Sunday, June 19, 2011

ఒక కథ - ఇద్దరు చిత్రకారులు..!!

ఒకే కథకి ఇద్దరు ఉద్దండులైన చిత్రకారులు గీసిన బొమ్మలు ఎలా వున్నాయో క్రింద చూడండి. ఆ ఇద్దరిలో ఒకరు చందమామ పత్రికకి సొగసులద్దిన శంకర్ గారైతే ఇంకొకరు అమరచిత్రకథ వారి కామిక్ పుస్తకాలూ, మరియు పిల్లల మాస పత్రిక టింకిల్ లో బొమ్మలు గీస్తూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రదీప్ సాథే గారు. అమరచిత్రకథ వారి 'స్నేహితులు – శత్రువులు'  అనే పుస్తకంలో  'ముని – కుక్క' అనే కథగా ప్రదీప్ గారు గీస్తే, శంకర్ గారు రామకృష్ణమఠం వారి ప్రచురణ ’బాలల కథా మంజరి’ అనే పుస్తకాలలో(మొత్తం ౧౬ పుస్తకాల సెట్) 'దుష్టుల స్వభావం' అనే కథకి చిత్రించారు. 
అర్హతలేనివారిని అందలమెక్కిస్తే పర్యవసానాలెలా వుంటాయో చెప్పే కథ ఇది. కథ స్థూలంగా… అంటూ నేను మొదలెట్టేకన్నాక్రింది బొమ్మల మీద క్లిక్ చేసి మీరే చదువుకొని ఆనందించండి.

 
  

మన చందమామ శంకర్ గారి గురించీ సమాచారం వారి అభిమానుల ప్రయత్నం వల్ల ఎంతో కొంత లభ్యమౌతోంది. కానీ అమరచిత్ర కథలకు జీవం ఉట్టిపడేటట్లు ఎన్నో బొమ్మలు గీసిన ప్రదీప్ సాథే గారి ఫొటో దొరకడమే కష్టమైపొయింది. ఇంటర్నెట్ లో వెతగ్గా వెతగ్గా వారిఫొటో ఒక్కటి మాత్రం దొరికింది. టింకిల్ లో వస్తూండే కాళియా కాకి కథ, ఫలానా (జంతువు లేదా పక్షి) ని కలుసుకోండి, అంటూ వచ్చే చాలా శీర్షికలకు వీరి బొమ్మలు వేసారు. కానీ అమరచిత్ర కథ వారుకూడా వీరి వివరాలను వారి వెబ్ సైటులో ఉంచకపోవడం చాలా విచారకరం. ఏది ఏమైనా ఒకే కథకు ఇద్దరు చిత్రకారుల విభిన్నమైన చిత్రణ, రెండు రకాల ఆర్టిస్టిక్ ఎక్స్ ప్రెషన్ మీకూ నచ్చిందని తలుస్తాను. 
నాకు మాత్రం మన శంకర్ గారు  గీసిన 'శరభం'(మొదటిది) నచ్చింది.  
శంకర్ గారి గురించిన మరింత సమాచారం "మన తెలుగు చందమామ బ్లాగ్ లో" చూడండి. 
అలాగే ప్రదీప్ సాథే గారుకూడా అమరచిత్ర కథ, టింకిల్ లకు మాత్రమే కాకుండా ఇంకొన్ని సైన్సు ఫిక్షన్, డిటెక్టివ్ కామిక్స్ కూడా బొమ్మలు వేసారని తెలుస్తోంది. ఇంకేమైనా సమాచారం వుంటే మిత్రులెవరైనా పంచుకోగలరు.
పూర్తిగా చదవండి...

Thursday, June 16, 2011

"ఇక్కడ తాజా చేపలు అమ్మబడును.."

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

మనకు సలహాలిచ్చే వాళ్ళని చాలా మందినే చూస్తూ వుంటాం. ఇచ్చే వాళ్ళు కూడా అలవోకగా  ఇచ్చేస్తుంటారు.  అలాంటి సలహాలలో మనకు నిజంగా ఉపయోగపడేవి ఏవో ఎంచుకోవలసిన బాధ్యత మాత్రం మనదే.       



