Saturday, October 23, 2010

మనకు కనబడే వడ్డాది పాపయ్య...

మనకు కనబడే వడ్డాది పాపయ్య...
డ్డాది పాపయ్య గారు ఎప్పుడూ ప్రచారానికి దూరంగా వుండే వ్యక్తి కావడం తో ఆ మహోన్నత కళాకారుణ్ణి మనం ఆయన బొమ్మలలోనే చూసుకోగలుగుతున్నాం...తన కంటే తన కవితకూ, లేదా శిల్పానికీ లేదా చిత్రాలకూ శాశ్వతత్వం లభించాలని కోరుకొనే కవులూ, శిల్పకారులూ, చిత్రకారులూ వారి కళ కోసం జీవితాన్ని ధారబోసి వారు అజ్ఞాతంగా ఉండిపోయే దాఖలాలు ఎన్నో... అట్టివారు నిజంగా కారణ జన్ములూ త్యాగధనులూనూ ..
కానీ అజరామరమైన ఆ కళతో పాటూ వారికి కూడా సముచిత స్థానాన్ని ఇచ్చి వారి 'పేరు' కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలబడేలా చెయ్యడం కళారాధకులుగా మనందరికీ సమానమైన బాధ్యత వుంది.. వారి సేవలందుకున్న చందమామ యాజమాన్యానికి ఈ బాధ్యత కొంచం ఎక్కువ సమానం అని నా ఉద్దేశం .
*****
వపాగారి పెయింటింగ్స్ ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం..
మన భారతీయ సంస్కృతినీ, మన పురాణేతిహాసాలనీ ఆయన ఔపోసన పట్టారా, లేక వాటిలోని పాత్రలన్నిటినీ దర్శించ గలిగిన అపర వ్యాస భగవానుడా అన్నంతగా ఆ సన్నివేశాలను కథకు తగ్గట్లుగా చిత్రించారు. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ బొమ్మల్లో ఎంతో లోతైన భావ చిత్రణ...బొమ్మ composition లో కూడా ప్రాధాన్యత బట్టీ ఆ పాత్రల సైజు.. ఆహార్యం..నేపథ్యం..వాతావరణం..ఇలా చాలా అంశాలు పరిగణనలోకి తీసుకున్నట్టుంటాయి. అలాగే మొదటి సారి చూచినప్పుడు మన కళ్ళబడని అంశాలు..రెండోసారీ మూడోసారీ చూస్తున్నప్పుడు..కనబడితే..ఒక రకమైన సంభ్రమం కలిగే సందర్భాలు అనేకం. భూ నభొంతరాలని, గడ్డిపూవునీ, అలాగే విశ్వరూప వినాయకుడినీ ప్రక్కనే చిట్టెలుకని గీసేటప్పుడు కూడా కూడా అదే శ్రద్ధ, అదే నిశిత దృష్టి...!అన్నిటినీ hormonize చేస్తూ ఆయన గీసే గీతాల వంపు సొంపులూ, వాటి లయ విన్యాసం..దానిలోనే ప్రణవ స్వరూపమైన ఓంకారం.. అదో నవలోకం!!. నభూతో .. అనిపించే రీతిలో ఇన్ని అంశాలను తనలో ఇముడ్చుకున్న ఆ సంపన్నత (richness) వారి కళదే కానీ అది వేసేందుకు వాడిన ఉపకరణాలది కాదు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం..వారు చిత్తుకాగితం లాంటిదానిమీద కూడా కేవలం వాటర్ కలర్స్ / చార్కోల్ పెన్సిల్ వాడి అద్భుతాలు సృష్టించేవారని వారిని దగ్గరగా చూసిన ఇంకొక ఆర్టిస్ట్ శ్రీ చలపతిరావుగారు చెపుతారు.
రాజా రవివర్మ గారిది కేలండర్ ఆర్ట్ లో ఒక ప్రత్యేకమైన శైలి. అవి ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్స్. చాలా సహజంగా వుంటాయి. దేవతా మూర్తుల బొమ్మల proportions ..మనుషుల లాగే చాలా స్వాభావికం గా వుంటాయి. exaggeration వుండదు.. కానీ వపా గారిది శైలి, ఆ ఒరవడి అనితరసాధ్యం అనిపిస్తుంది. సబ్జెక్టు తో పాటు గా ఆయన సృష్టించే మాయాలోకం ముందు ఎంతటివారికైనా సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవు. మనవాళ్ళు ఇప్పుడు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసే గ్రాఫిక్ వర్క్ అంతా ఆయన కసింకోట లో కొన్న మామూలు కామెల్ వాటర్ కలర్స్ తోటే సృష్టించేసే అపర బ్రహ్మ. తేడా అల్లా ఏంటంటే రవివర్మ గారి పెయింటింగ్స్ వేలం పాటల్లో తిరుగుతూ.. ఖరీదైన భవంతుల్లో అలంకరణగా వినియోగమైతే మన వపా గారివి..సామాన్యుల గుండెల్లో పదిలంగా వున్నాయి. ఆ అట్ట మీద బొమ్మలోనే దేవుడిని చూడగలిగి ఫ్రేము కట్టించి పెట్టుకున్నవారెందరో వున్నారు. (మా ఇంట్లో వపా గారి పెయింటింగ్ రాములవారిది బ్లాకు అండ్ వైట్ లో వుండేది. అది మా నాన్నగారు వారి చిన్నప్పుడు 'యువ' లో పడితే కట్ చేసి ఫ్రేం కట్టించి పెట్టుకున్నారు. ఒకపక్క కలర్ , ఇంకోపక్క బ్లాకు అండ్ వైట్.. ఇంచుమించు మేము పదో క్లాసు చదివేతంట వరకు కూడా బయటకెళ్ళే టప్పుడు ఆ రాముడి ఫోటో కి దండం పెట్టవలసిందే..పరీక్షల టైం లో మరీను.. ఇల్లు కడుతున్నప్పుడు అనుకుంటా నానిపోయి చెదపట్టేసి పాడైపోయింది.)

