Sunday, October 24, 2010

చిన్నారుల 'సుందరకాండ' గానం

ప్రతీ ఏడాదిలాగే ఈసారి దసరాకి కూడా మా సంగీతజనకులం లో గురువుగారైన కులపతి శ్రీ ఇంద్రకంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారి ఆధ్వర్యం లో సరస్వతీ పూజ, ఏకాహ మహోత్సవం ఘనంగా జరిగాయి. వేదిక:విశాఖపట్నం లో అక్కయ్యపాలెం శ్రీ వసంత వనేశ్వర ప్రసన్న గణపతి ఆలయం.
(విజయ దశమి నాడు ప్రొద్దున ఆరు గంటలకు గురువుగారి శిష్యులందరి సామూహిక సరస్వతీ పూజతో మొదలయ్యే కార్యక్రమం మర్నాడు పొద్దున ఆరు గంటలకు మంత్రపుష్పం, మంగళహారతి తో ముగుస్తుంది. ఈమధ్యలో ఇరవైనాలుగు గంటల పాటు సంగీత కచేరీలతో చదువుల తల్లి సరస్వతికి నిర్విరామంగా స్వరార్చన జరుగుతుంది. దీనిలో సంగీత జనకులం శిష్యులతో పాటుగా బయటి కళాకారుల కచేరీలుకూడా జరుగుతాయి.)


ఈసారి ఆరుగురు చిన్నారులు సుమారు రెండున్నర గంటలకు పైగా పాడిన ఎమ్మెస్ రామారావు గారి 'సుందరకాండ' మొత్తం కార్యక్రమానికి వన్నె తెచ్చింది. అందరూ పది పన్నెండేళ్ళ లోపు వారే కావటం విశేషం. వారు పాడటం మొదలుపెట్టింది రాత్రి సుమారు తొమ్మిది గంటలకు. ప్రార్ధనా శ్లోకాలూ, గణేశ పంచరత్నం తో మొదలు పెట్టి ఏకబిగిన పదకొండున్నర వరకూ అదే ఉత్సాహం తో గానం చేసారు. కార్యక్రమం ముగిసిన తరువాత,పిల్లల్నీ వారిగురువు ఐన దుర్గారావుగారిని అభినందించడానికి వెళ్తే మాటల్లో వారికి 'సుందరకాండ' తో పాటు
విష్ణు సహస్ర నామ పారాయణ, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, తిరుప్పావై పాశురాలూ, అన్నమాచార్య కీర్తనలూ మొదలైనవి గత నాలుగేళ్ళు గా నేర్పిస్తున్నానని, ఇది వారికి 66 కార్యక్రమమని చెప్పారు.

పిల్లల పేర్లు వరుసగా :
తేజస్విని, శ్యామ కీర్తి, మహతి, శోభా ఖ్యాతి, సాకేత,వంశీ. కుడివైపు కనిపిస్తున్నది ఈ పిల్లలకి 'సుందరకాండ' నేర్పించిన శ్రీ దుర్గారావు గారు. ( వీరిలో మహతి శ్రీ దుర్గారావుగారి కుమార్తె )
వీరికి
సుందరకాండ పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్ళు పట్టిందట. వీరు కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలలా వున్న ప్రసిద్ధ సభలూ, ఆలయాలలో చేసారట..వాటిలో కొన్ని:
 • తిరుమల శ్రీనివాసుని సన్నిధి - ఆస్థాన మండపం లో వరుసగా వారం రోజులపాటు గానం చేసారు.
 • భద్రాచలం శ్రీ రామాలయం
 • అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం
 • సింహాచలం దేవస్థానం
 • పిఠాపురం శ్రీ దత్త పీఠము
 • భీమిలి లో ఆనందవనం : సద్గురు శ్రీ శివానంద మూర్తి స్వామి వారి ఆశ్రమం
 • ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
 • తణుకు లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కూడా గానం చేసారు.
అంతేకాక శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద గానం చేసి వారి మెప్పు పొంది ఆశీర్వచనానికి పాత్రులయ్యారు.
ఇవికాక విశాఖపట్నం లో స్థానికం గా వున్న వేంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రతి శనివారం సుప్రభాతం, విష్ణు సహస్ర నామ పారాయణ, చేస్తారు. ఇది ఒకటిన్నర సంవత్సరాలుగా..నిరాటంకంగా కొనసాగుతోంది..! అలాగే ప్రతీ పౌర్ణమికీ స్థానిక జగన్నాధ స్వామి ఆలయం లో ఇదే కార్య క్రమం సంవత్సర కాలం గా చేస్తున్నారు.. నిరాఘాటంగా...!!


ఇలాంటి వారిని ఒక వంద మందిని తయారుచేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్న శ్రీ దుర్గారావుగారు నిజంగా అభినందనీయులు. ఆ చిన్నారులు కూడా అంతటి శ్రద్ధాసక్తులు చూపి నేర్చుకుంటున్నారు. వారినీ, వారిని ఈ విధమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రుల్నీ కూడా ఎంతైనా అభినందించాలి. టీవీ లలో 'ఆటా-పాటా' లే కళా ప్రదర్శన.. ఆ కార్యక్రమాలద్వారా మాత్రమే పిల్లలలోని టాలెంట్ వెలికి వస్తోందనే భ్రమలో వున్న నేటి తరానికి శ్రీ దుర్గారావు గారూ, వారి బృందం ఒక కొత్త దిశా నిర్దేశం చేసి మన సంసృతి, సంప్రదాయాలకు వారసులు గా నిలుస్తున్నారనటం లో సందేహం లేదు..! ధన్యోస్మి!!
ఈ బృందానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటూ ఇదే స్ఫూర్తీ, శక్తీ , సద్గురు కృప.. లభించి మరింత ఉన్నతిని సాధించాలని మంగళ కారుడైన మారుతిని ప్రార్ధిద్దాం!!3 comments:

 1. svaami anugraham veeri pai paripurnamgaa umdi

  ReplyDelete
 2. బాగు బాగు. ఆన్లైన్ అప్లోడ్ చేయగలరా?

  ReplyDelete
 3. @దుర్గేశ్వర గారూ..ధన్యవాదాలు.
  @అజ్ఞాత గారూ..అప్లోడ్ కి ట్రై చేసాను కానీ error వస్తోంది. ఆడియో అయినా అందరితో పంచుకోటానికి ప్రయత్నిస్తాను.
  వ్యాఖ్యలు చేయటానికి సాధ్యమైనంత వరకు ఏదో ఒక id వాడమని మనవి.

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)