Friday, October 29, 2010

వపా ఉత్తరాలు - వారి అంతరంగం...బాపు గారు, వపా గారు ఇద్దరూ శ్రీ న్యాయపతి కామేశ్వరరావు గారి 'బాల' లో బొమ్మలు వేస్తున్నప్పటినుంచి చూస్తే బాలవటువుగా వున్న ఇద్దరూ త్రివిక్రమావతారులుగా పరిణతి చెందడం స్పష్టంగా కనిపిస్తుంది..! ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని నిర్మించుకొని విస్తరించి.. శిఖరాగ్రాన నిలచిన వారే. బాపుగారు తన ప్రతిభను వివిధరంగాలకు (కార్టూన్లు, సినిమాలూ, టి వి సీరియల్స్, లాంటివి.. ) విస్తరించి..తన అభిమానులనూ, కళారాధకులనూ ఇంకా మురిపిస్తూనే వున్నారు. కానీ స్వతహాగా అంతర్ముఖులూ..ప్రదర్శనలు బొత్తిగా ఇష్టపడని వ్యక్తీ ఐన వపా గారు.. తనచుట్టూ తానే గిరిగీసుకొని..అదే లోకం లో ఉండిపోయారనిపిస్తుంది. వారు తన సన్నిహితులైన కొందరికి వ్రాసిన ఉత్తరాలు వారి అంతరంగానికి అద్దం పడతాయి.వారి బొమ్మలను చూసి వారి వ్యక్తిత్వాన్ని ఊహించడానికి ప్రయత్నించే వారికి వారి తాత్వికత, లోతైన భావజాలం ఆశ్చర్యాన్ని కలిగించక మానవు.
******
"కశింకోట, 23 -12 -1980
....'ఎందుకు?' అన్నది నాకు మూలమంత్రం.! ఆ గీత, ఆ వంపు, ఆ అస్పష్టత ఎందుకు అన్న ఆలోచనే చిత్ర రచనకు ఎంత దోహదమో..అదే 'ఎందుకు' నాకు చాలా ఉపయోగకరంగా ఇంతవరకూ ఉంది..!!
ఇక - చిత్రాలు ప్రదర్శింపజేయటమూ , ముఖ్య అతిధి ఆహ్వానానికి నేను పూర్తిగా విముఖుడినని వెంటనే తెలియ జేయడం చాలా అవసరమైనదిగా ఎంచుతూ ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీరు వస్తే పరిషత్ ప్రతినిధి గా కాక కేవలం స్నేహితునిగా రాగోర్తాను.' ......'చందమామకూ యువ కూ తప్ప ఏ బొమ్మ ఇతరులకు వెయ్యను.'..... ..'మొన్న మీరు వచ్చినప్పుడు బిరుదుల గురించీ, సన్మానాల గురించి వింటున్నప్పుడు నాకు నవ్వు వచ్చిందే తప్ప మరేమీ రాలేదు. ఇలాటి అన్నిటికీ అతీతంగా ఉండాలనే చిరకాలం క్రిందటే ఒక మార్గాన్ని ఎన్నుకొన్నవాడిని....మీరేదో పేపర్ పబ్లికేషన్ కోసం రాసి,పరిచయ వ్యాసం పంపాలన్నారు. పంపక పొతే సరే, ఒకప్పుడు పంపితే ఈ క్రింది వాక్యాలు చేర్చండి. ' యితడు మొండి వాడు.. గర్విష్టి..?? కూపస్థ మండూకం అన్నా అనవచ్చు . బయటి సంఘాన్ని చూడదు. చూడమని కోరాడు. ఇలాంటి తలబిరుసు తనకు మేలో కీడో అన్న విచక్షణా జ్ఞానం ఉన్నట్టు కూడా తోచదు. ఇలాంటి బిరుసుకి తన ఆత్మ విశ్వాసం ఇరుసు అంటాడు. అది ఎంత నిజమో అది అప్రస్తుతం."
********
"కశింకోట, 23 -12 -1980
'మనతరం అనుభూతిని మన తరువాత తరం వారికి చెప్పబూనే ప్రయత్నమే' కళ...! - ఎవరిదీ?? ఎక్కడిదీ బాబూ ఈ స్లోగన్..??!!
నలుగురు గుడ్డి వాళ్ళూ, ఏనుగూ ..కథ ఇది. నా మట్టుకు అనుభవం లో - తాత్కాలికంగానైనా మానసిక అశాంతిని తెమ్మనేర్ప గలిగేది మాత్రమే అది ఎలాంటిదైనా..బూతు అయినా అదే అర్ధమున్న కళ . ఈ మానసిక అశాంతికి కాలమూ స్థాయీ మారుతూ ఉంటాయి. జగత్తు స్వభావం పరిణామం. నిన్నటి కళ ఈ రోజు కళ అనిపించుకోదు. అనుకుంటే అది కుంటి నడక.' ...
.......అంచేత కళా నిర్వచనాల కంటే నిర్వాక్కుగా కళ అనిపించినదాన్ని ఆస్వాదించగల్గడమే తపస్సు..మునులంటే వాళ్ళే...!'......
చిత్రకళా తపస్వి అని మరో అభాండం వేశారు. ఏదీ కాను, 'కోటివిద్యలు కూటికే'' తపస్విని .. అంతే...!! ....
......ఆంధ్ర దేశం లో పుట్టడం వల్ల నాకు అంతగా మేలు జరగలేదన్నారు...ఇదే మనసులో వుండే అజ్ఞానం ఒకడి గురించి అతడికి జరిగిన కీడు మేళ్లను కొలబద్దలుగా అంచనా వేస్తారు. నేనెప్పుడూ ఇప్పుడూ అలాగ అనుకోలేదు. మనకు కావలసిన మేలు మన చేతిలోనే ఉంది. దేముడు కూడా మేలు చేయక్కర్లేదని నమ్మే వాడిని నేను. దేముడిని ప్రార్ధిస్తే - ఒరే దేముడూ నువ్వు ఎలాంటి మేలూ చెయ్యకు. అదే నువ్వు చెయ్య వలసిన కార్యం - అని.
......"
**********
"కశింకోట, 8-9 -1981
................
