Monday, March 28, 2011

పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక శుభారంభం


వేలమైళ్ళ యాత్ర కూడా ఒక అడుగుతోనే మొదలుతుందనే మాటని నిజం చేస్తున్నారు వీరు. విశాఖపట్నం లోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ - బాలాజీ హిల్స్ వద్ద వున్న 'గ్రీన్ హౌస్ అపార్ట్మెంట్స్'లోని తొమ్మిది ఫ్లాట్ల యజమానులు.. పర్యావరణ పరిరక్షణ దిశగా తమవంతు కృషిని చేస్తున్నారు. వీరందరికీ, స్ఫూర్తినిచ్చి దిశానిర్దేశం చేస్తున్న శ్రీ నరసింహారావు గారు స్థానికంగా ప్రాక్టీసు చేస్తున్న ప్రముఖ ఆర్కిటెక్ట్. 'వేస్ట్ మేనేజ్ మెంట్' గురించి తాను స్వయంగా పరిశీలించి తెలుసుకొన్నవిషయాలను గృహసముదాయంలోని వారందరితో పంచుకొని సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ పట్లవారందరినీ చైతన్యవంతుల్ని చెయ్యడంలో వీరు కీలక మైన భూమికను పోషిస్తున్నారు. రోజువారీ దినచర్యలోని చిన్ననిర్లక్ష్యం కారణంగా మనకు తెలియకుండానే పర్యావరణానికి ఎంతహాని చేస్తున్నామో, కాలుష్యానికి కారణ మవుతున్నామో గమనించి ఆదిశగా తమ కార్యాచరణకు నడుంకట్టారు. "A small gesture of ourselves can avoid burning of 75000 litres of diesel every year which would in turn avoid about 200tons of carbon emissions into the atmosphere every year.." అంటారు శ్రీ నరసింహారావు గారు..!!



వీరి ఫ్లాట్స్ నుంచి బయట పారబోసే వ్యర్ధపదార్ధాలలో...'ఇనార్గానిక్ వేస్ట్' (పాల కవర్లూ, ప్లాస్టిక్ డబ్బాలూ, సీసాలూ, అల్యుమినిం ఫాయిల్స్, మొదలైన పొడి చెత్త) ని వేరుచేసి రిసైకిల్ చెయ్యడానికి పంపడం నియమంగా పెట్టుకొని ఖచ్చితంగా పాటించే ఏర్పాటు చేసుకున్నారు. వినడానికి చాలా చిన్నవిషయం గా అనిపించే ఈనియమాన్ని ప్రతీ పౌరుడూ తమ బాధ్యత గా పాటిస్తే పర్యావరణానికి ఎంత మేలు జరుగుతోందో చెప్పే గణాంకాలతో వారు ఒక చిన్న ప్రదర్శనను ఏర్పాటు చేసారు. అనుభవపూర్వకంగా తాము తెలుసుకొన్న విషయాలను మరో నలుగురితో పంచుకొని తద్వారా వారిని కూడా ఉద్యమంలో భాగస్వాములను చెయ్యడమే ప్రదర్శన యొక్క ముఖ్యోద్దేశం.




గత అయిదారు నెలలుగా చేస్తున్న వీరి సమష్టి కృషి ఫలితం అక్కడి వాతావరణం లో ప్రస్పుటంగా కనిపించింది. గృహిణులు, ముఖ్యంగా పిల్లలూ కూడా పర్యావరణం పట్ల తమ బాధ్యతని గుర్తెరిగి పనిచేయడం తో వారు ఏర్పరచుకొన్న నియమం ఒక అలవాటుగా మారిందన్నారు. కుటుంబాలలో పర్యావరణ పరిరక్షణకై తమవంతు todpaatu నందిస్తున్నప్రతి ఒక్కరూ తాముచేస్తున్న పనిని ఆనందంగా, సగర్వంగా చేస్తుండడం సత్ఫలితాలనిస్తోంది. ఇప్పుడు కిచెన్ నుంచి వచ్చే వ్యర్ధాలను కూడా ఉపయోగించుకొని బయో-గాస్ ఉత్పత్తి చేసే ఆలోచనలో వున్నారు. వారి స్పూర్తి తో మనలాంటి మరికొందరం తోడైతే మన పర్యావరణాన్ని కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో విషయం పై అవగాహన కల్పించి సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.



అందుకే రండి.. ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!





News Item courtesy : 'The Hindu' 28.3.11


'సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్' గురించిన మరింత సమాచారం కోసం : నగర ఆరోగ్య ప్రదాతలు (లింక్ నొక్కండి) అనే slide show చూసి మీ స్పందనను తెలియజేయగలరు.


పూర్తిగా చదవండి...

