చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
Tuesday, December 4, 2012
అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి..!!
ఆ రోజు రాత్రి ఏంజరిగిందంటే - భోపాల్ ఉదంతానికి 28 ఏళ్ళు..!
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబరు రెండవ తేదీ అర్ధరాత్రి భోపాల్ నగరం నిద్రలో ఉన్న సమయం లో మృత్యువు నిశ్శబ్దంగా అక్కడి పౌరులను శాశ్వత నిద్రలోకి జారేలా చేసింది. కర్మాగారాన్నినెలకొల్పడమే తప్ప విపత్తు నివారణ, ప్రజల భద్రత లాంటి విషయాలను లను గాలికొదిలేసిన యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం, ప్రజలను ఎన్నికలలో పనికివచ్చే వనరులుగానే తప్ప మనుష్యులుగా చూడని, మానవత్వం మర్చిపోయిన ఆనాటి అర్జున్ సింగ్ సర్కారూ క్షమించరాని పాపానికి ఒడిగట్టారు. (అంతటి ఆపత్సమయంలో "పరిస్థితి" గురించి వాకబు చేసిన ఆ ముఖ్య మంత్రి, ప్రమాద స్థలంలో ఉన్న 'నగర పోలీస్ కమీషనర్’ ద్వారా ప్రజలు తలోదిక్కుకీ పారిపోతున్నారని తెలుసుకొని, ఆయనతో "నీకు మతిపోయిందా..!! వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు పారిపోతే మనకి ఓట్లు వెయ్యడానికి ఎవడు మిగుల్తాడు..?? వాళ్ళందరినీ ఇళ్ళల్లో తలుపులేసుకొని కూర్చోమను. కొంపలేం మునగట్లేదని చెప్పు..! వాళ్ళని ఇల్లుదాటి కదలనివ్వకు..!!" అని ఆజ్ఞాపించరట..!!)
అర్జున్ సింగ్, నాటి ముఖ్యమంత్రి |
వారెన్ ఆండర్సన్ |
ఆ ఘోరం జరిగిన రాత్రి మొదలుకొని కేసును నీరుగార్చడానికీ, మనచట్టంలోని లొసుగులని తెలియజెప్పి జరిగిన ఘోరానికి బాధ్యులైన వారిని దేశం దాటించడానికి, ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యధాశక్తి సహకరించాయి. ఆఖరికి నష్టపరిహారానికి కూడా ఆ ఫారిన్ కంపెనీ ముందు సాగిలపడి, ముందు అడిగిన దానికి కాకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో నామమాత్రపు సొమ్ముకి ఒప్పేసుకొని, బాధితులను దారుణంగా మోసపుచ్చి, వారికి మొండిచెయ్యి చూపాయి.
యూనియన్ కార్బైడ్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా పలురంగాలలో వ్యాపారాలు ఉండేవి. భోపాల్ లో వారి కంపెనీలో తయారవుతున్న"సెవిన్" అనే పురుగుమందుకి, ఎరువులకీ
కావలసిన 'మిథైల్ ఐసో సైనేట్' (MIC) అనే విషవాయువును మన దేశం లోని బొంబాయి రేవుకి
దిగుమతి చేసి, అక్కడి నుంచీ రోడ్డు మార్గం ద్వారా భోపాల్ దాకా తీసుకు వచ్చి ఇక్కడ నిల్వ చేసేవారు. ఇక్కడి డిమాండ్ కి తగ్గట్లు పురుగుమందులు తయారు చేసినన్నాళ్ళూ అవసరానికి కావలసిన పరిమాణంలో మాత్రమే నిల్వచేసేవారు. ఎప్పుడైతే కంపెనీ తమ వ్యాపారాభివృద్ధి పేరుతో ఉత్పత్తిని పెంచాలని నిర్నయించుకొన్నారో అప్పటినుంచీ ప్రమాణాల విశయంలో కంపెనీ పతనం ప్రారంభమైంది.
మొదట్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో నెలకొల్పి, నిర్వహణలో శ్రధ్ధ పెట్టిన (ఆ క్రెడిట్ పూర్తిగా అప్పటి సాంకేతిక నిపుణులదే తప్ప యాజమాన్యానిది కాదు) యూనియన్ కార్బైడ్ కంపెనీ, యాజమాన్యం రానురాను బయటిదేశాల మార్కెట్ నీ, టర్నోవర్ నీ మనదేశపు సేల్స్ తో పోల్చి టార్గెట్ లని అందుకోలేక పోతున్నారనే నెపంతో (నిజానికి మన దేశం లో అప్పటికి వేపపిండి తప్ప రసాయనిక పురుగుమందులు అంత మార్కెట్ లేదు..!), మేనేజ్ మెంట్ మార్చేశారు. కంపెనీ నెలకొల్పడానికి అహోరాత్రాలూ కష్టపడి పనిచేసిన నిబద్ధత కలిగిన సాంకేతిక నిపుణులని విధుల నుంచీ తప్పించి, ఇలాంటి విషవాయువులతో బొత్తిగా పరిచయం లేని, బ్యాటెరీ రంగం మార్కెటింగ్ లో మంచి ఫలితాలు సాధించిన వారిని తీసుకొచ్చి ఇక్కడి వ్యాపార నిర్వహణ వారి చేతుల్లో పెట్టారు.