'ఎందుకూ పనికిరానివాళ్ళు విమర్శకూ వ్యాఖ్యానాలకూ దిగుతారనేది తరతరాల సంస్కృత కావ్యాల నాటి నుంచీ వస్తున్న మనదేశపు సంస్కృతి, కాళిదాసు లాగ వ్రాసే వాళ్ళు లేరు గానీ వ్యాఖ్యాతలు కోకోల్లలున్నారు.' ...... ' ఇది కమర్షియల్ , ఇది క్రేఅతివే అని చిలక పలుకులు పలికే వాళ్ళు నిజానికి ఏమీ తెలియని భూతాలు. ' బ్రహ్మజెముడు మొక్కలోనూ, శతపత్ర కుసుమంలోనూ ఒకే సౌందర్యం కనిపించినప్పుడే అది నిజమైన విమర్శ అవుతుంది.. కళ లో తేడాలూ, జాతులూ, శైలీ ఎంచడం అంత సంకుచితత్వం మరేదీ లేదు..! ఎందులో ఏముందో తెలుసుకున్న సొంత అనుభవం తర్వాతే - ప్రకర్ష.' .........."
***********
"కశింకోట, 21-6 -1982
.............
ఆధునిక లేదా నవీన చిత్ర కళ అంతే ఇది అని లేదు. ఈ రోజు నవీన రేపటికి పాతదైపోతుండగా, ఒకవంక కంపూటర్ల చేత డ్రాయింగులు చేయిస్తూ ఉంటే.. మరో ప్రక్క కలర్ ఫోటోగ్రఫి ట్రిక్కులతో అన్నీ సాధిస్తున్నై. కొంతమంది విజ్ఞులనిపించుకుందామని ఆధునిక చిత్రకళా అవగాహన చేసుకోలేకపోయినా తెగనాడడమో , పొగడ్డమో చేస్తున్నారు. ఈ రకం విదూషకులు, జోకర్ల కంటే.. ఏమాత్రం సారం వున్నా గ్రహించ గలిగే మూగ ప్రేక్షకుడు ఒక్కడుంటే చాలుకదా..??....
నా మట్టుకు చెప్పాలంటే - మనుగడ కోసం సాంప్రదాయకంగానే బొమ్మలు వేస్తున్నాను. ( ఈ దేశం లో ఆధునిక చిత్రకళకు పైసా సంపాదించే యోగం లేదుకాబట్టీ) అత్యంత ఆధునిక చిత్ర కళ పట్ల పరిపూర్ణమైన అభిమానమూ, ఆసక్తి గల వాడిని..! నమ్మండి మానండి...!! "
*****************
వపా గారు చిత్రకళ పట్ల వారికి వున్న అభిప్రాయాలను..నిర్మొహమాటం గా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు ఆ ఉత్తరాలలో..!!
ఒక చోట ఇలా వ్రాసారు: "ఈ రోజులు గడపటానికి ఇబ్బంది లేని ఆర్ధిక స్థోమత నిలవాలు వుంటే, నేను చిత్ర రచన జీవనోపాధిగా పెట్టుకోకుండా ఒకటో రకం ఆధునిక చిత్రకారుడిగా ఉండేవాడిని."
*****************
"కశింకోట, 21-6 -1982
.............
నేను ఇప్పటివరకు అవలంబించిన మార్గాన్నే ఉండాలని తలచి మీకు మీ షిప్ యార్డు వాళ్ళ ఎగ్జిబిషన్ కి బొమ్మలు ఇవ్వనని, ఇక ఆ ప్రశస్తి వద్దని వ్రాశాను. నేను ఒకటి సంకల్పించాను... అది నెరవేరాలి...ఇక్కడే మంచివన్నీ తీసి అన్నిటికీ అద్దాలూ, ఫ్రేములూ వేసి, రెండు చిన్న గదుల్లో గాలరీ లాగ తగిలించి ఉంచాలని..అది నెరవేరితే ఇదొక్క ప్రదర్శనా ఎల్లప్పుడూ ఉండాలనీ. ఇది నాకు నాగులచవితి నాడు కలిగింది. ఎవరు చూడాలని ఇంట్రెస్టు ఉన్నా చూడగలరు.
***********
'చందమామ'కీ , 'యువ' కీ తప్ప బొమ్మలు గీయను..ప్రదర్శనలకు దూరం అన్న వారి సిద్ధాంతం అభిమానులకి వారిని అందుబాటులో లేకుండా చేసింది. అందువల్లేనేమో..బాపు బొమ్మలు, వివరాలూ దొరికినంత సులువుగా వపా గారివి దొరకటం లేదు..వారు ఎక్కువగా బొమ్మలు గీసిన చందమామ ముఖ చిత్రం గా తప్ప మరెక్కడా వారి బొమ్మ కనిపించదు. కానీ వారే ఒక గ్యాలెరీ ఏర్పాటు చేద్దామని తలచినా అది ఎందుకో సఫలం అయినట్టు లేదు. చందమామ ఇంకో మూల స్తంభం ఐన దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక సంచికను 'రచన' వారు పూనుకొని తయారు చేసినట్టు మన వడ్డాది పాపయ్యగారిది కూడా ఎవరైనా ఒక సంచిక విడుదలైతే ఎంత బాగుంటుందో కదా!! అదే సంకల్పం తో వపా గారి వీరాభిమానీ, వారికి ఆప్త మిత్రుడూ, వారు కశింకోటలో వున్న పన్నెండేళ్ళ పాటూ వారిని ఎంతో దగ్గరగా గమనించి, వారి స్వహస్తాలతో ఉత్తరాలూ, గ్రీటింగ్ కార్డులూ, అందుకున్న అదృష్టవంతులు..మా విశాఖపట్నానికే చెందిన ప్రముఖ చిత్రకారులు శ్రీ సుంకర చలపతి రావుగారు( చిత్ర కళా పరిషత్), వపా గారిమీద 'The waking dreamer in colours' పేరిట ఒకటీ, 'లేఖలు' పేరిట ఇంకొకటీ పుస్తకాలు రిలీజ్ చేసారు అంతే కాక వపా గారి చిత్రాలు వారికి సాధ్యమైనన్ని సేకరించి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేసి విశాఖ వాసులకి కన్నుల పండుగ చేసారు. అలాగే ఆ బొమ్మలన్నిటినీ వాటిని స్కాన్ చేసి ఒక CD గా కూడా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వారు చేస్తున్న కృషికి వారిని వపా గారి అభిమానులంతా మనస్పూర్తి గా అభినందించాలి.
( పైన 'వాలు' గా వ్రాసిన పంక్తులు వపా గారి ఉత్తరాలలోనివి...శ్రీ సుంకర చలపతి రావు గారి సౌజన్యం తో)
వపా గారి మరిన్ని చిత్రాలు ఇక్కడ చూడండి. మరియు వికీ పెడియా లో..

