారీ మూడు నాలుగు పుస్తకాలు కొనుక్కొనే వాళ్ళం. చందమామ ఇంటికే వచ్చేది. ఈ లెక్కన మా ఇంట్లో ఉన్న ఇనప ట్రంకుపెట్టె త్వరలోనే నిండిపోయింది. (మానాన్నగారికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి ఎస్ బీ ఐ లో ఆఫీసర్ కావడం చేత, భీమిలి నుంచి వైజాగ్ బదిలీ అయి వస్తున్నప్పుడు, మా పుస్తకాలన్నీ ట్రంకులో సర్ధుకుంటే అది పూర్తిగా నిండిపోయింది.) అప్పటినుంచి బస్ కాంప్లెక్స్ కి వెళ్ళడం తగ్గిపోవడం, అలాగే 7–8 క్లాసులకి వచ్చేయడంతో ఈ కామిక్ పుస్తకాలు కొనడం తగ్గిపోయింది. చందమామ మాత్రం కొనుక్కొనే వాళ్ళం.


కాని, దురదృష్టం ఏమిటంటే పైన చెప్పిన పాత పుస్తకాలలో ఇప్పుడు నా దగ్గర ఒక్కటంటే ఒక్కటే ఉంది. అది చందమామల్లో వచ్చిన సీరియల్ తాలూకు పేజీలు వేరు చేసి కుట్టుకున్నది. ఆ సీరియల్స్ రెండూ ( గంధర్వ చక్రవర్తి కూతురూ[3], ఇద్దరు మోసగత్తెలూ[4]). అమర చిత్ర కథ, ఈనాడు కామిక్ స్ట్రిప్స్, ఇలాంటివి ఏవీ మిగల్లేదు. కొన్ని మా స్కూలు లైబ్రరీలకూ, మిగతా పుస్తకాలన్నీ మా కన్నా ఇంకా చిన్నపిల్లలకి పంచేసాము.


మేము చదివిన ఈ పుస్తకాలు, చందమామలు, మాకు మన భారతీయత గురించి ఆ మాత్రం తెలియడానికి దోహదం చేశాయి. మాకేకాదు భారతదేశంలో కనీసం రెండు తరాలని ప్రభావితం చేసి భారతీయ సంస్కృతి, చరిత్ర, మన వారసత్వ సంపదను గురించి తెలియజెప్పడంలో ఈ పుస్తకాలు ప్రముఖపాత్ర పోషించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.


ఆపాత మధురాలైన ఆ పుస్తకాలు ఎలాగైనా దొరికితే బాగుణ్ణని చూసే వాళ్ళలో నేను మొదటివరుసలో ఉంటాను. ఎవరి వద్దనైనా ఉంటే తెలియజేయగలరు.


- రాధేశ్యామ్ రుద్రావఝల

తాజాగా:

మా పెదనాన్నగారి ఇంట్లో ఉన్న లైబ్రరీలో మా తమ్ముడు ఇవి వెతికి ఇచ్చాడు. ఈ క్రింది పుస్తకాలు మా మామయ్య సేకరించి కుట్టినవి. మొత్తం 4 సీరియల్స్ కలిపి ఒక పుస్తకంగా కుట్టాడు. ఆయన మాకిస్తే మేము మా తమ్ముడికి ఇచ్చాము.


  •     గాంధారి
  •     కన్నప్ప
  •     మైరావణ 
  •     చిలుకరాజు 

 

(పై నాలుగు పుస్తకాలూ స్కాన్ చేసి పెట్టాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి కామెంట్స్ లో ఉంచితే పంపగలను.)

 

ఇన్నాళ్ళ తరువాత (సుమారు 35 ఏళ్ళు) వాటిని చూడడం చాలా ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటివి చాలా పుస్తకాలు ఉండాలి (సుమారు ముప్పైకి పైగా) ఒక్కొక్కటిగా మాయమైపొయాయి. ఏమైపోయాయో తెలియదు. 😕😕😕

పూర్తిగా చదవండి...

Saturday, April 24, 2021

👨‍🦲 నున్నగుండు కథ..! 👨‍🦲

అనగనగా ఒక పల్లెటూర్లో ఒకడుండేవాడు. వాడికి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా, బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాణ్ణి ఊర్లో అందరూ నున్నగుండు అని పిలిచేవారు. వాడి అసలుపేరు ఆ ఊర్లో ఎవ్వడికీ గుర్తుకూడాలేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి...! పలకరింపుకీ, వెక్కిరింతకూ, పని చెప్పడానికి, మాట్లాడదానికీ కూడా వాణ్ణి అందరూ "నున్నగుండూ..! , నున్నగుండూ..!!" అని పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషం గా ఉండేది. ఈ బాధపడలేక వాడు ఆ ఊరినుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని, ఎవ్వరికీ చెప్పకుండా ఒకనాటి తెల్లవారు ఝామునే, ఇంకా చీకటి కూడా వదలకుండానే బయల్దేరిపోయి అలా చెట్లవెంటా పుట్టలవెంటా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.
 

కొద్దిరోజులు అలా దొరికిందేదో తింటూ అరణ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఒక మునీశ్వరుడు కనిపించి, "నాయనా ఎవరునువ్వు..! ఎందుకీ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు..!? అడవి మృగాల కంట పడ్డావంటే అపాయంకదా..!" అని అడిగాడు. 


నాకెవరూ లేరండీ..! నాకసలు బ్రతకాలనే లేదు..! అంటూ వలవలా ఏడుస్తూ ముని పాదాల చెంత కూలబడ్డాడు మన నున్నగుండు(చూశారా..! నేనూ వాణ్ణి అలాగే అనేశాను..! ప్చ్..!). 