వీరికి కెమికల్స్, అందునా 'మిథైల్ ఐసో సైనేట్' లాంటి ప్రాణాంతక విషవాయువును హ్యాండిల్ చెయ్యడంలో ఉన్న ప్రమాదం గురించి అస్సలు తెలియదు. ఎప్పుడైతే డిమాండ్ ని మించి ఉత్పాదన పెరిగి, తయారైన సరుకు నిల్వ ఉండిపోసాగిందో, సహజమైన మార్కెటింగ్ సూత్రాన్ని పాటించి వారు ఉత్పత్తిని ఆపేశారు. దానితో 'మిథైల్ ఐసో సైనేడ్' వివియోగం ఆగిపోయింది. కంపెనీ వాళ్ళు వారి నష్టాన్ని కేవలం రూపాయలలోనే చూశారుగానీ, MIC నిల్వ చేయడంలో లోపం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల జరిగే నష్టం తరతరాల పాటూ మాయని మచ్చగా మిగులుతుందని ఊహించలేదు. MIC టాంకులలోకి చేరే ఎలాంటి మలినమైనా, చివరకు నీళ్ళు అయినా ఎమ్ ఐ సీ తో కలిసినప్పుడు జరిగే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ వల్ల జరిగే ప్రమాదానికి ప్రాణాంతకం, భయంకరం లాంటి మాటలు చాలా చిన్నవి. తీరా ప్రమాదం జరిగిపోయిందని అర్ధమయ్యాక నిస్సహాయంగా చచ్చిపోవటమో, ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోవడమో తప్ప, కనీసం తక్షణ నష్టనివారణకు చేపట్టవలసిన చర్యల గురించి కూడా అవగాహన లేని దిక్కు తోచని స్థితిలోకి కంపెనీ జారిపోయింది. ఆ నాటి రాత్రి ఆ టాంకులలోకి నీరు చేరి ఏర్పడిన రసాయనిక చర్య మూలంగా విడుదలైన వాయువుల సాంద్రత ఎక్కువ అవటం చేత నేలకి దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో కదిలే మేఘం లాగా అవి ప్రయాణించి, తమ మార్గంలోకి వచ్చిన ప్రతి ప్రాణినీ అత్యంత కిరాతకంగా హతమార్చాయి.
ఆ నాటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికీ మౌన సాక్షి.. యూనియన్ కార్బైడ్ ఇండియా , ప్రమాదం తరువాత..! |
ఇక్కడ తయారవుతున్న MIC ప్రపంచం లోనే అత్యంతప్రమాదకరమైన విషవాయువనీ, ప్రమాదం జరిగితే తీసుకోవలసిన చర్యల గురించి గానీ, బాధితులకు అందించ వలసిన వైద్యం గురించి కానీ, అక్కడి యంత్రాంగానికి ఎలాంటి సమాచారమూ లేదు. పైగా అది కంపెనీ పెట్టిన ఆరేళ్ళ వరకూ అంటే దాని ఉత్పత్తి భోపాల్ లోనే మొదలయ్యేవరకూ దానిని రోడ్డు మార్గం ద్వారా రెండు రాష్ట్రాలు దాటించి రహస్యంగా ఎలాంటి భద్రతలూ లేకుండా తెచ్చేవారనే విషయం బయటకు పొక్కనీయ లేదు. వారన్ ఆండర్సన్ లాంటి విదేశీ కంపెనీ యజమానుల దురాశా, సాంకేతికత తెలియని మేనేజర్ల పొదుపు చర్యలూ,
ఫ్యాక్టరీ నెలకొల్పటానికి అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోనూ, దరిమిలా
జరిపిన కాలుష్య పరీక్షల ఫలితాలనూ తొక్కిపెట్టిన రహస్యాలూ, మానవ తప్పిదాలూ, నిర్లక్ష్యం, కొన్నితరాలకు చెందిన భోపాల్ నగర వాసుల జీవితాలలో ఒక భయంకరమైన పీడకలను మిగిల్చాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, అంత భయంకరమైన అనుభవం చవి చూసి కూడా దాని నుంచీ పాఠాలు నేర్చుకోక పోవడం..!
