Saturday, January 21, 2012

పరమపద సోపాన పటము

పరమపద సోపాన పటము :
వైకుంఠపాళి అని మన తెలుగువారికి సుపరిచితమైన ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా వేరువేరు పేర్లతో ప్రచారంలో వుంది. పేరులో ఏముంది కానీ ఈ ఆటని తెలియని వారుండరు. పైన చూపించిన బొమ్మ పెద్ద కాలండర్ సైజు లో మా చిన్నప్పుడు సంక్రాంతి, శివరాత్రి మొదలైన పండగలకు వీధిలోకి తెచ్చి అమ్మేవారు. అప్పట్లో బయట పుస్తకాల షాపుల్లో కూడా దొరికేవి. అప్పట్లో మేము గవ్వలతో ఆడేవాళ్ళం. చివరిసారిగా నేను ఈ పటాన్ని ఎనిమిది చదువుతున్నప్పుడు చూసాననుకుంటా. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించింది.  అప్పుడు black&white  లో వుండేది. మేము ఇది కలర్ లో చూడలేదు.
ఇప్పుడు "పాములూ నిచ్చెనల" పేరుతో నేటితరం పిల్లలందరూ ఆడుతున్నారు. గూగుల్ లో దేనికోసమో వెతుకుతుంటే ఇది కనబడింది. 
ఈ ఆట యొక్క రూపకర్తలకు నిజంగా జోహార్లు. ఎన్నో విశేషాలు వున్నాయిందులో..! ఆట పేరు పరమపద సోపాన పటము. "పరమ పదం అంటే వైకుంఠం లేదా సద్గతి. తద్విష్ణోః పరమం పదం అనేది వేదోక్తి. దీని ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదం." అంటే వైకుంఠం. పరమ పదం మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణ వచనం. మోక్షప్రాప్తి తరువాత సద్గతి పొందిన మనిషికి మరుజన్మ ఉండదు. ఆ లక్ష్యాన్ని అందుకొనడానికి ప్రయత్నించడమే ఈ ఆటలోని ముఖ్యోద్దేశం. మనం జీవితంలో ఏ పనులు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళ్తామో ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనల గళ్ళలో వ్రాసి వున్నాయి. అవి వరుసగాఇలా వున్నాయి..:
సుగుణం ...సాలోక్యానికి, సత్ప్రవర్తనము... గోలోకానికి, నిష్ఠ ... తపోలోకానికీ, యాగము... స్వర్గలోకానికీ , భక్తి.... బ్రహ్మ లోకానికీ, చిత్తశుద్ధి ...మహా లోకానికీ, జ్ఞానము.. కైలాసానికీ, సోపానాలుగా ఉన్నట్లు చూడగలం. అక్కడకు చేరిన తరువాత ఇక జన్మరాహిత్యం, ఈశ్వరత్వం తో కూడిన పరమపదాన్ని చేరటానికి మన వంతు వచ్చేవరకూ       (అంటే సరైన పందెం పడేవరకూ..)ఎదురు చూడడమే. అలాగే  అంతవరకూ పోయిన పిదప మత్సర్యమూ, అహంకారం దరి చేరామా మ్రింగడానికి పాము సిద్దంగా వుంటుంది. అది మనల్ని పుణ్య హీనులుగా చేసి రాక్షసులను, హీన జన్ములుగానూ  చేస్తుంది. 
ఈ మొత్తం త్రోవలో మనం మనలోని పాముల లాంటి అవలక్షణాలను ఎన్నో దాటుకొని రావలసి వుంటుంది. అవి  మన లోనే వుండక్కరలేదు. ఆ లక్షణాలు కలిగిన రాక్షసుల దరి చేరినా అధోగతి ( పాము మింగి క్రిందకు పడిపోతాం) పట్టక తప్పదు.  
ఈ రకంగా సత్య పథం లో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక 'సూచిక' గా మనం అన్వయించుకోవచ్చు. 
 ఇదే ఆట పాశ్చాత్య శైలిలో :
ప్రక్కన చూపిన రెండో బొమ్మ చూడండి. ఇది ఇంగ్లీషులో వుంది. చాలా పాతది అనుకుంటాను. దీనిలో కూడా పైన చెప్పిన మన పరమపద సోపాన పటం లగే వుంది. మనిషి యొక్క ఉన్నతికి, పతనానికీ దోహదం చేసే లక్షణాలను నిచ్చెనలూ, పాముల రూపం లో చూపించారు. చిన్నపిల్లలు / పెద్దవారు ఆడుకొనే ఆటలో ఎన్ని విశేషాలు జతచేసారో చూడండి.

