Wednesday, November 21, 2012

భరత మాత ముద్దు బిడ్డలు.. !!


              26 నవంబరు 2008 నాటి రాత్రి ముంబాయి నగరానికి కాళరాత్రి. ఆనాటి ముష్కర మూకల దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మలకు నేడు శాంతి చేకూరింది. ప్రాణాలతో పట్టుబడ్డ ఒకేఒక్క తీవ్రవాది కసబ్ ను మన న్యాయస్థానాలు చట్టప్రకారం విచారించి విధించిన ఉరిశిక్షను ఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత అమలు చేసి వారి బలిదానానికి ఈ రోజు భారత ప్రభుత్వం బదులివ్వగలిగింది. అతడు అప్పీలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే మరిక ఎలాంటి సాగతీతకూ తావివ్వకుండా, రెండో కంటివాడికి  కూడా తెలియకుండా శిక్షను అమలుపరచి ఆనాటి అమరవీరుల కుటుంబాలకు స్వాంతన చేకూర్చగలిగింది. 
                 రాజకీయ నాయకుల కొట్లాటలూ, ఈ ఉదంతం నుండి లబ్ధి పొందడానికీ, తద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించడాలూ, మీడియా రాద్ధాంతాలూ, మన మేధావుల వ్యాఖ్యానాలూ ఇక రాబోయే రోజుల్లో తప్పక చూడబోతాం. కానీ నిజానికి తమకున్న ఆధారాన్నీ, పెద్దదిక్కునీ కోల్పోయిన ఆకుటుంబాలు తమ జీవితంలో అస్సలు ఊహించని అతిపెద్ద కుదుపుకి లోనయ్యాయి. వారికి మన రాజకీయ నాయకుల మెరమెచ్చు మాటలు స్వాంతనని కలిగించలేవు. వారికి కలిగిన నష్టం పూడ్చలేనిది.
            ఆనాటి రాత్రి దేశం మీద కేవలం పదిమంది సీమాంతర ఉగ్రవాదులు జరిపిన యుద్ధంలో మరణించిన ఒక్కొక్క వీరుడిదీ ఒక్కొక్క వీరగాధ. ఒక్కొక్కరి నేపధ్యాలూ, స్థితిగతులూ, హోదాలూ వేరు..!! కానీ అన్ని కథలలోనూ వినిపించిన అంతర్వాణి దేశభక్తి తప్ప మరొకటి కాదు. ఆ విపత్కర సమయంలో ఏ ఒక్కరూ మడమ త్రిప్పలేదు. తమ దేశ ప్రజల కోసం పోరాడారు. ఆ క్షణంలో వారి మదిలో దేశరక్షణ, విధి నిర్వహణ, ముంబైకార్ల భద్రత తప్ప మరొక విషయం ఆలోచించి ఉండరేమో..! ప్రమాదానికి రొమ్ము ఒడ్డి తన బలగాన్ని లీడ్ చేసి 'ముందుండి నడిపించడం' అంటే ఏమిటో చూపించారు ఈ ఉన్నతాధికారులు..! తమ కుటుంబానికి తామే ఆధారమైనా, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించారు ఈ చిరుద్యోగులు. ప్రమాదం ఎటునుంచి పంజా విసురుతుందో తెలియని నిశిరాత్రిలో మనకెందుకని పారిపోకుండా, గాయపడ్డ తోటివారికి సహాయమందించారు మరికొందరు సామాన్యులు.  ఆ నాయకత్వ లక్షణాలు, తెగింపు మరువలేనిది.  ఇలాంటి వారు మన జాతికి గర్వకారణం..! మన యువతకు స్ఫూర్తి కలగాల్సింది ఈ యోధుల పోరాట పటిమ నుంచి...! మన నిజమైన దేశనాయకులు వీరే..!!   మాతృభూమి ఋణం తీర్చుకున్న వీరే భరత మాతకు నిజమైన ముద్దు బిడ్డలు...!!


కీ. శే. హేమంత్ కర్కరే 

 కీ. శే. అశోక్ కాంప్టే 

కీ. శే. విజయ్ సాలస్కర్ 
కీ. శే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ - ఆ కళ్ళలో కొట్టొచ్చిన ఆత్మవిశ్వాసం చూడండి..!!


 కీ. శే. తుకారాం ఓంబ్లే - తన శరీరాన్ని బుల్లెట్లు జల్లెడ చేస్తున్నా లక్ష్యపెట్టక అజ్మల్ కసాబ్ ను సజీవంగా పట్టుకొని  ప్రాణాలు విడిచిన  ధీశాలి.

ఇంకెందరో అమరవీరులు ..!!

మానవత్వం మీద జరిగిన దాడిలో 
విధినిర్వహణలో దేశం కోసం ప్రాణాలొడ్డిన ఈ  వీరపుత్రులకు 
శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.
జై హింద్..!! జై హింద్..!! జై హింద్..!!
********
దేశాభిమానము నాకు కద్దని 
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనా ఒక మేల్ 
కూర్చి జనులకు చూపవోయ్..!

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
***************


6 comments:

 1. విధినిర్వహణలో దేశం కోసం ప్రాణాలొడ్డిన ఈ వీరపుత్రులకు
  శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.

  ReplyDelete
 2. వీరులకు జోహార్ !

  ఈ త్యాగాలను కూడా రాజకీయంచేయజూచిన నీచులకు .............

  ReplyDelete


 3. ప్రాణాలను లెక్కచేయకుండా దేశం కోసం పోరాడిన అమరవీరులకు జోహార్లు

  ReplyDelete
 4. Endaro mahanubhavula atmarpana
  mana bhavitaku bangaru deevena

  ReplyDelete
 5. అమరవీరులకు జోహార్లు... Great post andee

  ReplyDelete
 6. Good writing Radheshyam.

  My view is that the perpetrators behind should also be dealt with as sternly. With the hanging of this fellow, whether we are safe in our country from another such attack. Unfortunately NO. Both Government and People should be ever vigilant.

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)