డొమినిక్ లాపెయిర్, జేవియర్ మొరో ఫ్రెంచ్ లోనూ ఆంగ్లం (It was Five Past Midnight in Bhopal) లోనూ వ్రాసిన ఈ పుస్తకానికి ’కస్తూరి’ గారి స్వేచ్చానువాదం ఆనాటి భోపాల్ ఉదంతాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ఆనాటి రాత్రి జరిగిన సంఘటనకు పూర్వాపరాలు ఈ పుస్తకంలో చాలా విపులంగా సవివరంగా చర్చించబడ్డాయి. కేవలం ప్రమాదాన్నే కాక అక్కడ నివసించిన, ఎన్నో ఆశలతో ఆ ఫ్యాక్టరీ లో పనిచేయడానికి దూరప్రాంతాలనుంచీ వలస వచ్చిన వ్యక్తుల జీవితాల చిత్రణ, వారి ఎన్నో కలలు కన్న వారి జీవితాలకు ఆనాటి రాత్రి వ్రాసిన మరణ శాసనం, చదివిన ప్రతి పాఠకుడి హృదయాన్నీ కదిలిస్తుందనటంలో సందేహం లేదు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమ్మర్చక మానవు.
ఈ క్రింది లింక్ లో ఆ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆనాటి బాధిత కుటుంబాలకు ఇదేనా అశ్రు నివాళి. ఈ పుస్తకాన్ని నేను చదివి మూడు నాలుగేళ్ళ పైనే అయింది. గుర్తున్నమేర వివరాలు మీ ముందుంచాను. ఏవైనా తప్పులుంటే మన్నించ గలరు.
మరిన్ని ఫోటోలు ఈ క్రింది లింక్ లో : యాహు .కామ్ సౌజన్యంతో
http://in.news.yahoo.com/photos/bhopal-tragedy-aftermath-slideshow/bhopal-tragedy-aftermath-photo-1350977517.html
Saturday, November 24, 2012
రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం
రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిగారు స్వర రచన: ఘంటసాలగారు
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిగారు స్వర రచన: ఘంటసాలగారు
కీ. శే. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు |
కీ. శే. శ్రీ ఘంటసాల గారు |
ఈ పాటను గురించి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో శ్రీమతి సుధ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఈ లింక్ కి వెళ్లి చదవండి(http://illalimuchatlu. blogspot.in/2012/02/blog-post_ 20.html). ప్రతిపదార్ధ వివరణతో పద ప్రయోగం లోని విశేషాలను వివరిస్తూ అద్భుతంగా వ్రాశారు. పాట ఆడియోలింక్ కూడా ఉంచారు.
వారి బ్లాగులో వీడియో కనిపించడం లేదు. అది ఇక్కడ చూడవచ్చు.
నేను కేవలం సుధ గారు వ్రాసిన వ్యాసం లోని యక్షగాన సాహిత్యాన్ని విడిగా ఒకదగ్గర పెట్టాను అంతే...!!
****************************************
ఈ పాట ఆడియో లింక్:
****************************************
అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు
ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా!
బహుపరాక్ బహుపరాక్...
చండభుజాయమండల దోధూయమాన వైరిగణా – షడాననా!
బహుపరాక్ బహుపరాక్..
మంగళాద్రి నారసింహ, బంగరుతల్లి కనకదుర్గ,
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే
ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ
కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ, ఆ కోపీ-
తాపముతీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము – || అవధరించరయ్యా ||
రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి
రాజ సులోచన రాజాననా...
చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే
మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే
వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే
కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే
తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ తగదిదీ ..
అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది
కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా
ఈశుని దాసుని చేతువా -అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!
సేవలు చేసి ప్రసన్నుని చేయ - నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...
కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.
చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....
సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా
ఇవె కైమోడ్పులు - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి - ఈశా మహేశా || సామగ సాగమ ||
విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ
కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....
అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...
మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ!!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ!!
బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం
కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం||
Friday, November 23, 2012
విశాఖపట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..
విశాఖ పట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..
శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28 బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును.
పై కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..!!
శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28 బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును.
మరిన్ని వివరాలకోసం ఫోటో పై క్లిక్ చేసి పెద్దది గా చూడండి. |
Wednesday, November 21, 2012
భరత మాత ముద్దు బిడ్డలు.. !!
26 నవంబరు 2008 నాటి రాత్రి ముంబాయి నగరానికి కాళరాత్రి. ఆనాటి ముష్కర మూకల దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మలకు నేడు శాంతి చేకూరింది. ప్రాణాలతో పట్టుబడ్డ ఒకేఒక్క తీవ్రవాది కసబ్ ను మన న్యాయస్థానాలు చట్టప్రకారం విచారించి విధించిన ఉరిశిక్షను ఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత అమలు చేసి వారి బలిదానానికి ఈ రోజు భారత ప్రభుత్వం బదులివ్వగలిగింది. అతడు అప్పీలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే మరిక ఎలాంటి సాగతీతకూ తావివ్వకుండా, రెండో కంటివాడికి కూడా తెలియకుండా శిక్షను అమలుపరచి ఆనాటి అమరవీరుల కుటుంబాలకు స్వాంతన చేకూర్చగలిగింది.