 

ఏమైంది నాయనా జీవితం మీద అంత విరక్తి చెందావు..!? అని ముని అడిగితే, మనవాడు మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి వాడికథంతా చెప్పాడు. 

 

"నా గుండుమీద ఎలాగైనా జుత్తు మొలిపించండి స్వామీ.. అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. అప్పుడా ముని "నీ బోడిగుండుమీద జుత్తు మొలిపించడం బ్రహ్మతరం కూడా కాదు నాయనా, దాని సంగతి మర్చిపో..! అని, "ఉండు, నిన్నింక ఎవరు నున్నగుండు అని పిలిచినా వాళ్ళకి తగిన శాస్తి జరిగేలా చేస్తా..!, ఏదీ నీ కుడి చెయ్యి ఇలా చూపించు" అని అడిగి వాడిచేతికి ఒక మంత్రం వేశాడు. ఇకనుంచి నిన్ను ఎవరైనా నున్నగుండూ అని పిలిస్తే వాడి నెత్తిమీద చెయ్యిపెట్టు, తక్షణం వాడి జుత్తు కూడా చక్కగా ఊడిపోయి నున్నగుండుగా మిగుల్తాడు" అని తనదారిన తాను వెళ్ళాడు. 

 

మనవాడు సంతోషంగా తన ఊరి దారి పట్టాడు. ఊర్లోకి ఇంకా చేరకుండానే ఒకడు కనిపించి "ఓరి నున్నగుండూ, బాగున్నావా..!? ఇన్నిరోజులు చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయావు..!?" అని అడిగాడు. వెంటనే మనవాడు.. "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాడి నెత్తిన చెయ్యి పెట్టాడు. వెంటనే అవతలవాడి జుత్తు సమస్తం మాయమై ఒక చక్కని బోర్లించిన కుండలాగా అయిపోయింది. అది చూసిన మన నున్నగుండు ఆనందానికి అవధుల్లేవు. గంతులేస్తూ ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో వీణ్ణి చూసిన అందరూ వీణ్ణి నున్నగుండూ అని పిలవడం, వీడు "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టడం..! 

 

ఆ దెబ్బకి ఊర్లో మూడొంతులమంది, ఆడ, మగ, పెద్దా చిన్నా తేడా లేకుండా నున్నగుండులైపోయారు. వాళ్ళంతట వాళ్ళు ఈ మంత్రం సంగతి తెలియక మనవాడిని నున్నగుండు అని నున్నగుండై పోయినవాళ్ళు కొందరైతే, మరికొందరిని మనవాడే వెళ్ళి మరీ నున్నగుండు చేసి చక్కా వచ్చాడు. అందరూ నున్నగుండు అయిపోయాక ఎవరు అసలు నున్నగుండో తెలియకుండా పోయింది. 

 

ఇదిలా ఉండగా ఒకరోజు మనవాడికి మంత్రం వేసిన మునీశ్వరుడు ఆ ఊరొచ్చారు. ఊళ్ళో ఇలా అందరూ నున్నని గుళ్ళతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, విషయం ఏమిటని ఆరా తీస్తే వాళ్ళు మన కథానాయకుడి సంగతి చెప్పారు. "అరె, నేనిచ్చిన మంత్రాన్ని ఇంతదారుణంగా ప్రయోగించాడా అని కోపంగా, ఎక్కడున్నాడు ఆ నున్నగుండు గాడు అన్నాడు..! ఆ జనంలోనే ఉన్న మన అసలు నున్నగుండు, "నువ్వుకూడా నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ ఆ ముని నెత్తిమీద చెయ్యిపెట్టేశాడు. దెబ్బకి ఆ మునికూడా నున్నగుండై కూర్చున్నాడు. 

 

దాంతో వాళ్ళంతా తమ మొహాలు చూసుకోలేక, మమ్మల్నింకెవరు చూస్తారంటూ తెగ బాధపడుతూ ఉంటే మన మునీశ్వరుడి గురువుగారు ప్రత్యక్షమై బాధపడకండి నాయనా, భవిష్యత్తులో మీరంతా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు, అందరూ మీ బొమ్మలు మాటకి ముందు మాట తరువాతా ఉపయోగిస్తారు, మీ  ముఖాలు లేకుండా వాక్యాలు పూర్తవవు అని వరమిచ్చాడు.

😀😁😂😃😄😅😆😇😈😉😊😋😌😍

 

😎😏😐😑😒😓😔😕😖😗😘😙😚😛

 

😜😝😞😟😠😡😢😣😤😥😦😧😨😩

 

😪😫😬😭😮😯😰😱😲😳😴😵😶😷


అదిగో..! ఆ కథలో అలా వరంపొందిన నున్నగుండు గాడి బాధితులే ఇప్పుడు మనకి ఇమోజీలుగా దర్శనమిస్తూ, మన మెసేజ్ లలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి..! 

వాళ్ళ తరవాత తరాలవాళ్ళు జుత్తుతో మామూలుగానే ఉన్నారు.

👶👱👦👧👨👩👪👫👬👭

 

👤👥 🙋🙅🙆🙇🙋🙍🙎💁



అదండి..! నున్నగుండు అలియాస్ ఇమోజీల కథా కమామిషూ..!!

 

- రాధేశ్యామ్ రుద్రావఝల 🙏🙏🙏


పూర్తిగా చదవండి...

Friday, April 23, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..! (రెండవ భాగం)

మొదటిభాగం చదవని వారు ఇక్కడ చదవవచ్చు.