ఎం చూసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అలాంటి అపురూప చిత్ర రాజాలను (ఒరిజినల్స్ అని నా భావన) 'కలిగి' ఉండడమనే అదృష్టానికి తోడూ సరైన రీతి లో భద్రపరచడం అనే బాధ్యత కూడా చందమామ యాజమాన్యం మీద వుంది. అలా చేసి వుంటారనే నమ్ముతున్నాను. అయితే వాటిని చందమామ ముఖచిత్రంగా మాత్రమే కాక మరింత విస్తృతంగా ప్రచారం కల్పించి మనలాంటి అభిమానులకి వారిగురించీ వారి చిత్రాలను గురించీ మరింత తెలుసుకొనే అవకాశాలను కల్పించగలిగితే బాగుంటుంది.
1 . వారి paintings అన్నిటినీ గుది గ్రుచ్చి ఒక catalog లాగా ప్రచురించాలి..
2 . వారు మొత్తం మీద వేసిన చిత్రాలెన్ని.. ?! వీలైతే chronological order and details జతపరచ గలిగితే మరీ మంచిది. క్లుప్తంగానైనా వారి జీవితం గురించి ఓ నాలుగు ముక్కలు..!!
3 . కళ పోషకులకు వాటిలోంచి catalog no చెప్పి ఆర్డర్ మీద తెప్పించుకోగలిగే సదుపాయం వుండాలి.
4 . అన్నిటినీ మించి వారి ఒరిజినల్ పెయింటింగ్స్ ని అపుడప్పుడైనా అభిమానుల సందర్శనార్ధం ప్రదర్శించాలి..శాశ్వత ప్రాతిపదికన ఒక మ్యుజియం పెడితే మంచిది.. (బొంబాయికి తరలిపోయి.. వున్న మంచి శీర్షికలే తీసేస్తున్న చందమామ యాజమాన్యం మన తెలుగు వాడైన వపా గారి మీద అంత శ్రద్ధ కనబరుస్తుందా... ? వారినుంచి ఇన్ని ఆశించడం అత్యాశ అవుతుందా... ??)
******
మన అభిమానుల అభిలాష ఇలా వుంటే వపా గారి మనస్తత్వం ఇంకోలా వుండేది...!! ఆయన తన సన్నిహితులకి వ్రాసిన ఉత్తరాలు.. ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి...!! ఆ విషయాలు ఇంకో టపాలో...
(పైన వ్రాసిన విషయాలు నేను చిన్నప్పటినుంచి చూస్తున్న వపా గారి బొమ్మల గురించి నాకు తోచిన విషయాలు మాత్రమే...ఏమైనా తప్పులుంటే విజ్ఞులెవరైనా సరి చేస్తే సంతోషం)
(వపా గారి ఫోటో చిత్రకళా పరిషత్ సౌజన్యంతో )
ఈ పోస్ట్ ఇంతకు ముందు ప్రచురించినదే కానీ చిత్రంగా నా బ్లాగ్ లోంచీ మాయమయ్యింది. అందుకని మళ్ళీ ప్రచురించాను.

2 comments:

  1. మంచి విషయం రాశారు. నిజమే, వారి చిత్రాలను చూసి ముగ్ధులు కాని వారెవరైనా ఉంటారా?

    ReplyDelete
  2. I really enjoyed your blog posts, thank you

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)