రాజకీయ నాయకుల కొట్లాటలూ, ఈ ఉదంతం నుండి లబ్ధి పొందడానికీ, తద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించడాలూ, మీడియా రాద్ధాంతాలూ, మన మేధావుల వ్యాఖ్యానాలూ ఇక రాబోయే రోజుల్లో తప్పక చూడబోతాం. కానీ నిజానికి తమకున్న ఆధారాన్నీ, పెద్దదిక్కునీ కోల్పోయిన ఆకుటుంబాలు తమ జీవితంలో అస్సలు ఊహించని అతిపెద్ద కుదుపుకి లోనయ్యాయి. వారికి మన రాజకీయ నాయకుల మెరమెచ్చు మాటలు స్వాంతనని కలిగించలేవు. వారికి కలిగిన నష్టం పూడ్చలేనిది.
ఆనాటి రాత్రి దేశం మీద కేవలం పదిమంది సీమాంతర ఉగ్రవాదులు జరిపిన యుద్ధంలో మరణించిన ఒక్కొక్క వీరుడిదీ ఒక్కొక్క వీరగాధ. ఒక్కొక్కరి నేపధ్యాలూ, స్థితిగతులూ, హోదాలూ వేరు..!! కానీ అన్ని కథలలోనూ వినిపించిన అంతర్వాణి దేశభక్తి తప్ప మరొకటి కాదు. ఆ విపత్కర సమయంలో ఏ ఒక్కరూ మడమ త్రిప్పలేదు. తమ దేశ ప్రజల కోసం పోరాడారు. ఆ క్షణంలో వారి మదిలో దేశరక్షణ, విధి నిర్వహణ, ముంబైకార్ల భద్రత తప్ప మరొక విషయం ఆలోచించి ఉండరేమో..! ప్రమాదానికి రొమ్ము ఒడ్డి తన బలగాన్ని లీడ్ చేసి 'ముందుండి నడిపించడం' అంటే ఏమిటో చూపించారు ఈ ఉన్నతాధికారులు..! తమ కుటుంబానికి తామే ఆధారమైనా, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించారు ఈ చిరుద్యోగులు. ప్రమాదం ఎటునుంచి పంజా విసురుతుందో తెలియని నిశిరాత్రిలో మనకెందుకని పారిపోకుండా, గాయపడ్డ తోటివారికి సహాయమందించారు మరికొందరు సామాన్యులు. ఆ నాయకత్వ లక్షణాలు, తెగింపు మరువలేనిది. ఇలాంటి వారు మన జాతికి గర్వకారణం..! మన యువతకు స్ఫూర్తి కలగాల్సింది ఈ యోధుల పోరాట పటిమ నుంచి...! మన నిజమైన దేశనాయకులు వీరే..!! మాతృభూమి ఋణం తీర్చుకున్న వీరే భరత మాతకు నిజమైన ముద్దు బిడ్డలు...!!
కీ. శే. హేమంత్ కర్కరే
కీ. శే. అశోక్ కాంప్టే
కీ. శే. విజయ్ సాలస్కర్ |
కీ. శే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ - ఆ కళ్ళలో కొట్టొచ్చిన ఆత్మవిశ్వాసం చూడండి..!! |
కీ. శే. తుకారాం ఓంబ్లే - తన శరీరాన్ని బుల్లెట్లు జల్లెడ చేస్తున్నా లక్ష్యపెట్టక అజ్మల్ కసాబ్ ను సజీవంగా పట్టుకొని ప్రాణాలు విడిచిన ధీశాలి.
ఇంకెందరో అమరవీరులు ..!! |
మానవత్వం మీద జరిగిన దాడిలో
విధినిర్వహణలో దేశం కోసం ప్రాణాలొడ్డిన ఈ వీరపుత్రులకు
శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.
జై హింద్..!! జై హింద్..!! జై హింద్..!!
********
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనా ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్..!
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతములన్నీ మెలగవలె నోయి !
***************
Tuesday, November 13, 2012
వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు..!
బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను.
మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!
పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి
(మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)
నరకాసురుడిని సంహరిస్తున్న సత్యభామ.
ఇవి మూడూ 'యువ' మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు వేసిన బొమ్మలు
Sunday, November 4, 2012
శకునాలూ..! సెంటిమెంట్లూ..!!
సెంటిమెంట్ , శకునం అంటే ఏమిటి..?
రెండూ మనిషియొక్క నమ్మకం మీద ఆధార పడేవే..! అలాగే రెండిటి పర్యవసానం ఒకటే గానీ కొంచం తేడా ఉంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 'శకునం' చూసుకొని వెళ్ళమంటారు. ముత్తైదువ ఎదురొస్తే మంచిది.., దంపతులు ఎదురొస్తే మంచిది.., పిల్లి ఎదురొస్తే మంచిది కాదు.., పనిమీద వెళ్తున్నప్పుడు తుమ్మితే లేదా ఎక్కడకి అని అడిగితే పని జరగదు.., ఇలా శకునాల గురించి పంచాంగాల్లో చూస్తే చాలానే రాసి వుంటుంది.! [దీనిలో కొన్ని శకునాలకి స్త్రీ పురుషుల తేడాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి అబ్బాయిలకి కుడికన్నులేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. ( ఘంటసాల పాత పాట ఒకటి గుర్తుతెచ్చుకోండి.. అన్నీ మంచి శకునములే.. కన్యా లాభ సూచనలే..). అదే కుడికన్నుఆడవాళ్ళకి అదిరితే మంచిది కాదంటారు.]