"అంతెందుకు..? ఇదిచాలు కదా...!!" అని ప్రశ్నించే ప్రతీ వాడినీ సమాధాన పరచడానికి పూనుకొంటే చివరికి ఏమైందో చిత్తగించండి..!!
ఒకడు చేపలు అమ్మే దుకాణం కొత్తగా పెట్టి బయట బోర్డు ఇలా పెట్టించాడు.."ఇక్కడ తాజా చేపలు అమ్మబడును.." ఒక ఆసామి వచ్చి బోర్డు చూసి.. "అబ్బాయ్..చేపలు ఎవడైనా తాజావే అమ్ముతాడు. నువ్వు ప్రత్యేకంగా 'తాజా' అని రాస్తే నిజంగా కావేమో అనుకుంటారు. మరి 'తాజా' ఎందుకు??" అని అడుగుతాడు. నిజమే కదా అని.. 'తాజా' చెరిపేస్తాడు. మిగిలింది " ఇక్కడ చేపలు అమ్మబడును.."
ఇంకొకతనొస్తాడు "అబ్బీ..చేపలు అమ్మేది ఇక్కడే కదా అప్పుడు ఇంకా 'ఇక్కడ' ఎందుకు??" అంటాడు. సర్లేమ్మని 'ఇక్కడ' చెరిపేస్తాడు. మిగిలింది ."చేపలు అమ్మబడును.." మరొక వ్యక్తి వచ్చి " నువ్వేమీ ఉచితంగా ఇవ్వవనీ..కొనుక్కోవాలని మాకు తెలుసు. ఇంకా 'అమ్మబడును' ఎందుకూ..??" అంటే.. 'అంతేకదా..!' అనుకోని మనవాడు 'అమ్మబడును' కూడా చెరిపేస్తాడు. మొత్తానికి బోర్డుమీద "చేపలు" మిగిలింది.
ఇంతలో అటుగా వెళ్తున్నఒక పెద్దావిడ.."నీ చేపల కంపు బజారు చివరికి వస్తోంది. మళ్ళీ 'చేపలు' అని రాయాలి కూడానా..?" అంటుంది ముక్కు మూసుకొంటూ..!మనవాడికి తిక్కరేగి అదికూడా చెరిపేసి ఖాళీ బోర్డు వంక చూసి 'అమ్మయ్య' అనుకుంటాడు. అప్పుడే షాపుకొచ్చినతను "అదేమిటయ్యా..బోర్డు అలా ఖాళీగా పెట్టేబదులూ నువ్వేమిటి అమ్ముతున్నావో రాయొచ్చు కదా ..!" అంటాడు కళ్ళజోడు సవరించుకొంటూ.. ఇంక ఇప్పుడేం  చెయ్యాలో తోచక తలపట్టుకోవడం మళ్ళీ మనవాడి వంతయ్యింది.
(చిన్నప్పుడు టింకిల్ పుస్తకం లో ఈ కథ చదివాను. గుర్తున్నంతవరకు వ్రాసాను.)
******
పంచతంత్రం నుంచీ మరో కథ:
ఒక ఊర్లో ఒక సాలెవాడుంటాడు. అతని మగ్గం విరిగిపోవడం చేత కొత్త మగ్గానికి కావలసిన కర్ర కోసం దగ్గరలోని అడవికి వెళ్తాడు. మంచి చేవ వున్నా చెట్టుని చూసి నరక బోతుండగా ఆ చెట్టుని ఆశ్రయించు వున్న ఒక యక్షుడు సాలెవానికి కనిపించి చెట్టుని నరకకుండా ఉండేందుకు ప్రతిగా ఏదైనా వరం కోరుకొమ్మని అడుగుతాడు.  అతడికి  ఏది  కోరుకోవాలో  తెలియక ఎవరినైనా సలహా అడిగి మళ్ళీ వస్తాను అని యక్షుడితో చెప్పి మళ్ళీ గ్రామంలోకి  వస్తాడు.  నేరుగా  తన  ఆప్త మిత్రుడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి సలహా అడుగుతాడు. విని  సంతోషించిన ఆ  మిత్రుడు  "ఏదైనా  దేశానికి  రాజుని చెయ్యమని" అడగమంటాడు. డబ్బు అధికారం వుంటే ప్రపంచం పాదాక్రాంత మవుతుంది అంటాడు. సాలెవాడు తన భార్యనికూడా అడుగుదాం ఏమంటుందో అనుకోని  తిన్నగా  ఇంటికి  వెళ్తాడు. విషయం విన్న  భార్య  "రాజ్యాలున్నాయి  కాబట్టే  అదిపోగోట్టుకొని  రాముడూ, ధర్మరాజూ అడవులపాలయ్యారానీ,
 రాజ్యాలుండి సుఖపడిన వాడెవ్వడూ లేదనీ అంటుంది. "దాని బదులూ ఇంకేదైనా అడుగుదాం. ప్రస్తుతం నువ్వు రోజుకి ఒక చీర నేసి అమ్మగా వచ్చే ఆదాయం మనకు సరిపోతోంది, కానీ ఏమీ మిగలడం లేదు. నీకేగానీ వెనుకవైపుకి ఇంకో రెండు చేతులూ, ఇంకో తలా వుంటే నువ్వు రోజుకి రెండు చీరలు నెయ్య గలుగు తావుకదా!" అంటుంది. మరింకేమీ ఆలోచించకుండా ఆ సాలెవాడు యక్షుడి దగ్గరకి పోయి ఇంకో తల ఇంకో జత చేతులూ అడిగి పుచ్చుకొని ఇంటిదారి పడతాడు ఆనందంగా..! కానీ ఈ విషయం తెలియని గ్రామస్తులు తమ గ్రామానికి చేటు చెయ్యడానికి ఏదో బ్రహ్మరాక్షసి వచ్చేస్తోందని భ్రమపడి కర్రలతో కొట్టి చంపేస్తారు.

