Sunday, November 4, 2012

శకునాలూ..! సెంటిమెంట్లూ..!!


సెంటిమెంట్ , శకునం అంటే ఏమిటి..?


           
రెండూ మనిషియొక్క నమ్మకం మీద ఆధార పడేవే..! అలాగే రెండిటి పర్యవసానం ఒకటే గానీ కొంచం తేడా ఉంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 'శకునం' చూసుకొని వెళ్ళమంటారు. ముత్తైదువ ఎదురొస్తే మంచిది.., దంపతులు ఎదురొస్తే మంచిది.., పిల్లి ఎదురొస్తే మంచిది కాదు.., పనిమీద వెళ్తున్నప్పుడు తుమ్మితే లేదా ఎక్కడకి అని అడిగితే పని జరగదు..,   ఇలా శకునాల గురించి పంచాంగాల్లో చూస్తే చాలానే రాసి వుంటుంది.! [దీనిలో కొన్ని శకునాలకి స్త్రీ పురుషుల తేడాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి అబ్బాయిలకి కుడికన్నులేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. ( ఘంటసాల పాత పాట ఒకటి గుర్తుతెచ్చుకోండి.. అన్నీ మంచి శకునములే.. కన్యా లాభ సూచనలే..).  అదే కుడికన్నుఆడవాళ్ళకి అదిరితే మంచిది కాదంటారు.]  
        ఇక సెంటిమెంటు అనేది మనోభావాలకి సంబంధించినది. ఇది ఒక్కో వ్యక్తికీ ఒక్కో విధంగా ఉండడం చూస్తాం. కలాపోసన లేని మడిసి (గొడ్డు లాంటోడయినా) ఉంటాడుగాని  సెంటిమెంటు లేని మనిషి బహుశా ఉండడేమో..!!
ఇది లాజిక్ కి అందనిది, సైన్సు నిరూపించలేనిది. సమాజంలో వివిధరంగాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలూ, క్రీడలూ, సినీమా, వ్యాపారం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. విద్యార్ధులూ, ఇంటర్వ్యూ లకు వెళ్ళే వారికి కూడా ఈ బాధ తప్పదు. మొదటి రకానికి చెందిన వారిలో ఆ సెంటిమెంటు జీవితాంతం ఉంటే రెండో వర్గానికి ఇది సందర్భానుసారం మారుతూ ఉండవచ్చు. చూసేవాడికి  చాలా సిల్లీ గానూ మూర్ఖం గానూ అనిపించే విషయాలు ఆ సెంటిమెంట్ ఉన్నవాడికి డూ ఆర్ డై లాగా ఉంటుంది...!!
        నామట్టుకు నాకు చిన్నప్పుడు కొన్ని సెంటిమెంట్లు ఉండేవి. పరీక్షలలో మొదటి పరీక్షకి వెళ్ళినప్పుడు ఏ చొక్కా వేసుకొని వెళ్ళానో అదే చొక్కా అన్ని పరీక్షలకీనూ..!! (మధ్యలో ఏదైనా పరీక్ష చెడగొట్టాననుకోండి...! వెంటనే అదే సెంటీ ఇంకో చొక్కా మీదకి మారిపోయేది.) అలాగే పరీక్షలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ త్రోవలో చదువుకుంటూ వెళ్ళేవాడిని కాదు. పదోక్లాసులో లెక్కల పరీక్షకి (మొదటి యూనిట్ టెస్ట్) పరీక్షకి బయల్దేరి స్కూల్ కి వెళ్ళేదాకా రోడ్డుమీద చదువుకుంటూ వెళ్లాను. ఆరోజు పరీక్షలో ఒక్క లెక్కకి కూడా ఆన్సర్ రాయలేక పోయాను. ఖాళీ పేపర్ ఇచ్చేయ్యడంతో సున్నా వచ్చింది. అప్పటి నుంచి సెంటిమెంట్ పట్టుకుంది. తరువాత చచ్చినా త్రోవలో చదివేవాడిని కాదు. తరువాత ఫైనల్ పరీక్షల్లో 98 వచ్చాయనుకోండి.. ! అదివేరే విషయం..!!
              క్రికెటర్స్ లో కొందరికి ఒక స్టేడియం అచ్చొచ్చిందైతే మరికొందరికి ఇంకోటి. ఈ సెంటిమెంట్లని ఎస్టాబ్లిష్ చెయ్యడం లో పత్రికల వాళ్ళు ముందుంటారు. ఏదో రకంగా బోడిగుండుకీ మోకాలికీ ముడి వేసి కొన్నాళ్ళకి అదే సెంటిమెంటుగా ప్రాచుర్యం లోకి తెచ్చేస్తారు. క్రీడాకారుల నమ్మకాలే వీళ్ళూ రాస్తారేమో కూడా..! సెంటిమెంటు కొద్దీ ఒక ఆటగాడు పిచ్ మీదకి బ్యాటింగ్ కి రాగానే మూడుసార్లు తన పాడ్ ని సర్దుకొని ఆకాశం వైపు చూస్తే, ఇంకో ఆటగాడు తన కుడి చేత్తో బాట్ పట్టుకొని అపసవ్య దిశలో బ్యాటు ని  గాల్లో రెండున్నర సార్లు తిప్పి సూర్యుడి వైపు చూస్తాడు. ప్రేక్షకులకీ ఇలాంటివి ఉంటాయండోయ్..!! కొందరు మన టీం బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ కూర్చున్న చోటు నుంచీ కదలకపోతే (కాలుకూడా పెట్టిన చోటు నుంచి కదపని వాళ్ళు నాకు తెలుసు.), వీడు టీ తాగగానే వికెట్టు పడిందని ఆట అయ్యే లోపల ఇరవై కప్పులు ఊదేసేవాళ్ళు కొందరు. అలాగే పాకిస్తాన్ తో మాచ్ కి శుక్రవారం సెంటిమెంట్ కూడా ప్రాచుర్యం లో ఉన్నదే.