ఇది లాజిక్ కి అందనిది, సైన్సు నిరూపించలేనిది. సమాజంలో వివిధరంగాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలూ, క్రీడలూ, సినీమా, వ్యాపారం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. విద్యార్ధులూ, ఇంటర్వ్యూ లకు వెళ్ళే వారికి కూడా ఈ బాధ తప్పదు. మొదటి రకానికి చెందిన వారిలో ఆ సెంటిమెంటు జీవితాంతం ఉంటే రెండో వర్గానికి ఇది సందర్భానుసారం మారుతూ ఉండవచ్చు. చూసేవాడికి చాలా సిల్లీ గానూ మూర్ఖం గానూ అనిపించే విషయాలు ఆ సెంటిమెంట్ ఉన్నవాడికి డూ ఆర్ డై లాగా ఉంటుంది...!!
నామట్టుకు నాకు చిన్నప్పుడు కొన్ని సెంటిమెంట్లు ఉండేవి. పరీక్షలలో మొదటి పరీక్షకి వెళ్ళినప్పుడు ఏ చొక్కా వేసుకొని వెళ్ళానో అదే చొక్కా అన్ని పరీక్షలకీనూ..!! (మధ్యలో ఏదైనా పరీక్ష చెడగొట్టాననుకోండి...! వెంటనే అదే సెంటీ ఇంకో చొక్కా మీదకి మారిపోయేది.) అలాగే పరీక్షలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ త్రోవలో చదువుకుంటూ వెళ్ళేవాడిని కాదు. పదోక్లాసులో లెక్కల పరీక్షకి (మొదటి యూనిట్ టెస్ట్) పరీక్షకి బయల్దేరి స్కూల్ కి వెళ్ళేదాకా రోడ్డుమీద చదువుకుంటూ వెళ్లాను. ఆరోజు పరీక్షలో ఒక్క లెక్కకి కూడా ఆన్సర్ రాయలేక పోయాను. ఖాళీ పేపర్ ఇచ్చేయ్యడంతో సున్నా వచ్చింది. అప్పటి నుంచి సెంటిమెంట్ పట్టుకుంది. తరువాత చచ్చినా త్రోవలో చదివేవాడిని కాదు. తరువాత ఫైనల్ పరీక్షల్లో 98 వచ్చాయనుకోండి.. ! అదివేరే విషయం..!!
క్రికెటర్స్ లో కొందరికి ఒక స్టేడియం అచ్చొచ్చిందైతే మరికొందరికి ఇంకోటి. ఈ సెంటిమెంట్లని ఎస్టాబ్లిష్ చెయ్యడం లో పత్రికల వాళ్ళు ముందుంటారు. ఏదో
రకంగా బోడిగుండుకీ మోకాలికీ ముడి వేసి కొన్నాళ్ళకి అదే సెంటిమెంటుగా
ప్రాచుర్యం లోకి తెచ్చేస్తారు. క్రీడాకారుల నమ్మకాలే వీళ్ళూ రాస్తారేమో కూడా..! సెంటిమెంటు కొద్దీ ఒక ఆటగాడు పిచ్ మీదకి బ్యాటింగ్ కి రాగానే మూడుసార్లు తన పాడ్ ని సర్దుకొని ఆకాశం వైపు చూస్తే, ఇంకో ఆటగాడు తన కుడి చేత్తో బాట్ పట్టుకొని అపసవ్య దిశలో బ్యాటు ని గాల్లో రెండున్నర సార్లు తిప్పి సూర్యుడి వైపు చూస్తాడు. ప్రేక్షకులకీ ఇలాంటివి ఉంటాయండోయ్..!! కొందరు మన టీం బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ కూర్చున్న చోటు నుంచీ కదలకపోతే (కాలుకూడా పెట్టిన చోటు నుంచి కదపని వాళ్ళు నాకు తెలుసు.), వీడు టీ తాగగానే వికెట్టు పడిందని ఆట అయ్యే లోపల ఇరవై కప్పులు ఊదేసేవాళ్ళు కొందరు. అలాగే పాకిస్తాన్ తో మాచ్ కి శుక్రవారం సెంటిమెంట్ కూడా ప్రాచుర్యం లో ఉన్నదే.