ఈ ఆట మొదట ఎక్కడ / ఏదేశంలో మొదలైందో తెలీదు. అయితే ఇప్పుడు 'స్నేక్స్ అండ్ లేడర్స్' మాత్రమే కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా డైస్ తో ఆడుతున్నారు. గవ్వలతో ఎవరూ పెద్దగా ఆడటం లేదు. 'అష్ట - చమ్మ, 'పులి మేక', లాంటి సంప్రదాయ క్రీడలు, వాటి రూపకల్పనలో దాగివున్న జీవితానికి పనికి వచ్చే నీతి సూత్రాలు లేదా సిద్ధాంతాలు మరుగున పడిపోతున్నాయి.
అలాంటి పాత / సంప్రదాయ క్రీడలను వెలికి తీసుకు రావడానికి http://gamepandit.com/index.html వారు కృషి చేస్తున్నారు. చూసి ఆనందించండి.
పైన చూపిన పరమ పద సోపాన పటం బొమ్మ 

16 comments:

  1. ఒక్క సారి మనసుని చిన్నప్పటి రోజులకి తీసుకెళ్ళి పోయారండీ. చాలా బాగా రాశారు.

    ReplyDelete
  2. మంచి పోస్ట్ రాసారు . చిన్నప్పుడు , ముఖ్యంగా వేసవి సెలవుల్లో రోజంతా ఆడేవాళ్ళం . పెద్దపాము మింగితే కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్న రోజులుకూడా వున్నాయి . పదే పదే పాములబారిన పడుతుంటే దేవుడికి దణ్ణం పెట్టుకొచ్చి ఆడటం గుర్తుంది. నేను చూసిన పటం లో పాముల తోకదగ్గర నరక బాధలు ఉండేవి. నూనెలో వేపటం, మంటల్లో కాల్చటం వంటివి. పెద్దవాళ్ళు వాటిని చూపించి ఏ తప్పు చేస్తే, ఏ శిక్ష పడ్తుందో చెప్పుతుంటే , అందంతా నిజమని నమ్మేసేవాళ్ళం .

    ReplyDelete
    Replies
    1. రాధేశ్యాం, ,

      అద్భుతంగా ఉన్నది సమాచారం. ఈ వైకుంఠపాళి ఆట మా చిన్న తనంలో అంటే 1966-72లలో తెగ ఆడేవాళ్ళం. మీరు చెప్పినట్టుగా నలుపు తెలుపులోనే ఉండేది. నాలుగు చింత గింజలు ఒక పక్క అరగదీసి ఒక పక్క తెల్లగా వచ్చేట్తుగా చేసి వాటితో పందాలు వేసేవాళ్ళం.తరువాత్తరువాత గవ్వలు, ఆపైన పాచికలు సంపాయించాము. కొంతకాలం క్రితం నేను కూడా ఇది జ్ఞాపకం వచ్చి గూగులిస్తే దొరకలేదు. ఇప్పుడు మీరు అందించి మంచి ఆనందాన్ని, చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

      ఈ సారి విజయవాడ వెళ్ళినప్పుదు వెతికి ఈ పటం కొనుక్కోవాలి.

      మనకు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళు ఈ వైకుంఠపాళి ఆటను కంప్యూటర్లో ఆడుకునేట్టుగా ఒక గేం తయారు చేస్తే బాగుండును.

      Delete
    2. లలిత గారూ,
      మాకుకూడా అదే అనుభవం. టపా నచ్చినందుకు సంతోషం.
      శివ గారూ,
      చింతపిక్కల సంగతి నేను మర్చేపోయాను. భలేగా గుర్తు చేసారు. అవి అరగదీస్తున్నప్పుడు వేళ్ళు ఒక్కోసారి చీరుకుపోయేవి కూడా.