సరైన సలహా ఎంచుకోకపోవడం ఒక్కొక్కసారి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తుందో చూసారా.. 
'ప్రజాశక్తి' లో వచ్చిన ఈ ఆర్టికల్ కూడా చదవండి. వ్రాసినది శ్రీ డి.వెంకట్‌రెడ్డి గారు.   
పూర్తిగా చదవండి...

Sunday, June 12, 2011

ఇద్దరు మోసగత్తెలు - చందమామ మినీ సీరియల్

అరేబియా కధల పరంపరలో భాగంగా ముందొక బ్లాగులో వ్రాసిన 'గంధర్వ చక్రవర్తి కూతురు' మినీ సీరియల్ లాగే దాని కన్నా ముందు వచ్చిన సీరియల్ " ఇద్దరు మోసగత్తెలు". చాలామట్టుకు పోగా నా దగ్గర ఇంకా మిగిలి వున్న చందమామ సీరియల్స్ పుస్తకాలలో ఇది ఒకటి. రచయిత ఎవరో తెలియదు. తొమ్మిది భాగాలలో ఎన్నో మలుపులతో చాలా పకడ్బందీగా పట్టుగా నడుస్తుంది కథ.




ఖలీఫా
గారి పావురాలటపా నడుపుతున్న వ్యక్తి మరణానంతరం టపానీ నీగ్రోబానిసలనీ, దివాణంతో సహా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అతని భార్య దిలైలా, కూతురు జీనాబ్ లే మన కథానాయికలు. దిలైలా పావురాలటపా తాను నిర్వహించగలనని వుద్యోగం తనకిప్పించామనీ అర్జీ పెట్టుకున్నా అది బుట్టదాఖలౌతుంది. తీరాచూస్తే టపా నిర్వహణ పూర్వాశ్రమంలో గజదొంగలుగా బాగ్దాదు నగరాన్ని హడలెత్తించి ప్రస్తుతం కొత్వాళ్లుగా పనిచేస్తున్న అహ్మద్, హసన్ లకు అప్పగించ బడుతుంది. దొంగలుగా వాళ్ళని పట్టుకోలేక వాళ్ళని కొత్వాళ్లుగా కొలువులో ఉంచుకుంటాడు ఖలీఫా.