సినిమా పరిశ్రమలో కొందరు హీరోలకి సినిమా పేరు ఫలానా అక్షరంతో మొదలవ్వాలని సెంటిమెంటైతే, ఇంకొందరికి పేరు చివర పొల్లు ఉండాలి. కొందరికి సంక్రాంతి సెంటిమెంటైతే మరికొందరికి దసరా..! రాజకీయ నాయకులకి ఈ సెంటిమెంట్లు ఇంకా చిత్రంగా ఉంటాయి. ఈ నియోజక వర్గం నుండీ ప్రచారం మొదలెడితే జయం నిశ్చయం అనీ, ఫలానా ఊరిలో శంకుస్థాపనకో రిబ్బన్ కటింగ్ కో వెళ్తే అట్నించి అటే పదవి పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, చాలా..!! ఒక స్థానం లో పని చేసిన మంత్రులిద్దరూ వేరే వేరే కారణాల వాళ్ళ పదవి అర్ధంతరంగా ఊడగొట్టుకుంటే ఆ వచ్చే మూడో ఆయన, ఆయనకి బాగా అచ్చొచ్చిన పార్టీ ఆఫీసు నుంచో క్యాంపు కార్యాలయం నుంచో పనులు నడుపుతాడు గానీ, చచ్చినా పాత ఆఫీసులో కాలు పెట్టడు. పెట్టినా దాని రూపు రేఖలూ, వాస్తూ సమూలం గా మార్చిగానీ గృహప్రవేశం చెయ్యడు.
సినిమా పరిశ్రమలో కొందరు హీరోలకి సినిమా పేరు ఫలానా అక్షరంతో మొదలవ్వాలని సెంటిమెంటైతే, ఇంకొందరికి పేరు చివర పొల్లు ఉండాలి. కొందరికి సంక్రాంతి సెంటిమెంటైతే మరికొందరికి దసరా..! రాజకీయ నాయకులకి ఈ సెంటిమెంట్లు ఇంకా చిత్రంగా ఉంటాయి. ఈ నియోజక వర్గం నుండీ ప్రచారం మొదలెడితే జయం నిశ్చయం అనీ, ఫలానా ఊరిలో శంకుస్థాపనకో రిబ్బన్ కటింగ్ కో వెళ్తే అట్నించి అటే పదవి పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, చాలా..!! ఒక స్థానం లో పని చేసిన మంత్రులిద్దరూ వేరే వేరే కారణాల వాళ్ళ పదవి అర్ధంతరంగా ఊడగొట్టుకుంటే ఆ వచ్చే మూడో ఆయన, ఆయనకి బాగా అచ్చొచ్చిన పార్టీ ఆఫీసు నుంచో క్యాంపు కార్యాలయం నుంచో పనులు నడుపుతాడు గానీ, చచ్చినా పాత ఆఫీసులో కాలు పెట్టడు. పెట్టినా దాని రూపు రేఖలూ, వాస్తూ సమూలం గా మార్చిగానీ గృహప్రవేశం చెయ్యడు.
పైన
చెప్పిన అన్ని సందర్భాలలోనూ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరి మధ్యా కామన్
గా కనిపించేది వారి మానసిక దౌర్బల్యమే (బలహీనత) తప్ప మరొకటి కాదు. తమ
జీవితాలలో ఒక స్థాయికి చేరడానికి స్వయంశక్తిని నమ్ముకున్నవారు ఆ స్థాయిని
నిలబెట్టుకోవడానికి ఈ సెంటిమెంట్ ల మీద ఆధారపడడం మొదలుపెడతారు. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సెంటిమెంట్ కి రాజూ - పేదా తేడాలేదు. దీనికి ముఖ్య కారణం
ఫలితాన్ని ఆశించి పని చెయ్యడం..! ఆశించిన ఫలితం వచ్చి తీరాలనో, రాకపోతే ఏదో
అయిపోతుందేమోననే భ్రమ, దాని పర్యవసానమైన భయం ఇంకో కారణం. కొన్నిసందర్భాలలో ఈ
సెంటిమెంట్ విషయంలో అది ఉన్న వ్యక్తులకే అది చాలా ఫూలిష్ గా అనిపిస్తుండొచ్చు.
కానీ అది పాటిస్తే పని జరుగుతుందన్న నమ్మకం కన్నా పాటించకపోతే పని జరగదన్న
అపనమ్మకం ప్రభావమే అధికంగా ఉంటుంది..! అందువల్ల ఆ సెంటిమెంట్ ని వదలలేక సతమతమౌతూ
ఉంటారు.
ఈ
మానసిక స్థితి నుంచీ బయటపడాలంటే చెయ్యవలసింది మన శక్తియుక్తులన్నీ చేసే పనిమీద కేంద్రీకరించి చేసే పనిని నీకు చేతనైనంతలో చక్కగా చెయ్యడం, ఫలితాన్ని ఆశించక పోవడం.
గీతాచార్యుడి
వాక్కుని జ్ఞాపకం చేసుకుందాం:
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
నీకు కర్మలను ఆచరించుటయందు అధికారమున్నది గాని కర్మఫలములపైన లేదు.
నీకు కర్మలను ఆచరించుటయందు అధికారమున్నది గాని కర్మఫలములపైన లేదు.
ఫలితం
ఎలాఉన్నాఫరవాలేదనే మానసిక స్థితికి మనం చేరగలిగినప్పుడు, దాన్ని మనం ప్రభావితం
చేస్తున్నామనే భ్రమలో పాటించే ఈ సిల్లీ సెంటిమెంట్లకి దూరంగా ఉండగలుగుతాం.