తరువాత 10వ తరగతి పరీక్షలు: నేను యలమంచిలి GJ కాలేజ్ లో చదువుకున్నాను. ఐతే ఇక్కడ మొదట యూనిట్ టెస్ట్ స్టోరీ చెప్పాలి..! మాకు ఆ సంవత్సరం రమణరావు మాస్టారని లెక్కలు చెప్పడానికి వచ్చేవారు..! సిగిరెట్లు విపరీతంగా కాల్చేవారు. అంత నీట్ గా డ్రెస్సప్ అయ్యేవారు కాదు. ఇన్ షర్ట్ చేసేవారు, అదికూడా సరిగ్గా ఉండేది కాదు..! బెల్టు పెట్టుకొనేవారు కాదు.  గడ్డం కాస్త నెరిసి ఉండేది, నీట్ గా షేవ్ చేయ్యగా నేనెప్పుడూ చూడలేదు..! నాకేమో ఆ సిగరెట్ వాసన అస్సలు పడేది కాదు. నేను ముందు వరస లో కూర్చొనేవాణ్ణి..! దృష్టి పాఠం మీదకి వెళ్ళేది కాదు. ఆయన మాత్రం ఎప్పుడూ నన్ను బాగానే చూసేవారు..! సరదాగానే ఉండేవారు. నేనేమో ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా మొహం మాడ్చుకొని మాట్లాడేవాణ్ణి..! ఇలా కొట్టుమిట్టాడుతూ ఉండగా మొదటి యూనిట్ టెస్ట్ వచ్చెసింది.


ఆరోజు పరీక్షకి బాగానే చదివాను, పరీక్షకి నడుచుకొని వెళ్తూ కూడా తోవంతా చదూకుంటూ వెళ్ళాను. పరీక్ష పేపరిచ్చారు. చూస్తే ఒక్కటికూడా నాకు వచ్చింది పడలేదు..! కనీసం ఒక్కటి కూడా..!! ఏంచెయ్యాలో తెలియలేదు. పక్కవాళ్ళని అడిగి రాసే అలవాటు ఎప్పుడూ లేదు..!! నాకు యేడుపు ఆగలేదు. పేపర్ ని అరగంట సేపు అటుతిప్పి ఇటు తిప్పి ఇంక భరించలేక లేచి వెళ్ళి ఖాళీ పేపర్ ఇచ్చేసాను. "అదేంట్రా.. అంత తొందరగా రాసేసావు..!?" అన్నారు..!! నేను మళ్ళీ ఇంకో రౌండు కన్నీళ్ళు పెట్టుకొని ఏమీ రావండీ అన్నాను.  అందుకే పాఠం శ్రద్ధగా వినాలి..! సరేలే..! దీంతో ఏమీ ఐపోలేదుకదా..! ఫైనల్ పబ్లిక్ పరీక్షల వరకూ బోల్డు పరీక్షలున్నాయి..! చూద్దాంలే ఎందుకు రావో మార్కులు..! అన్నారు..! ఆ క్షణంలో నాకు ఆయన సిగరెట్లూ, ఇన్ షర్టూ, మాసిన గడ్డం ఇవేమీ గుర్తు రాలేదు.! వారిలో నిజమైన గురువు కనిపించారు.! అప్పుడు ఇంకా ఏడుపొచ్చేసింది.! మొత్తానికి వారు నన్ను ఓదార్చి పంపేసారు..!

ఇంటికి వెళ్ళాక మా అమ్మ మళ్ళీ ఆవిడ ప్రశ్నలతో తయారు..!

ఎలా రాసావు రా..?

బాగారాయలేదు.

ఎన్నొదిలేసావు..?

అన్నీ వదిలేసాను..!

అదేమిట్రా..?? అసలు ఎన్నొస్తాయేం మార్కులు..!!??

ఏమీరావమ్మా..! సున్నా వస్తుంది..! ఏమీ రాయలేదు అంటూ ఉంటే..అంటూ కోపం పడిపోయి లోపలికి వెళ్ళిపోయాను. మొదటిసారి నాకెన్నొస్తాయో నేను ఊహించడం..!!


ఒకరోజు పేపర్లు ఇచ్చారు..! అనుకున్నట్టే ఇరవై అయిదుకి సున్నా వచ్చింది..!! అన్ని షీట్లమీదా పైనుంచీ కిందదాకా ఒక రెడ్ లైను.. ఫలితంగా సున్నా మార్కులు..! మా మాస్టారు అందరివీ ఆన్సర్ షీట్లు వెనక్కి తీసుకుంటూ.. నాతో, "ఏరా..! కౌంటింగ్ సరిపోయిందా? ఎక్కడేనా తప్పులున్నాయా..!" అని అడిగి నవ్వేసారు..!! నాకు కూడా నవ్వొచ్చేసింది..! కాని అందవలసిన పాఠం అందింది. అప్పటినుంచి నాలో బాగా మార్పు వచ్చింది. వారితో చాలా సన్నిహితంగా మసిలేవాణ్ణి. లెక్కల పాఠాలు చాలా  శ్రద్ధగా వినేవాడిని. వారు నాకు లెక్కలలో ఎంత సరదా ఉంటుందో అనుభవంలోకి తెచ్చారు. ఎప్పుడైతే నేను వారిమీద కాకుండా వారి పాఠం మీద దృష్టి పెట్టానో సబ్జెక్ట్ బాగా బుర్రకెక్కింది. లెక్కల టెక్స్ట్ బుక్ పొట్లపండు అయిపోయేటంతగా ప్రాక్టీసు చేసేవాడిని. లెక్క చూసి డైరెక్ట్ గా ఆన్సర్ తెలిసిపోయేది. మొత్తానికి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 96 మార్కులు వచ్చాయి. కాని ఆరోజు సున్న వచ్చిందానికన్నా ఎక్కువ బాధవేసింది నూటికి నూరు రాలేదని..! అయినా గాని మా రమణరావు మాస్టారి సహకారం, ఆదరంతో ఆమాత్రం మార్కులు వచ్చాయి. వారిని జన్మలో మర్చిపోలేను..!!