5 comments:

 1. చాల మంచి పొస్టండి.

  ReplyDelete
 2. శొభాయమామైన వపా గారి వర్ణ చిత్రాలను మరియు చక్కటి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
  వపా గారిమీద రిలీజ్ చేసిన 'The waking dreamer in colours' పుస్తకం ఏక్కడ దొరుకుంతుందో తెలుపగలరా?.

  ReplyDelete
 3. పుస్తకాలు సీడీ ఎలా లభ్యమవుతాయో కూడ చెప్పి పుణ్యం కట్టుకోండి.

  ReplyDelete
 4. 'The waking dreamer in colours':
  వెలకట్టలేని ఆ పుస్తకం ధర రూ.100/-, 'లేఖలు' పుస్తకం వెల రూ.10/- మాత్రమే.
  ప్రతులకై :
  Smt Sunkara Jhansi Lakshmi,
  Flat no: 201, R.R.Enclave,
  Near Zinc Gate,Gajuvaka Post,
  Visakhapatnam -26

  శ్రీ చలపతి రావు గారు CD ని ఈ డిసెంబర్ లోనే విశాఖపట్నం లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు...!!

  ReplyDelete
 5. అనూరాధ సతీష్Sunday, March 06, 2011 6:06:00 PM

  రాదేశ్యాం గారూ.. డిసెంబర్ అయ్యిపోయింది కదా.. మరి CD వచ్చీసిందా?

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)