Sunday, October 28, 2012
దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
ఈనాటి
భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో
కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్
కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి
ల సంగతులు తేలేలోగా, నిన్నటికి నిన్న, అదృష్టవశాత్తూ కొన్నాళ్ళు ఈ దేశప్రధానిగా
కాలం వెళ్ళబుచ్చిన కర్నాటక రాష్ట్ర నాయకుడు దేవగౌడ, తాజా మాజీ సీఎం యడ్యూరప్ప
మరియు ఇంకొందరి మీద ఆరాష్ట్ర లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
శీమతి
సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాధ్రా గారు, డీ ఎల్ ఎఫ్ తో వారికున్న
స్నేహాన్ని పురస్కరించుకొని వారికి ఓ నాలుగు ప్రాజెక్టులు ఇప్పిస్తే ఆ కంపెనీ
వాళ్ళు ఈయనకి తమ లాభం కొంత పంచిచ్చారు అదే ఫ్రెండ్షిప్ కొద్దీ…! గడ్కరీ గారు ఎంతో
ఉదారంగా తమ డ్రయివర్ ని ఒక పది కంపెనీలకి డైరెక్టర్ని చేస్తే పాపం ఆ డ్రయివరు
రాముడు పది కంపెనీలకి డైరెక్టర్ని కదా అని తల ఎగరెయ్యకుండా మరింత శ్రద్ధగా తన
డ్రయివరుగిరీ కొనసాగించి తన స్వామి భక్తినీ, విశ్వాస పాత్రతనూ చాటుకొన్నాడు…! ఈ
రెండూ కూడా కొద్ది రోజుల వ్యవధిలో బయటకొచ్చిన సంగతులే. కొసమెరుపేంటంటే అల్లుడుగారికి
క్లీన్ చిట్టూ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారి మీద విచారణకు ఆదేశించడం, రెండు
నిర్ణయాలూ ఆగమేఘాల మీదే తీసుకొన్నాయి ఆయా ప్రభుత్వాలు, లేదా వ్యవస్థలు. ఇవి
చాలదన్నట్టు ఒక టీవీ చానెల్ వారికీ, ఒక ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తకూ మధ్య
జరుగుతున్న తంతు కూడా రోత పుట్టిస్తోంది.
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html |
ప్రభుత్వాలలో,
రాజకీయ పార్టీలలో, లేదా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి ఇలా ఉంటే రోజూ మన కళ్ళ
ఎదురుగా జరిగే సంగతులు కొన్నిఇలా ఉంటాయి :
మనం
రైల్వే స్టేషన్ కి మన బంధువులని తీసుకురావడానికి వెళ్తాము. అక్కడ మన కారు పార్క్
చెయ్యడానికి పది రూపాయలు తీసుకొంటాడు. మనం ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికే చూస్తాము.
రుసుము వసూలు చేసేవ్యక్తి కళ్ళుగప్పి చల్లగా జారుకోవడమో, లేక పార్క్ చేయలేదని,
అసలు ఆగనేలేదని దబాయించడమో చేసి బోల్డు సంబర పడిపోతాము. తనిఖీ జరగటం లేదని తెలిసిందా ప్లాట్ ఫాం టికెట్
అసలు తియ్యనే తియ్యం. కూరలు, పళ్ళూ అమ్మే చిరువ్యాపారుల దగ్గర వాళ్ళు పొరపాటున
మనకి చిల్లర ఎక్కువ ఇచ్చేసినా గప్ చుప్ గా వెళ్ళిపోతాం. మనం కొన్న వస్తువుల జాబితాలోకి
పక్కవాడి వస్తువు పొరపాటున కలిసిపోయిందనుకోండి.., మొదట బిల్లు లో అది కలిసిందా
లేదా చూస్తాం. కలిస్తే నానా యాగీ చేస్తాం లేదా చాలా నిజాయితీ పరుడిలాగా ఫోజు
పెట్టి అది మాదికాదని చెప్తాం. ఒకవేళ బిల్లు లో కలవక పోతే మాత్రం ఆహా ఇవాళ లేచిన
వేళా విశేషం.. అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ’ఆమ్ ఆద్మీ అవినీతి’ జాబితా
కొండవీటి చేంతాడంత అవుతుంది. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ట్రాఫిక్ రూల్స్
పాటించడంలోకావచ్చు, బిల్లు కట్టడానికి క్యూలో నిలుచున్నప్పుడు కావచ్చు, . అవకాశం
దొరికిన ప్రతీసారీ పక్కవాడి దాంట్లోంచీ చిలక్కొట్టుడు కొట్టేస్తాం. కానీ మన
నిజాయితీ ఇమేజికి భంగం కలగ కుండా ’సమయానికి తగు మాటలాడి’ ఒక పకడ్బందీ సాకు వెదికి,
తప్పు మనది కాదంటూ తీర్మానించి, అది అవతల వాడిమీదకి తోసేసి చేతులు దులుపుకొంటాం.