దానితో భగ్గుమన్న దిలైలా..దొంగలకీ, మోసగాళ్ళకీ ఉద్యోగాలిచ్చేట్టయితే మన ప్రతాపం కూడా నగరానికి మరీ ముఖ్యంగా కొత్వాలుకి తెలిసోచ్చేలా చెయ్యాలని బయలుదేరుతుంది. అదిమొదలు ఆమె చేసే మోసాలు..దొంగతనాలూ..నగరాన్ని హడాలెత్తిస్తాయి. ఒకదానికి కొనసాగింపుగా మరొకటీ దానికి తోడుగా ఇంకొకటీ..దానికి తగ్గట్టు ఆవిడ వేసుకొనే వేషాలూ..మనల్ని ఆపకుండా చదివిస్తుంది.




మొదటగా ఒక రక్షక భట నాయకుడి భార్యకి పిల్లలు కలిగే మార్గం చెప్పే ఒక సాధువు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి పెళ్ళికోసం ఎదురుచూస్తున్న ఒక వర్తకుడి దగ్గరకి తీసుకెళ్తుంది. ఆమెని చూపించి నీకు పెళ్లిచేస్తాని చెప్పి వెయ్యి వరహాలు నొక్కేస్తుంది. యువకుడిని గదిలో ఒంటరిగా కూర్చోపెట్టి ఇతడే సాధువని చెప్పి నగలు తీసి ఒంటరిగా వెళ్ళమంటుంది. నగలు దాచేస్తుంది. ఒక కలంకారీ వ్యాపారి వద్దకు వెళ్లి, వీళ్ళిద్దరూ తనపిల్లలనీ కొత్త ఇంటికోసం చూస్తున్నాననీ అడిగితే, ఖాళీగా వున్న వాళ్ళ ఇంటి తాళాలు ఇస్తాడు. అతని కన్ను చాటుచేసి... కొట్లో వున్న సామానంతా దాటించేస్తుంది.








ఇలా సీరియల్ లాగా సాగుతాయి ఆమె మోసాలు. మొత్తానికి దిలైలా ఇల్లుచేరింతరువాత..ఇక కూతురు జీనాబ్ మొదలెడుతుంది. తమను పట్టుకోవటానికి ఖలీఫా చేత నియోగించబడిన అహ్మద్, అతని భటులనీ మోసం చేసి ఒంటిమీది బనియన్, చెడ్డీ తప్ప మిగతాదంతా ఊడ్చేస్తుంది. ఇంకో కొత్వాలు హసన్ ద్వారా వీరిద్దరూ మోసాలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొన్న ఖలీఫా పావురాల టపాకు సంబంధించిన దివాణాన్ని మళ్ళీ దిలైలా పరం చేస్తాడు.







అయితే తనకు జరిగిన అవమానం మర్చిపోలేని అహ్మద్ తన శిష్యుడైన పాదరసం అలీ ని బాగ్దాదుకు రప్పించి తల్లీ కూతుళ్ళ మీదకి పంపిస్తాడు. జీనాబ్ వాడిని కూడా చిత్తు చెయ్యడంతో పాదరసం ఆలి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి జీనాబ్ మేనమామ పెట్టిన షరతులని ఎలా సాధించాడన్నదే మిగతాకథ.

మినీ సీరియల్ చందమామ ఆర్కైవ్స్ లో మీకోసం...ఈ క్రింది లింకులు నొక్కి పూర్తిగా చదవండి.


పై లింకులు పని చేయకపోవడం చేత మళ్ళీ క్రొత్త లింక్ ఇస్తున్నాను. ఈ క్రింది లింకు నొక్కండి.