🙏🙏🙏🙏🙏🙏 
పూర్తిగా చదవండి...

Thursday, April 22, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..!! (మొదటి భాగం)

[ఇది ఎప్పుడో 2018 మార్చిలో వ్రాసిన పోస్టు. అప్పుడు పబ్లిష్ చెయ్యలేదు ఎందుచేతనో..! ఇన్నాళ్లకు, మన పిల్లల స్కూలు, కాలేజి పరీక్షలు వాయిదా పడడం లేదా రద్దవడం వార్తలు చూసి ఇది గుర్తొచ్చి పోస్ట్ చేస్తున్నాను. కరోనా కాదుగాని, ఈ క్రింద రాసిన అనుభవాలు అన్ని బొత్తిగా జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సరే..! ఇంక విషయం లోకి వచ్చేస్తాను. 

ఇది 2018 లో వ్రాసినపోస్టు అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను.]

నిన్నటి నుంచి మా అమ్మాయికి పదవతరగతి పరీక్షలు..! మేము పొద్దున్నే తనతోపాటు తయారైపోయి వాళ్ళ స్కూల్ బస్ కి తనని డ్రాప్ చేసి, ఆ బస్సుతో పాటు సెంటర్ వరకు ఫాలో అయ్యి, అక్కడ ఒక గంట సేపు ఎండలో నిలుచుని, మిగతా పేరెంట్స్ తో తరవాత వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారో మాట్లాడి, (అందరూ సుమారుగా ఇదే చేస్తున్నారు..!) పరీక్ష మొదలయ్యాక కూడా ఇంకా అక్కడే నిలుచున్న తల్లిదండ్రుల పక్క జాలిగా ఒక చూపు విసిరి మళ్ళీ వెనక్కు బయలుదేరాం..!! వాళ్ళు మమ్మల్ని "ఎంత బాధ్యత లేని తల్లిదండ్రుల్రా వీళ్ళు..!" అన్నట్టు మామీదో చూపు విసిరారు..!!

అప్పుడే నాకు చిన్నప్పుడు మేము పరీక్షలు వ్రాసినప్పటి అనుభవాలన్నీ బుర్రలో మెదిలి ఈ బ్లాగ్ పోస్టు వ్రాయడానికి పురిగొల్పింది.

[Flash back లో Flash back..! ఏమనుకోకండి..!!😄😄😄

సరే..! పాయింటులోకి వచ్చేస్తున్నా..!]


మేము ఇద్దరం..! నేను, మా తమ్ముడూ..! మాతమ్ముడు నా కన్నా ఒక ఏడాది చిన్నవాడు. మా అమ్మగారు మమ్మల్నిద్దర్నీ కూర్చోపెట్టి చదివించేవారు. మా నాన్నగారు బ్యాంకులో ఆఫీసరు గా చేస్తూ బిజీగా ఉండేవారు. అందువల్ల పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు. ఒక్క హిందీ పరీక్షకి మాత్రం ఆయనే చదివించేవారు. (ఆయన బాల్యం అంతా నాగపూరు, బనారస్ మొదలైన ఉత్తరాది ప్రాంతాలలో సాగింది. మమ్మల్ని ఎప్పుడూ మా నాన్నగారు బస్ స్టాప్ కి కూడా దింపలేదు పరీక్షలకి..! మేమెప్పుడూ అడిగేవాళ్ళం కూడా కాదు..! ఇంట్లో బయల్దేరేటప్పుడు దేముడికి దణ్ణం పెట్టుకొని మా అమ్మచేత ’ఆల్ ది  బెస్ట్’ చెప్పించుకొని బయల్దేరడమే. స్కూల్ దూరం బట్టీ నడుచుకుంటూనో, బస్సు మీదో వెళ్ళేవాళ్ళం. చిన్నప్పటినుంచి మా అమ్మగారు మా చదువులని దగ్గరుండి చూసుకునేవారు. మా మొత్తం సిలబస్ ఆవిడకి కూడా కంఠతా వచ్చి ఉండేది. పరీక్షవ్రాసి ఇంటికి రాగానే.. మా అమ్మగారి ప్రశ్నలు ఇలా ఉండేవి..

అమ్మ: ఎలా రాసావు పరీక్ష?
మేము: బాగా రాశానమ్మా!!
అ: ఎన్ని మార్కులొస్తాయి?
మే: ఏదో చెప్పేవాళ్ళం..!
అ: ఎన్ని వదిలేసావు?
మే: రెండు 3 మార్కుల ప్రశ్నలూ  4 బిట్లూ 
అ: మరింకేమిటి రాసేవ్.. ఏదీ క్వశ్చన్ పేపరు..??

అంటూ అక్కడ మొదలెట్టి  మొత్తం పేపరంతా మాచేత మళ్ళీ  చేయించేవారు. మేము ఇప్పుడే వచ్చాము పరీక్ష వ్రాసి మళ్ళీ  రాయమంటే ఎలా..? అని విసుక్కుంటూ మా అమ్మ అడిగినవాటికి చెప్పేవాళ్ళం..! చదివినవే ప్రశ్నలు పడిపోతే మాకు చాలా హుషారుగా ఉండేది..! మళ్ళీ చెప్పక్కర్లేదు కాబట్టీ..! లెక్కలపేపర్ లో ఆన్సర్లు చివరకి ఎంతొచ్చిందో తప్పక రాయాలి..! తరువాత చెక్ చేసుకోవడానికి..! ఆవిడ ఎన్ని మార్కులొస్తాయని చెప్పేవారో సరిగ్గా అన్నే వచ్చేవి. 

