ఈ పుస్తకం బీపీఎల్ మొబైల్ వారి సౌజన్యం తో టైమ్స్ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించ బడింది. హైదరాబాద్ లో అనుకోకుండా
ఒక సెకెండ్ హ్యాండ్ బుక్ స్టాల్ లో నా కంటపడి కొన్నాను. ధర రూ. 250/-. కానీ పుస్తకం మాత్రం అమూల్యం. దేశ విదేశీ ప్రముఖుల వ్యంగ్య చిత్రాలు.. 100 - 120 కి పైగా పేజీలలో ఆర్కే లక్ష్మణ్ గారు గీసిన కారికేచర్స్, పైగా అన్నీ కలర్ పేజీలు..! ఆ పుస్తకం ఎంత సర్వాంగసుందరంగా వుంటుందో ఊహించండి. ప్రతీ ’ముఖం’ క్రిందా ఆ ప్రముఖుల గురించీ క్లుప్తంగా నాలుగు వాక్యాలు కూడా ఇచ్చారు. (పుస్తకం పేరు: FACES : The Millennium Series by RK Lakshman - Times of India Publication)
పైన చెప్పుకున్న వ్యంగ్య చిత్రాలు ’రాష్ట్రపతులూ, ప్రధానులూ, ముఖ్యమంత్రులూ, ఉత్తి మంత్రులూ, రాష్ట్ర మంత్రులూ, నేతలూ, మేధావులూ, కళాకారులూ, విదేశీ ప్రముఖులూ..’ ఇలా వర్గాలుగా విడదీయబడి ఉన్నాయి. గాంధీగారు, నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడర్, రామ్ మనోహర్ లోహియా, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మొదలైన వారివి ఎందరివో వ్యంగ్య చిత్రాలు వున్నాయి. వాటిలో కొన్ని మీకోసం..
రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్ అంటే చెప్పలేకపొవచ్చు గానీ సా…గినట్టుండే ఆర్కే లక్ష్మణ్ అని బ్రష్ తో పెట్టిన ఇండియనింకు సంతకం చూస్తే మాత్రం ఠపీమని చెప్పెస్తారు. వారి అసలు ఫేసు చాలామందికి తెలీకపోవచ్చు. కానీ వారు సృష్టించిన (అ)సామాన్యుడు మనకంటిముందు మెదుల్తాడు. మన బాపుగారికి రమణగారున్నట్టే వీరికీ నారాయుడనే (ఆర్కే నారాయణ్) అన్న వున్నాడు. అయితే ఈయన నిఝంగా సొంత అన్న. అన్నరాతకి తమ్ముడి గీత తోడైంది. ఆయన మాల్గుడి కథలు వ్రాస్తే, ఈయన ఎనిమిది - పదేళ్ళ స్వామి, వాళ్ళ స్నేహితులని మన ముందు నిలబెట్టాడు.
మైసూరులో ఒక స్కూల్ హెడ్మాస్టర్ గారి ఆరో సంతానంగా జన్మించిన లక్ష్మణ్ చిన్నప్పుడే తండ్రి పోవడంతో అన్నల సంరక్షణలో పెరిగాడు. బొమ్మలూ, పెయింటింగ్ మీద ఆసక్తి, అతనితో పాటు పెరిగింది. హైస్కూల్ చదువు ముగించాక బొంబాయి లోని ప్రఖ్యాత జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో తన అభిరుచికి మెరుగులు దిద్దుకోవాలనుకొన్నా, “ మీ ప్రతిభ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో విద్యార్ధిగా చేరడానికి తగినంతగా లేదం”టూ ఈయన అప్లికేషన్ ని వెనక్కు తిప్పి పంపడంతో, మైసూర్ యూనివర్సిటీ నుంచీ ఆర్ట్స్ లో పట్టా పొందారు. అదే సమయంలో కార్టూనిస్టుగా, పత్రికల్లో కథలకు ఇల్లస్ట్రేటర్ గా పనిచేస్తూండేవారు. ఒక పక్క తన అన్న ఆర్కే నారాయణ్ కథలకు’ హిందూ’ లో బొమ్మలు గీస్తూనే పొలిటికల్ కార్టూనిస్టుగా కూడా తన ప్రతిభను చాటారు. ’ ఫ్రీ ప్రెస్ జర్నల్’ అనే పత్రికలో కార్టూనిస్టుగా మొట్టమొదటి ఫుల్ టైం ఉద్యోగంలో చేరారు. అదే పత్రిక లో ఇప్పటి శివసేన అధినేత బాలథాకరే కూడా సహోద్యోగి గా పనిచేసేవారు. (మన రేఖాచిత్రం బ్లాగు సురేఖ అప్పారావుగారి వద్ద లక్ష్మణ్, థాకరే గారివి కలిపి వున్నకార్టూన్ల పుస్తకం చూసాను.) తరువాత కొంతకాలానికి ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ కు మారిపోయి కార్టూనిస్టుగా యాభయ్యేళ్ళకు పైగా తన సేవలందించారు మన లక్ష్మణ్.
వీరు సృష్టించిన కార్టూన్ పాత్రల్లో ప్రథమంగా చెప్పుకోదగ్గది టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా పాఠకులకు పరిచయమైన ’కామన్ మ్యాన్’. ఈ వ్యక్తి ఎంత సామాన్యుడంటే బొంబాయి లోని ఖరీదైన జుహు బీచ్ ఒడ్డున కాంస్య విగ్రహం పెట్టించుకొనేంత..!! పూణే మహా నగరంలోని ప్రసిద్ధ ’సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ’ ఆవరణలో కూడా అతని విగ్రహం వుంది.
ఏషియన్ పెయింట్స్ కి వీరు గీసి ఇచ్చిన మస్కట్ (పేరు ’గట్టు’) కూడా ఎనభయ్యో దశకంలో పెద్దల్ని, పిల్లల్ని కూడా చాలా అలరించింది. బాలకార్మిక వ్యవస్థ పై నిషేధం అమల్లోకి వచ్చిన తరువాత పెయింట్ల తో ఆడుకొనే చిన్నకుర్రాడిని పోలివుండే ’గట్టు’ ను ఏషియన్ పెయింట్స్ వారు తమ ప్రచారాలనుంచీ ఉపసంహరించుకొన్నరు. ’గట్టు’ బాలకార్మికుడిని తలపించడమే ఈ నిర్ణయానికి కారణం కావచ్చు.
అవార్డులు:
- B.D. Goenka Award - The Indian Express
- Durga Ratan Gold Medal - Hindustan Times
- Padma Bhushan - Govt. of India
- Padma Vibhushan - Govt. of India
- Ramon Magsaysay Award for Journalism, Literature and Creative Communication Arts - 1984
- Lifetime Achievement Award for Journalism - CNN IBN TV18, 29 January 2008.
ఆర్కే లక్ష్మణ్ గారి ఫోటోలు, మరికొన్ని వ్యంగ్య చిత్రాలకోసం ఇక్కడ నొక్కండి.
వివరాలు: వికీపీడియా సౌజన్యంతో