ఈ కథలో మోసపోయినవాళ్ళు దిలైలా చెప్పే కథలని యిట్టె నమ్మేస్తారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది. అలాగే ఒకదానితో ఒకటై కుదిరేలా సంఘటనలనీ, సన్నివేశాల్నీ రచయిత ఊహించిన తీరు కూడా అబ్బురపరుస్తుంది. పాత్రల పేర్లూ, శంకర్ గారి బొమ్మలూ అన్నీ అరేబియన్ నేపధ్యాన్ని మన కళ్ళకు కట్టిస్తాయి. 'అమరచిత్ర కథ' వాళ్ళది ఈనాడు పేపర్లో డైలీ కామిక్ సీరియల్ గా వచ్చిన 'చోర శిఖామణి' (ఇంగ్లిష్ లో SAHASRA MALLA) అని వచ్చిన కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. కానీ నేపథ్యం జైన జానపదం. ఇతివృత్తం ఒకటే కానీ పాత్రలూ సన్నివేశాలూ, చిత్రణ అన్నీ వేరు. అదికూడా చాలా బాగుండేది. ఈ మధ్య ఇంగ్లిష్ లో కనిపిస్తే కొన్నాను. దానిగురించి తరువాతి పోస్టులో వ్రాస్తాను.

అప్‍డేట్: ఈ సీరియల్ మొదటిసారి ’మాయదారి ముసలిది’  పేరుతో 1970 జూన్ లో వచ్చింది.రచన శ్రీ ఆర్. నాగ భూషణం. తరువాత కాలంలో చందమామ యాజమాన్యం సిద్ధాంతానికి అనుగుణం గా రచయిత పేరు వేయలేదు.

పూర్తిగా చదవండి...

Friday, June 10, 2011

మక్బూల్ ఫిదా హుస్సేన్

మక్బూల్  ఫిదా  హుస్సేన్ -  విలక్షణమైన శైలి..వ్యక్తిత్వం..మూర్తీభవించిన 96 ఏళ్ల ఎం ఎఫ్ హుస్సేన్ కన్నుమూసారు. చిత్రకారులలో సహజం గా కనిపించే భావుకత ఇతనిలోనూ కనిపిస్తుంది. అయితే ఆయన గీసిన కొన్ని చిత్రాల చుట్టూ అలుముకొన్నవివాదాల కారణంగా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన గీసిన కొన్ని చిత్రాలు, మరియు ఆయన చిత్రకళా ప్రదర్శనకోసం ఆయన పేరిట అహ్మదాబాదులో నెలకొల్పబడిన ఒక ఆర్ట్ గేలరీ కట్టారు. దానిపేరు Hussain - Gufa. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్కిటెక్ట్ బాలకృష్ణ వి. దోషీ..( BV Doshi ) డిజైన్ చేసారు. అజంతా, ఎల్లోరా గుహలనుంచి పొందిన స్పూర్తి తో ఇక్కడ కూడా కుడ్య చిత్రాలు చిత్రించారు హుస్సేన్. Dome ఆకారంలో ఉన్న పైకప్పు, దానికి ఉన్న skylights తో, విలక్షణం గా వుంటుందీ కట్టడం. నేను అహ్మదాబాద్ లో 1994 - 95 లో ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో వున్నప్పుడు అది నిర్మాణం లో వుండేది. పూర్తి అయ్యాక నేను కూడా చూడలేదు. ఆ ఫోటోలు మనందరికోసం..!!  
బి వి దోషి, ఆర్కిటెక్ట్




 




ఈ రోజు ఈనాడులో శ్రీధర్ వ్రాసిన ఆర్టికల్ క్రింద చదవండి:

గొల్లపూడి మారుతీరావు గారి బ్లాగు నుంచీ : 

బాబోయ్! నాకర్థమయేలా చెప్పండి..!

పూర్తిగా చదవండి...

Thursday, June 9, 2011

హైదరాబాదులో పరుగో పరుగు..