మా పరిస్థితి ఇలా ఉంటే మా స్నేహితుడు ఒక అబ్బాయి - వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే అడుగుతూ ఉండేవారు - ఒక పరీక్ష చాలా చెత్తగా వ్రాసాడు. బయటకి వచ్చాక ఆ ప్రశ్న పత్రాన్ని చక్కగా పరీక్ష సెంటర్ బయట ఒక మేక కనిపిస్తే దానికి తినిపించేసి చక్కా వచ్చాడు. ఇంట్లో ఇవాళ పేపర్ ఇవ్వలేదని చెప్పేసాడు. ఐతే వాళ్ళ అమ్మగారు మాదగ్గర పేపరు తీసుకొని వాడి నిర్వాకం తెలుసుకొని బడితెపూజ చేసారనుకోండి..!! అది వేరే విషయం..!!

ఇదంతా ఎనిమిది, తొమ్మిది చదువుతున్నప్పటి సంగతి..!! 
 
అయితే అంతకు ముందర ఏడో క్లాసు పరీక్షలకి కూడా పబ్లిక్ ఉండేది ఆరోజుల్లో..!! ఐతే పరీక్షల ఫలితాలు స్కూల్ లో పెట్టారు అని తెలిసి మా అమ్మగారు వెళ్ళి చూసుకోమని శతపోరుతూ ఉన్నా ఇదిగో అదిగో అని ఆటల్లోనూ పుస్తకాలు చదవడంలోనూ బిజీగా ఉండే వాడిని..! ఒకరోజు మా అమ్మగారే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళారు స్కూల్ కి. (అప్పట్లో నేను సెయింట్ ఆంథోని పాఠశాల లో చదివాను. మాఇంటినుంచి బస్సులో వెళ్ళే వాళ్ళం.)

వెళ్ళాక స్కూల్లో మా బిల్డింగ్ పోర్టికో రాతి గోడకి పెద్ద అక్షరాలతో ఏడవతరగతి పరీక్షా ఫలితాలు అనిబోర్డు పెట్టి నోటీసు బోర్డులో ఫలితాల కాగితాన్ని అతికించారు. మా అమ్మగారు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. నాకు ముందునుంచీ ఆ రష్‍లో తొక్కుకుంటూ ఉండడం చిరాకు. అందుకని నేను కాస్త దూరంగా వెళ్ళి నిలుచున్నాను. మా అమ్మగారు అక్కడినుంచి చెయ్యి ఊపుతూ ఏదో చెప్తున్నారు. నేనది పట్టించుకోకుండా నాలోకంలో నేనున్నాను. మా అమ్మగారు ఇక పట్టలేక నాదగ్గరికి వచ్చేసి కోపంగా "ఆ లిస్టులో నీపేరు లేదు..! అన్నిసార్లు చెప్తున్నాను వెళ్ళి చూసుకోరా అని..!! ఒక్కనాడు వినలేదు నా మాట.! ఇప్పుడు వెళ్ళి చూసుకో నీ పేరు..!! వెధవా..! బా..గా కనిపిస్తుంది..! అరె..!! పరీక్షలలో ఇంకొంచం సేపు చదవరా అని ఎన్నిసార్లు చెప్పినా నాకన్నీ వచ్చేసు అంటూ తిరిగావ్..!! ఇప్పుడు చూడు ఏకంగా పరీక్షే పోయింది అంటూ ఇంక కంట నీరు ఉబకడానికి సిద్ధంగా ఉన్నటైమ్ కి నే నీలోకంలోకి వచ్చాను..!! చాలా మెల్లగా తాపీగా అమ్మా నువ్వు చూసినది పరీక్ష పోయిన వాళ్ళ లిస్టేమోనే..! సరిగ్గా చూసావా..!!?? అని అడిగాను..! ఇంకేమిటి చూడ్డానికి మిగిలింది..!! నా బొంద..! అంటూ మా అమ్మగారు పాపం చాలా దుఃఖ పడుతున్నారు. నాకు చాలా బాధవేసింది..!! నేను బాగా రాసానమ్మా..! నాపరీక్ష పోవడమేంటి అని అప్పుడు వెళ్ళి నేనే చూసుకున్నాను స్వయంగా!! నా ఊహ నిజమే..! మా అమ్మగారు తప్పు లిస్టు చూస్తున్నారు..! నాపేరు/ రోల్ నెంబరు ఫస్ట్ క్లాసులో కనిపించాయి. నేను చాలా ఉక్రోషంగా వచ్చి మా అమ్మగారి దగ్గరికి చూసుకో.., నా పేరు ఫస్ట్ క్లాసులో ఉంది..! నువ్వే తప్పులిస్టు చూసావు..! అన్నాను. అప్పుడు ఆవిడ వెళ్ళి అసలు లిస్టులో నాపేరు చూసి అప్పటికి స్థిమిత పడి ఎంతో ఆనందించారు. ఆవిడ హ్యాపీ..!! నేను డబుల్ హ్యాపీ..!! కథ సుఖాంతం..!!

*******

(సశేషం)

(పరీక్షలు బాబోయ్ పరీక్షలు -2 లో కలుద్దాం)

పూర్తిగా చదవండి...