      Delete
  3. అరె.. మేము కూడా ఈ ఆట చాలా సేపు ఆడేవాళ్ళం.. వేసవి సెలవలు వస్తే చాలు.. ఇంక అదే పని.. Business అని ఇంకో ఆట ఉందది.. అది కూడా ఇలానే ఆడుతూనే ఉండే వాళ్ళం.. చాన్నాళ్ళకు గుర్తు చేసారు..

    and thanks for the explanation too... :)

    ReplyDelete
  4. avunu idi aadatam valana pillalaki ....paapam ante bayam,punyam cheyyali ilaativi kooda telustaayi...nice post

    ReplyDelete
    Replies
    1. శశికళ గారూ,
      పొస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. రాధేశ్యాంగారు, వైకుంఠపాళీని మళ్ళీ తెచ్చి రంగులద్ది చూపినందుకు ధాంక్స్.
    పెద్ద పాము పేరు కోసం మొన్న ఒకరోజు చాలా ఆలోచించాను. అరుకాషుడు అని ఇప్పుడు ఈ బొమ్మలో చూసి గుర్తు తెచ్చుకున్నాను.

    కర్కోటకుడు అనే పేరు ఒక పాము పేరు కదా. దాని పేరు మళ్ళీ పెద్దయ్యాక భారతంలో విన్నాను. గరుత్మంతుడి పెదతల్లి కద్రువ వెయ్యిమంది కొడుకుల్లో ఒకడు. గరుత్మంతుడు తల్లి -వినత కోసం ఎలా కష్టపడి అమృతం తెచ్చి దాస్యవిమోచన చేసాడో అలాగే కర్కోటకుడు కూడా తన తల్లి మాట నెగ్గించడం కోసం ప్రయత్నం చేసి ఆ వినత దాస్యానికి కారణం అయ్యాడు.
    ఇద్దరూ తల్లి పై భక్తి ప్రేమ చూపిన వాళ్లే కానీ ఏం చేస్తాం...గరుడుడికే క్రెడిట్ అంతా దక్కింది...

    ReplyDelete
  6. సుధ గారూ,
    ఈ బొమ్మకి నేను రంగులద్దలేదండీ..! అద్ది వున్న బొమ్మనే నేనుచూసి మీతో పంచుకున్నా.. అంతే!!
    //గరుత్మంతుడు తల్లి -వినత కోసం ఎలా కష్టపడి అమృతం తెచ్చి దాస్యవిమోచన చేసాడో అలాగే కర్కోటకుడు కూడా తన తల్లి మాట నెగ్గించడం కోసం ప్రయత్నం చేసి ఆ వినత దాస్యానికి కారణం అయ్యాడు.
    ఇద్దరూ తల్లి పై భక్తి ప్రేమ చూపిన వాళ్లే కానీ ఏం చేస్తాం...గరుడుడికే క్రెడిట్ అంతా దక్కింది...//
    చాలా కరెక్ట్ గా చెప్పారు. వినతా సుతుడైన గరుడుడు ధర్మమార్గాన్ని అనుసరించాడు కనుకనే పరమ పదం చేరాడు.అదికూడా ఆ శ్రీహరికి వాహనంగా..! అదే కదా ఈ ఆటలో మనకు కనిపించే జీవితసత్యం.

    ReplyDelete
  7. బాగుంది ..బాగా రాసారు ఆట లో మజా అంతా పెద్ద పాము కి దొరికి కిందకి పడ్డప్పుడు , పై కి చేరి కూడా పడాల్సిన అంకె పడకుండా ఎదురు చూసేటప్పుడు ఉండేది .

    ReplyDelete
  8. వంశీకృష్ణ గారూ, ధన్యవాదాలు.
    కర్మణ్యే వాధికారస్తే మాఫలేశుకదాచన.. మీకు పాచికలు వెయ్యుట యందే అధికారమున్నది కాని, పాములచే మ్రింగబడ్డం, నిచ్చెనల కోసం ఎదురుచూడ్డంలో లేదు.

    ReplyDelete
  9. ఆలోచనకు అందని వేదాంత విషయాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనే తపనగల ఋషితుల్యులైన మనపూర్వీకులు ప్రాతఃస్మరణీయులు.. ఉపయోగకరమైన విషయాన్ని సేకరించి అందించిన మీరు అభినందనీయులు..

    ReplyDelete
  10. Ippudu illantivi dhorakandam ledhu, nenu maa abhaiyiki chupinchali ani anukuntunanu... evarikaina ekkada dhorikuthayo chepagalaru ani manavi

    ReplyDelete
  11. గతించిపోయిన కాలం గురించి పునశ్చరణ చేయించారు. ధన్యవాదములు

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)