                సినిమా పరిశ్రమలో కొందరు హీరోలకి సినిమా పేరు ఫలానా అక్షరంతో మొదలవ్వాలని సెంటిమెంటైతే, ఇంకొందరికి పేరు చివర పొల్లు ఉండాలి. కొందరికి సంక్రాంతి సెంటిమెంటైతే మరికొందరికి దసరా..! రాజకీయ నాయకులకి ఈ సెంటిమెంట్లు ఇంకా చిత్రంగా ఉంటాయి. ఈ నియోజక వర్గం నుండీ ప్రచారం మొదలెడితే జయం నిశ్చయం అనీ, ఫలానా ఊరిలో శంకుస్థాపనకో రిబ్బన్ కటింగ్ కో వెళ్తే అట్నించి అటే పదవి పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, చాలా..!! ఒక స్థానం లో పని చేసిన మంత్రులిద్దరూ వేరే వేరే కారణాల వాళ్ళ పదవి అర్ధంతరంగా ఊడగొట్టుకుంటే ఆ వచ్చే మూడో ఆయన, ఆయనకి  బాగా అచ్చొచ్చిన పార్టీ ఆఫీసు నుంచో  క్యాంపు  కార్యాలయం నుంచో పనులు నడుపుతాడు గానీ, చచ్చినా పాత ఆఫీసులో కాలు పెట్టడు. పెట్టినా దాని రూపు రేఖలూ, వాస్తూ సమూలం గా మార్చిగానీ గృహప్రవేశం చెయ్యడు.


              పైన చెప్పిన అన్ని సందర్భాలలోనూ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరి మధ్యా కామన్ గా కనిపించేది వారి మానసిక దౌర్బల్యమే (బలహీనత) తప్ప మరొకటి కాదు. తమ జీవితాలలో ఒక స్థాయికి చేరడానికి స్వయంశక్తిని నమ్ముకున్నవారు ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఈ సెంటిమెంట్ ల మీద ఆధారపడడం మొదలుపెడతారు. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సెంటిమెంట్ కి రాజూ - పేదా తేడాలేదు.  దీనికి ముఖ్య కారణం ఫలితాన్ని ఆశించి పని చెయ్యడం..! ఆశించిన ఫలితం వచ్చి తీరాలనో, రాకపోతే ఏదో  అయిపోతుందేమోననే భ్రమ, దాని పర్యవసానమైన భయం ఇంకో కారణం. కొన్నిసందర్భాలలో ఈ సెంటిమెంట్ విషయంలో అది ఉన్న వ్యక్తులకే అది చాలా ఫూలిష్ గా అనిపిస్తుండొచ్చు. కానీ అది పాటిస్తే పని జరుగుతుందన్న నమ్మకం కన్నా పాటించకపోతే పని జరగదన్న అపనమ్మకం ప్రభావమే అధికంగా ఉంటుంది..! అందువల్ల ఆ సెంటిమెంట్ ని వదలలేక సతమతమౌతూ ఉంటారు.
                 ఈ మానసిక స్థితి నుంచీ బయటపడాలంటే చెయ్యవలసింది మన శక్తియుక్తులన్నీ చేసే పనిమీద కేంద్రీకరించి చేసే పనిని నీకు చేతనైనంతలో చక్కగా చెయ్యడం, ఫలితాన్ని ఆశించక పోవడం.
గీతాచార్యుడి వాక్కుని జ్ఞాపకం చేసుకుందాం: 
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
నీకు కర్మలను ఆచరించుటయందు అధికారమున్నది గాని కర్మఫలములపైన లేదు.
ఫలితం ఎలాఉన్నాఫరవాలేదనే మానసిక స్థితికి మనం చేరగలిగినప్పుడు, దాన్ని మనం ప్రభావితం చేస్తున్నామనే భ్రమలో పాటించే ఈ సిల్లీ సెంటిమెంట్లకి దూరంగా ఉండగలుగుతాం.

1 comment:

  1. మీరు చెప్పినదానిలో అర్ధసత్యముంది

    ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)