Monday, March 29, 2021

తిరుపతి యాత్ర - ఊంజలసేవ

నా శ్రీమతి కుసుమకుమారి, శ్రీవారి ఊంజల సేవ (సహస్రదీపాలంకరణ సేవ) లో దాసప్రాజెక్టు లో భాగంగా పురందరదాసు కీర్తనలను 23.03.2021 నాడు ఆలపించింది. కరోనా మొదలవ్వకముందు సరిగ్గా అదేరోజున (మార్చి 23నే కార్యక్రమం ఖరారయ్యింది. కాని మార్చి 22 నుండి దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ ప్రకటించిన కారణంగా రద్దయ్యి మళ్ళీ సరిగ్గా ఏడాది తరువాత అదేరోజున మళ్ళీ పాడడానికి నిర్దేశితమయ్యింది. ఆ మర్నాటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు మొదలవడం చేత ఊంజలసేవని రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో అక్కడ పాడేవారిని సాయంత్రం 4.30 కల్లా అక్కడ సిద్దమవాలని చెబుతారు. సరిగ్గా 5.00 గంటలకు ప్రత్యక్షప్రసారం మొదలవుతుంది. ఆ సమయంలో మాం....ఛి ఎదురెండ. కళ్ళెత్తి మీదకు చూడలేనంత..! ఆ అరగంట కార్యక్రమం పూర్తికాగానే నీడవచ్చేస్తుంది..!

 
 


శ్రీవారి తెప్పోత్సవాలను పురస్కరించుకొని చేసిన అలంకరణ


 


మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రం 




పూర్తిగా చదవండి...

Sunday, March 28, 2021

శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో నాకు నచ్చిన పద్యం

శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)

నటీ నటులు: 
కృష్ణుడు: ఎన్ టి రామారావు, 
నారదుడు: కాంతారావు, 
సత్యభామ: జమున, రుక్మిణి: అంజలీదేవి, అష్టమహిషులు: కృష్ణకుమారి తదితరులు.
రచన: దైత గోపాలం

సీ.
సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు
                 ధనమున్నదే భక్తి ధనము గాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు
                  బలమున్నదే భక్తి బలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు
                  ఫలమున్నదే భక్తి ఫలముగాక !
 సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు
                  విద్యయున్నదె భక్తి విద్య గాక !

ఆ.వె.
సర్వవరదుడైన శాన్వి సన్నిధి జేర్చు
పథము గలదె భక్తి పథముగాక !
కాన యితడు భక్తిగల వారలకె గాని
పరులకగ్గమగునె పడతులార ?

చాలా ప్రసిద్ధమైన ఈ పద్యం పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా పేరుపొందిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి చేతులలో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణతులాభారం చిత్రం లోనిది. ఘంటసాల గారు గానం చేయగా నారద పాత్రధారి శ్రీ కాంతారావు గారి మీద చిత్రీకరించబడింది. శ్రీకృష్ణ తులాభారం చిత్రం లోని అన్నిపద్యాలు, పాటలలో మకుటాయమైన పద్యం, చిత్రం క్లైమాక్స్ లో అప్పటివరకు జరిగిన జగన్నాటకానికి తెరదించుతూ శ్రీకృష్ణతత్వాన్నిద్వారకా వాసులకు, మరీ ముఖ్యంగా సత్యాదేవికి తెలియ చెపుతూ నారదుడి పలికిన పద్యం.

పారిజాతాపహరణం కావ్యం మూలంగా ఉంచుకొని తీసిన సినిమా ఇది.
Image result for శ్రీకృష్ణ తులాభారంకథలోకి వెళ్తే శ్రీ కృష్ణుని దర్శనార్థమై దేవలోకం నుండి వచ్చిన నారదుడు వస్తూ వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తీసుకు వచ్చి రుక్మిణీ దేవి చెంతనున్న కృష్ణుడికి ఇస్తాడు. ఆయన వెంటనే ప్రక్కనే ఉన్న రుక్మిణీ దేవికి ఇస్తాడు.
అది తెలుసుకున్న సత్యాదేవి (ఆ తెలియడం కూడా మరోనాలుగు మాటలు కలిపి చెప్పిన చెలుల ద్వారా) అగ్గిమీద గుగ్గిలమౌతుంది.  తన సర్వస్వమని, కాదు కాదు ఆతడు తనకే సొంతమని, తన యానతి మీరజాలగలేడని భావించిన తన మనోవల్లభుడు, అలా తన సపత్నిని ఆ దేవతా పుష్పంతో అలంకరించి ఆదరించడం ఆమెకు ఈర్ష్యాసూయలకు, మనస్తాపానికీ కారణమై, రోషముతో ప్రజ్వరిల్లి అలుకపాన్పు నెక్కుతుంది.


ఇలా జరుగుతుందని ఊహించి భయపడుతూనే వచ్చిన కృష్ణుడు ఆమెను అనునయించడానికి ప్రయత్నించడం, ఈతని శిరస్సును ఆ లతాంగి వామపాదంబునన్ తొలగన్ త్రోయడం, ఆ తాపుకు తన శరీరం పులకలెత్తిందనీ, ఆ ముళ్ళు గుచ్చుకోవడం చేత నీ లేతపాదాలకు ఎంత బాధ కలిగిందో కదా అంటూ కృష్ణుడు ఆమెను అలుక మానమని బ్రతిమాలడం, ఆమె మరల మెత్తబడిన పిదప శ్రీ కృష్ణుడు నీకు ఉత్తి పువ్వేం ఖర్మ, స్వర్గలోకం నుంచి ఏకంగా చెట్టే తెచ్చేస్తాను పెరట్లో నాటించుకుందువుగాని అని పలికి, ఆపనికి భామను కూడా తీసుకువెళ్ళి ఆ చెట్టు పెకలించుకు రావడం తో ఒక అంకం ముగుస్తుంది.