మధ్య పిల్లల సెలవులు పురస్కరించుకొని హైదరాబాద్ ట్రిప్ వేసోచ్చాం..!ఎప్పుడు వెళ్ళినా బయటికెక్కడికీ వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అనుకోని వెళ్లాం. వెళ్ళడమంటే వెళ్ళాం గానీ,పిల్లలతో బయటికి వెళ్ళే సాహసం చెయ్యలేక పోయాం. ఒకటి ఎండలు..! రెండు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం..!! ఫ్యామిలీని హైదరాబాదులో ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటూండగానే నాల్గు రోజులు గడిచిపోయాయి. చుట్టాలిళ్ళు చూడడాలు అయిపోయింతరువాత.. ఇంక ఒక్కరోజే ఉంటున్నాం అనగా.. పిల్లల్ని, మా ఆవిడనీ, మా అక్కపిల్లలు ఇద్దరు, మా అన్నయ్య కూతురు,(వీళ్ళు ఇంజనీరింగ్, ఇంటర్ చదూతున్నారు.) మొత్తం ఏడుగురం టాక్సీ తీసుకొని ఊరిమీద పడ్డాం..! అక్కడినుంచీ మొదలైంది మా పరుగు.
రామంతాపూర్ లో బయలుదేరే సరికి సాయంత్రం నాలుగు. బయలుదేరింది.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యుజియం, ఎన్టీయార్ గార్డెన్స్, ఐ - మాక్స్ మొదలైనవి చూద్దామని..!! మొదట సాలార్జంగ్ కి వెళ్ళాము. నాలుగుంపావుకే టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తాడట. సరే అని గేటు బయటినుంచే చూపించేసి..గబగబా దానిగురించి నాకుతెలిసిన నాలుగు ముక్కలూ మా అమ్మాయికి చెప్పేసి..చార్మినార్ కి బయలుదేరాం. నేనుకూడా చార్మినార్ ఎప్పుడూ పైకెక్కలేదు. ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఒక గైడుని కూడా పెట్టుకున్నాం. చార్మినార్ ఒక మినార్ లోపటినుంచీ.. మెట్లు ఎక్కించి సుమారు ఆరంతస్తుల ఎత్తున్న చార్మినార్ మొదటి అంతస్తుకి తీసుకెళ్ళాడు. ఒక్కొక్క మెట్టూ అడుగున్నర ఎత్తుండి వెడల్పు రెండున్నర అడుగులు కూడా లేదు. మా అబ్బాయిని ఎత్తుకొని మరీ ఎక్కాను. అక్కడినుంచీ చుట్టుపక్కల ప్రాంతాలు చూపించాడు మా గైడు. పిల్లలందరికీ బాగా నచ్చింది. మొత్తం టీం లో నేను మా అబ్బాయి(నాలుగేళ్ల వాడు) తప్ప మిగతా అందరూ ఆడాళ్ళే కదా..అందుకు చార్మినార్ తో పాటూ అక్కడ గాజుల షాపింగ్ ఇంకా నచ్చింది వాళ్లకి. దాంతో అక్కడే ఆరున్నరైపోయింది. అక్కడి నుంచి గోల్కొండ.
గోల్కొండ చేరేసరికీ ఏడు. ఆ చీకటిలో పరుగెత్తి మేము వెళ్ళే సరికే లైట్ అండ్ సౌండ్ షో మొదలైపోయింది. ఇదికూడా అందరం మొదటిసారి చూడడం. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ కామెంటరీ, అక్కడక్కడ బాలమురళీ కృష్ణ రామదాసు కీర్తనలూ.. కవితా కృష్ణ మూర్తి అనుకుంటా..ఆవిడ జావళీలు..!
బయట కొచ్చేసరికీ ఎనిమిదిన్నర. మళ్ళీ పరుగు.. ఈసారి ఎన్టీయార్ గార్డెన్స్ కి.. అక్కడికెళ్ళేసరికే తోమ్మిదయిపోయింది. మళ్ళీ ఇవికూడా(ప్రసాద్స్ ఐ-మాక్స్ , ఎన్టీయార్ గార్డెన్స్, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు..) గేట్లే చూపించేసి మమ అనిపించేసాను. ఫైనల్ గా వచ్చి నెక్లేస్ రోడ్డు, ఈట్ స్ట్రీట్లో పడ్డాం. ఆత్మారాముడిని శాంతింపజేసి హైదరాబాదు దర్శన్ అయిందనిపించాను. మా అన్నయ్య, అక్క కూతుర్లని మళ్ళీ రామంతాపూర్ లో దించేసి మేము 'చందా నగర్' వెళ్లేసరికి రాత్రి పన్నెండు.
అలాగే బయలుదేరిపోతున్న రోజు ట్రైన్ టైంకి మూడుగంటల ముందు చందానగర్లో బయల్దేరి (రవీంద్రభారతి దగ్గరకి వచ్చేసరికి గంట టైము పట్టింది) పిల్లలకి బిర్లామందిర్, ప్లానటోరియం,సైన్సు మ్యుజియం కూడా
రెండుగంటల్లో (ఫాస్ట్ ఫార్వర్డ్ లో) చూపించేసాను..!!ఆ విధంగా మా హైదరాబాదు దర్శన్ ముగించి వైజాగు బయలుదేరడానికి సిద్దంగా వున్న రైలేక్కేసాం చివరినిమిషంలో..!!