అంటే
మనలో అందరూ లేదా చాలా మంది ఏదో ఒక విధమైన అవినీతిలో తెలిసో తెలియకో, కావాలనో లేక
అసంకల్పితంగానో భాగస్తులమే అన్నది నిర్వివాదం. అందువల్ల ప్రొమోషన్ లిస్ట్ లో మనతోటివాళ్ళ
కన్నా పైకి ఎగబాకడానికి పై లెవెల్లో లంచమిచ్చి మేనేజ్ చెయ్యడానికి వెనుకాడం. డ్రైవింగ్ లైసెన్సో, పాస్ పోర్టో అర్జెంటుగా
కావాలంటే లంచమిచ్చి తెచ్చుకోవడాన్ని అవినీతిగా
పరిగణించం. కానీ పేపర్లో రోజుకొకటి కనిపించే అవినీతిని మాత్రం చూసిమాత్రం గుండెలు
బాదుకొని తీవ్రంగా నిరసిస్తాం. మళ్ళీ అవే రాజకీయ పార్టీలు ఏదైనా తాయిలాలు ఇస్తామంటే
మాత్రం ఆ నాయకులు మనకు దైవ సమానులై పోతారు.
అంటే ఇందాక గుండెలు బాదుకున్నది దానిలో మనకు (మనం అంటే మనం అనే కాదు ఆ స్కాము వల్ల
లబ్ధి పొందని/ పొందలేకపోయిన/ పొందడానికి అవకాశం రాలేని వాళ్ళందరూ ) భాగం రాలేదనా…!!
ఇప్పుడు ఈ అవినీతిమయ రాజకీయ పార్టీలలోకి జరుగుతున్న వలసలూ, లేదా క్రొత్త
సభ్యత్వాలూ జరుగుతున్నది ఆ పార్టీల / నాయకుల మీద ప్రేమా..??!! లేక ఆయన పంచన చేరితే
అవినీతి సొమ్ములో ఆయన తినగా మిగిలిన ఎంగిలి మెతుకులైనా దక్కుతాయనే మోహమా..??!! ఓ
నాలుగేళ్ళు అప్రెంటీసు చేసి ఆ కిటుకేదో కనిపెడితే భవిష్యత్తుకి ఢోకా ఉండదనే కపటమా..??!!
పూర్వం
ఒకప్పుడు.., చాలా దశాబ్దాల క్రితం.., ప్రాచీన కాలంలో.., నాగరికత ఇంత అభివృద్ధి
చెందని కాలంలో.., (అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే.. మీకూ నాకూ మనలో ఎవ్వరికీ తెలియని
కాలంలో) సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడనే పదాలు భగవంతుడికి పర్యాయపదాలుగా
వాడేవారు. కలడు కలండనెడువాడు కలడో లేడో.. కానీ ఇప్పుడా పదాలు “అవినీతి భూతానికి”
సరిగ్గా సరిపోతున్నట్టున్నాయి. ఎందుకనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ
నాయకులూ, అధికారులూ, ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ, స్వామీజీలూ, ఒక్కరేమిటి
అందరూ ఆ తాను ముక్కలే. ఈ నేపధ్యంలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడు
స్థాణువై శిలామాత్రంగా మిగిలిపోతున్నాడు.
ఒక్కడు
బురదలో నడిస్తే గట్టున ఉన్నపదిమంది అసహ్యించుకుంటారు.., లేదా మొహం వాచేలా చీవాట్లు పెడతారు.
అదే గట్టున ఉన్నది ఒక్కడూ, బురదలో నడుస్తున్నది పదిమంది అనుకోండి. ఈ గట్టున ఉన్న
ఒక్కడినీ చూసి ఆ పదిమందీ పగలబడి నవ్వుతారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాడికీ ఆ మకిలి కాస్త
అంటించేసి వెక్కిరిస్తారు.
ఇప్పటి రాజకీయాలు, అవినీతి బురద పూసుకొని, ఆ
బురదని మరో పదిమందికి పూసి ఆ కుళ్ళు మొహాలనే నేటి తరం ఫ్యాషన్ గా చెలామణి
చేసేస్తున్నాయి..! నిదర్శనం కావాలంటే సగటు భారతీయుడిని నేటి అవినీతిమయ రాజకీయాలపైన
అభిప్రాయం చెప్పమనండి..! ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాధపడేవాళ్ళ కన్నా,
ఆ అవినీతికి సూత్రధారి అయిన పెద్దమనిషి తెలివితేటలకి అబ్బురపడే వాళ్ళే ఎక్కువ
కనిపిస్తున్నారు. అంటే ఈ లెవెల్ అవినీతికి ఆల్రెడీ ఆమోదముద్ర పడిపోయిందన్నమాటేకదా..!
ముఖ్యంగా యువతలో..!!!
నిజంగానే
దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html |
Subscribe to:
Posts (Atom)