తన నాథుడు తనకే సొంతమని గర్వాతిశయంతో మిడిసిపడ్డ సత్యాదేవికి ఎందుకో ఏదో మూల చిన్న సంశయం..! తన పతి సొంతమైనట్టే ఉన్నాడు కాని మళ్ళీ చేజారిపోతాడేమోనన్న అభద్రతా భావం. ఇలా ప్రతి సారీ తన సవతులతో పోటీకి దిగి భర్త దరిచేరడం ఏమిటని..!? సరిగ్గా అదే సమయానికి కలహభోజనుడి పునః ప్రవేశంతో కథ రసకందాయంలో పడుతుంది. తన భర్త తనకే స్వంతం కావాలంటే ఏంచేయాలో కాస్త చెప్పమని సత్య నారదులవారిని అడుగుతుంది. పుణ్యకవ్రతమని ఒకటి ఉన్నదని, ఆ వ్రతం చేస్తే భర్త నిజంగానే తన స్వాధీన వల్లభుడౌతాడని చెప్పిన నారదమహర్షికే ఆచార్యకత్వం వహించమని అడుగుతుంది. సరేనని నారదుడు ఆమెచేత ఆ వ్రతం చేయిస్తాడు. అయితే వ్రత సమాప్తి నియమంగా భర్తని ఎవరైనా తపస్సంపన్నుడికి దానమీయాలని, మెలిక పెడతాడు. తరువాత మరల శ్రీకృష్ణుతో తుల తూగే ధనముగాని ధనేతరములను ఎదురిచ్చి స్వామిని మరల స్వంతంచేసుకోవచ్చంటాడు. ఐతే ఎవరికో ఎందుకు ఆ దానం మీరే పుచ్చుకోండి, తన భర్త, కృష్ణుని ఒక్కమారుకాదు పదిసార్లైనా తూచ గలిగే ధనము నీయగల శ్యమంతకమణి తనవద్ద ఉన్నదని బీరాలు పోతుంది.

సరే నని వ్రతమంతా ముగించి తులాభారానికి వచ్చేసరికి అప్పుడు జగన్నాథుని జగన్నాటకం అవగతమౌతుంది. తనవద్ద ఉన్న ఏడువారాలనగలూ, శ్యమంతకమణి ప్రసాదించిన బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులూ ఆఖరికి తనూ, తన పరివారము, పురజనుల నిలువు దోపిడీ ఇచ్చి తూచినా త్రాసు ముల్లు కాస్తకూడా కదలదు.

 

అప్పుడు తన తప్పు తెలుసుకొని మార్గాంతరం బోధించమని మహర్షిని కోరితే అప్పుడు చెప్పే పద్యం ఇది:

సీ.
సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు
                 ధనమున్నదే భక్తి ధనము గాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు
                  బలమున్నదే భక్తి బలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు
                  ఫలమున్నదే భక్తి ఫలముగాక !
 సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు
                  విద్యయున్నదె భక్తి విద్య గాక !

ఆ.వె.
సర్వవరదుడైన శాన్వి సన్నిధి జేర్చు
పథము గలదె భక్తి పథముగాక !
కాన యితడు భక్తిగల వారలకె గాని
పరులకగ్గమగునె పడతులార ?





ఇది కూడా చూడండి.!!

బహుభార్యత్వ వ్యవస్థలో సత్యభామ అస్తిత్వ అన్వేషణ

పూర్తిగా చదవండి...

Sunday, January 26, 2020

నేను 30 ఏళ్ళ క్రితం వేసిన బొమ్మలు

 ఎప్పుడో 1990 లో అనుకుంటా, నేను వేసిన బొమ్మలు ఈ మధ్య కనబడ్డాయి. ఏదో పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే ఒక Full Sketchbook నిండా ఇవి కనబడ్డాయి..!  


 

 




సింహాచలం ఘాట్ రోడ్ ఎక్కేముందు కనిపించే తోరణం ఇది. కొండ ఎక్కడానికి బస్సు ఎక్కి, అది ఇంకా బయల్దేరకపోయే సరికి ఈ స్కెచ్ మొదలుపెట్టాను. బస్సు బయల్దేరేదాకా వేసాను..! అందుకే అసంపూర్ణం.

పూర్తిగా చదవండి...

Monday, January 13, 2020

పోతన కవితా చమత్కృతి - రవిబింబంబుపమింప పద్యం:

బమ్మెర పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో, వామనుడు త్రివిక్రమావతారుడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పద్యం ఇది.

మత్తేభము.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/
శ్రవణాలంకృతియై, గళాభరణమై సౌవర్ణ కేయూరమై/
ఛవి మత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర/
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్!