సాలార్జంగ్ మ్యుజియం

పూర్తిగా చదవండి...

Sunday, June 5, 2011

'త్రిభువన విజయం' సాంస్కృతిక కార్యక్రమం - విశేషాలు

'భువన విజయం' అందరికీ తెలిసిన కార్యక్రమమే కదా..! రాయలవారు తమ ఆస్థానంలోని అష్ట దిగ్గజకవులతో కొలువుతీరి వారి కవితా మాధురీ మకరందాలను గ్రోలే సభాస్థలిని కాలం లో మన కళ్ళముందు ముందు నిలిపే సాంస్కృతిక కార్యక్రమమే 'భువనవిజయం'. పాత్రధారులు స్వయంగా కవిత్వంలో ప్రవేశాన్ని కలిగి ఉండి తాము ఎవరిపాత్రనైతే ధరించారో కవి వ్రాసిన కావ్యాలలో నుంచీ పద్యాలను మనకు వినిపిస్తారు.
అయితే కవితా గానం తో పాటు, హంపీ విజయనగర శిల్పకళా వైభవాన్ని కళ్ళకు కట్టే దృశ్య మాలికనూ, మరియు నాటి రాజకీయ సామాజిక స్థితిగతులను గురించి మహామంత్రి తిమ్మరుసు తో చేసిన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని కలుపుకొని కార్యక్రమం 'త్రి' భువన విజయమై విశాఖ ప్రేక్షకులను మైమరపింప జేసింది..!! ఆద్యంతమూ కార్యక్రమాన్ని వీక్షించి విశాఖ వాసులు తమ రసజ్ఞతను మరొక్కసారి చూపించారు.


5

పై ఫోటోలు వరుసగా..

  1. ప్రేక్షకులు, ఆహ్వానితులమధ్యలో ప్రత్యేక అతిధి శ్రీకృష్ణ దేవరాయల వారసులలో పంతొమ్మిదవ తరానికి చెందిన రాజ వంశజుడు... వీరిపేరుకూడా కృష్ణ దేవరాయలే.ప్రస్తుతం బెంగళూరు లో వుంటున్నారు.
  2. కృష్ణ దేవరాయల పాత్రధారి మేకప్ తో మరియు మేకప్ లేకుండా..
  3. భువన విజయ సభాప్రాంగణం లో తమ అష్టదిగ్గజ కవులతో ఆసీనులవుతున్న శ్రీ కృష్ణ దేవరాయలు.
  4. పాత్రలూ .. పాత్ర దారులూ..!!
  5. శ్రీ కృష్ణ దేవరాయల వారితో నేను..
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)