Saturday, March 26, 2011

మారిపోతున్న పురాణ పురుషుల కథలు



మన వాళ్ళు మధ్య పురాణ పురుషుల కధలని cartoon shows గానూ animations గానూ అందిస్తునారు. ప్రయత్నం మంచిదే..! కానీ కధల్ని యధాతధంగా అందించకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. హనుమంతుడినీ, వినాయకుడినీ ఇంగ్లీషులో వున్న సూపర్ మాన్ , స్పైడర్ మాన్ లకి ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నంలో... పురాణాలలో మనం విన్న అసలు కథలకి ఏమాత్రం సంబంధం లేకుండా చూపిస్తున్నారు.

మొన్నఈ మధ్య ఒక కార్టూన్ ఛానల్ లో విచిత్రమైన కథ తో 'ఓంకార్' అనే సినిమా ప్రిమియర్ షోగా వచ్చింది..! శివ పార్వతులు ఒక గ్రామంలో సామాన్య గృహస్తులకు మల్లె జీవనం సాగిస్తూ వుంటారు. పుత్రులు వినాయకుడు, కుమార స్వామితో పాటు.లక్ష్మి, సరస్వతులను కూడా వీరి సంతానంగానే చూపించారు. సరే.. పిల్లలెవ్వరికీ వాళ్ళ తల్లిదండ్రులు శివపార్వతులని తెలీదు. అసలు వీళ్ళు ఇక్కడ అజ్ఞాతంగా ఎందుకు జీవిస్తారో తెలీదు. నంది అన్నీ తెలిసినా వాళ్ళ పెరట్లో మామూలు ఎద్దు రూపంలో వుంటుంది. ఊర్లోని తోటి పిల్లలు వినాయకుడిని(గణేష్) ఏనుగు మొహం తో వున్నావనీ, కుమారస్వామి(కార్తీక్) బలహీనుడనీ, ఏడిపిస్తూ ఉంటారు. ఒక కుర్రాడు.. మానాన్న(విలన్) కి చెప్పి మీ అందర్నీ కొట్టించేస్తానని భయపెడుతూ ఉంటాడు. వినాయకుడు తమతో వుండడం చిన్నతనంగా భావిస్తూంటాడు కార్తీక్. మనకి కూడా శివపార్వతుల పిల్లలలాగా శక్తులుంటే వీళ్ళందరి పని పట్టేవాడిననుకుంటూ వుంటారు.

ఈ లింక్ నొక్కి టైటిల్ సాంగ్ చూడండి: http://www.youtube.com/watch?v=K7mAayfjcUc

ఊరిలో ఒక శివాలయం వుంటుంది..! విలన్ కోవెల హుండీ దగ్గర కాపుకాసి డబ్బులిస్తేనే లోనికి వెళ్లనిస్తాడు. ఒకరోజు మన కార్తీక్ అండ్ టీం ని కూడా అలాగే ఆపుతాడు. వాడి పనిపట్టడానికి శివుడు విశ్వరూపం చూపించి మూడోకన్ను తెరిచి వాడిని భస్మం చెయ్యడం తో కధ సుఖాంతమౌతుంది. ఊరివాళ్ళతో పాటూ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల రహస్యాన్ని తెలుసుకొని ఆశ్చర్య పడి పోయేస్తారు.

సినిమా చూస్తున్నంతసేపూ ఎంత తిట్టుకున్నానో చెప్పలేను. పిల్లలు చూస్తున్నారు..కాబట్టీ నాకూ తప్పింది కాదు. బాపు కార్టూన్లో చెప్పినట్టు..ఇంత అవకతవక ఖంగాలీ సినిమా నేనింతవరకూ చూడలేదు. పైగా సినిమాలో ఏం చెప్పాలనుకొన్నాడో అర్ధం కాదు.

హనుమంతుడు.. స్కూల్ బాగ్ తగిలించుకొని టోపీ పక్కకి తిప్పి తన స్కూల్ పిల్లలతో అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. 'కృష్ణ' లో కూడా రాధా కృష్ణుల మధ్య జరిగే సంభాషణలూ, విరహ గీతాలూ, మొదలైన వాటి గురించి మోతాదుకి మించి చూపించారు. 'ఘటోత్కచ' నేను చూడలేదు.

ఎంత కల్పితం అయితే మాత్రం పురాణాలూ, ఇతిహాసాల పాత్రలను చూపించేటప్పుడు మరీ ముఖ్యంగా పిల్లలని దృష్టిలో పెట్టుకొని చేసే కార్టూన్లూ లేక సినిమాలూ అసంబద్ధంగా చూపించడం మంచిది కాదు. పాత్రల నేపధ్యం, ఔచిత్యం, వ్యక్తిత్వాలని, పిల్లలకి అర్థమయ్యేలా చూపిస్తేనే అవి పదికాలాలపాటూ నిలిచి వుంటాయి. మన సంస్కృతి, వారసత్వాలను తరువాతి తరాలకు అందించే వారధులుగా నిలచిన చందమామ, అమరచిత్రకథ విజయ రహస్యం ఇదే.

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)