ఒక గీతను చెరపకుండా చిన్న గీత చెయ్యాలి అంటే ఏంచెయ్యాలో మనకందరకూ తెలిసిన సంగతే! దాని ప్రక్కనే మరో పెద్ద గీత గీస్తే సరి..! ఒక వస్తువు పెద్దదా చిన్నదా అని తెలియాలి అంటే దానితో పోల్చి చెప్పడానికి ప్రక్కన ఇంకో వస్తువు ఉండాలి. అలా చెప్తే మనం పోల్చిన ఆ వస్తువుయొక్క గుణము ఎంత పెద్దదో లేదా చిన్నదో తెలుస్తుంది. మనం విమానం లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఆకాశంలో చుట్టుపక్కల మేఘాలో మరింకొకటో ఏమీ లేకపోతే మనం కదులుతున్నట్టే అనిపించదు. నిజానికి మనం చాలా వేగంతో వెళ్తూ ఉంటాం.  అదే విమానం లో మనం నేలపైకి దిగినప్పుడు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న పరిసరాల్ని చూస్తే విమానం ఎంతవేగంతో వెళ్తోందో మనకి అనుభవం లోకి వస్తుంది. 
పై చిత్రాలు రెండూ కీ. శే. బాపు గారివి. వారికి నా కృతజ్ఞతాంజలి.
ఎత్తు- పల్లం, పొడుగు- పొట్టి,  పెద్ద - చిన్న ఇలాంటి వాటికి ఏదో ఒకటి పోల్చడానికి ఉండాలి. ఎందుకంటే అవన్నీ సాపేక్షం కాబట్టి..!  
ఇప్పుడు మనం మన పద్యంలోకి వచ్చేద్దాం..! ఇక్కడ వామనుడు త్రివిక్రముడై భూనభోంతరాలు దాటి పెరుగుతున్నాడు. విశ్వమంతా వ్యాపిస్తున్న అతనిని కొలవాలి, లేదా ఎంతగా వ్యాపిస్తున్నాడో చెప్పాలి అంటే మనకు బాగా తెలిసిన, రోజూచూసే దానితో పోల్చి సాపేక్షంగా చెప్తే బాగా తెలుస్తుంది.       
పోతన ఆ పొలికకు రవి బింబాన్ని ఎన్నుకున్నారు. ఎదుగుతూ ఉన్న వామనుడు ఎంతగా పెరిగాడంటే,
మొదట అతనికి ఛత్రము (గొడుగు) వలె శోభించిన రవి బింబము, తరువాత శిరోరత్నము వలె, చెవి ప్రోగు వలె, కంఠాభరణము వలె, బంగారు దండకడియము వలె, కంకణము వలె, మొలత్రాడులో గంట వలె, కాలి అందె వలె చివరకు పాదం క్రింద పీట వలె భాసించిందట..! గమనించవలసిందేమంటే ఇక్కడ ఈ పొలికలన్నీ పురుషులు తమ శరీరంలో తలనుంచి పాదం దాకా ధరించే వివిధము లైన ఆభరణాలను సూచిస్తున్నాయి. 
ఇక్కడ సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. సూర్యుడు గొడుగు గాను, పాద పీఠం గానూ ‘మారలేదు’. అలా కనిపించాడు అంతే..! ఉపమానానికి అంటే పోల్చడానికి పాత్రమయాడు అని పోతన్న గారే చెప్పారు. అంటే వామనుడు పెరుగుతూ సూర్యుణ్ణి కూడా ఎంతలా దాటి పోయాడంటే గొడుగు వలె కనిపించిన సూర్యుడు అంతలోనే పదపీఠం వలె కనిపించాడట..!                        
ఈ పోలిక ద్వారా వామనుడు త్రివిక్రముడైన రూపం మనకు ఊహించుకోవడానికి ఒక కొలమానం (స్కేల్) ఇచ్చారు పోతన గారు. ఇప్పుడు ఆ ఊహతో ఆ కొలమానాన్నిబట్టి పద్యాన్ని మళ్ళీ చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో..!
సూర్యుడే మనకి చాలా దూరంలో ఉంటాడు, అలాంటిది మరి ఆ సూర్య బింబం త్రివిక్రముడైన వామన మూర్తికి పాద పీఠం గా అమరింది అంటే ఆ స్వామి ఎంతగా పెరిగాడో తెలుస్తుంది..! (తెలుస్తుందా..!?) 

 

ఈ పద్యాన్ని స్వరపరచిన ప్రముఖ సంగీత కళాకారిణి సంగీత సుధానిధి శ్రీమతి మండ సుధారాణిగారు తమ స్వర రచనలో చూపిన చమత్కృతి గమనించండి. ఎంతో ఎత్తున ఉన్న సూర్యుడు అలా అలా క్రిందికి దిగుతున్నట్ట్లు కనిపిస్తున్నాడని కదా పోతన గారి వర్ణన..!? అదే కవి హృదయాన్ని అనుసరిస్తూ పద్యాన్ని తారస్థాయిలో మొదలుపెట్టి మారుతున్న సూర్యుడి స్థానానికికి తగ్గట్టుగా ఒక్కక్క స్థాయికి స్వర సంచారాన్ని అవరోహణ చేయిస్తూ వచ్చి పదపీఠమై అన్న దగ్గర మంద్రస్థాయి షడ్జంలో నిలిపారు.

కాని ఆ సమయంలో వటువు త్రిభువనాలు దాటి ఎదుగుతున్నాడే, మరి ఆ స్వామిని దర్షించాలంటే ఎంత తొందరగా మనం ఆ ఎత్తుకి వెళ్ళాలి? అందుకే శ్రోతలకు ఆ గమనాన్ని సూచించేటట్లుగా ’వటువు తా బ్రహ్మాండమున్ నిండుచోన్’ అంటున్నప్పుడు స్వరాలను మంద్ర స్థాయినుంచి మధ్యమ తారస్థాయి లను దాటించి అతి తారస్థాయికి వేగవంతమైన సంచారం చేయించి త్రిభువనాలను దాటి వెళ్ళాడన్న కవి భావాన్ని తమ స్వరకల్పనలో ఆవిష్కరించి, స్వామి వారి హృదయస్థానమైన తారస్థాయిలో పద్యాన్ని నిలిపారు. పై వీడియో లో పద్యాన్ని ఆలపించింది శ్రీమతి సుధారాణిగారివద్ద వద్ద శిష్యరికం చేస్తున్న మా అమ్మాయి చి. కృష్ణప్రియ.
సర్వవ్యాపి ఐన విష్ణువు మనందరకూ శుభము కలుగజేయు గాక..!
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)