మా పారిస్ యాత్ర విశేషాలు - 2
(ఒక విన్నపం: ఈ క్రింద ఉన్న ఫోటోలపై క్లిక్ చేసి పెద్దవిగా చూడండి.)
మేము పారిస్ లో దిగగానే అక్కడ ఉన్న భవంతులు, కట్టడాలలో ప్రఖ్యాతి చెందినవీ, చూడదగ్గవీఏమున్నాయో అని వెతుకులాట మొదలుపెట్టాం. అందరూ చెప్పినవి..: ఈఫిల్ టవర్, సీన్ నదిమీద విహారం, నోటర్ డాం చర్చి, ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉంచబడిన మ్యూసియం, కాక-మనకుఅందుబాటులో ఉన్న కొంచం సమయంలో చూడడానికి వీలుపడనన్ని మ్యుసియంలూ..! ఇలాకాదని గూగిలిస్తే కొన్నినిర్మాణాలు కనిపించాయి. వాటిలో నమ్మశక్యం కానంత గా మమ్మల్ని ఇంప్రెస్ చేసిన బిల్డింగ్ 'జార్జ్ వి' అవెన్యూ లో ఉన్న ఈ భవంతి.
ఫోటో చూడగానే మతిపోయింది. 'అసలు ఇలా కట్టడం సాధ్యమా..!!' అనిపించింది. పారిస్ లో చాలా మట్టుకు నిర్మాణాలన్నీ వెస్ట్రన్ క్లాసికల్ శైలిని అనుసరించి వుంటాయి. కానీ ఈ భవంతి శైలి మాత్రం అదే అయినా ఆ వంపులు తిరిగిపోయిన తీరు చూస్తే అలా కట్టగలగడం ఆశ్చర్యమనిపించింది. ఇదేదో 'ఫోటో షాప్' లో చేసిన కనికట్టా అంటే పక్క నున్న భవంతులన్నీ సరిగానే ఉండగా ఇదొక్కటే ఇలా ఎలా వుందో అర్ధం కాలేదు. పైగా రెండుమూడు ఏంగిల్స్ లోని ఫోటోలలో కూడా అది వంపులు తిరిగే ఉందాయే...!! సరే ఎలాగూ అటే ('జార్జ్ వి' అవెన్యూ) వెళ్తున్నాం కదా అని దీనిని కూడా చూడాలని తీర్మానించుకున్నాం.
అనుకున్నవన్నీ చూశాక సాయంత్రం అవుతుండగా ఇక్కడికొచ్చాం. ఆ చుట్టుపక్కల ఎంత తిరిగినా ఆ భవంతి కనబడలేదు. ఎంతో మందిని ముఖ్యంగా ఆ చుట్టుపక్కల షాపుల వాళ్ళని..! ఎవరినడిగినా మాకుతెలీదనే సమాధానం. పైగా ఎవ్వరూ ఫ్రెంచ్ తప్ప మాట్లాడరు. మనం ఇంగ్లీషులో ఆ బిల్డింగ్ ని వర్ణించి చెప్పి తెలుసా అని అడిగితే.. వాళ్ళు ముఖ ముఖాలు చూసుకొని.. మమ్మల్ని ఎగాదిగా చూసే వారు. ఆఖరికి ఆ రోజు మాకు దొరకలేదు. ఇలా కాదని అనుకోని రూముకెళ్ళి మళ్ళీ గూగుల్ లోకి వెళ్లి అడ్రెస్స్ పట్టుకొన్నాం. అది నెం: 39, జార్జ్ వి అవెన్యూ, పారిస్.
మర్నాడు పట్టువదలని విక్రమార్కుల్లా పొద్దున్నే బయల్దేరి మళ్ళీ జార్జ్ వి అవెన్యూ కి వెళ్లి 39 వ నెం ఇంటికి వెళ్లాం. ఈసారి సులువు గానే దొరికింది. కాని మమ్మల్ని నిరాశ పరుస్తూ ఆ బిల్డింగ్ మిగిలిన ఆని భవంతులలాగే తిన్నగానే వుంది. తేడాగా లేదు. అయితే 'అది' ఇదయ్యుండ దనుకొని మళ్ళీ తిరిగాం. లాభం లేక చివరకి ఆ బిల్డింగ్ లోనికే వెళ్లి చూస్తే ఆ రిసెప్షన్ కౌంటర్ బ్యాక్ డ్రాప్ గా మేము వెతుకుతున్న ఫొటోనే వుంది. ఆ రిసెప్షనిస్టుని వివరాలు అడిగితే ఆ అమ్మాయి రెండేళ్ళ క్రితం జాయిన్ అయ్యిందనీ.., అంతకుముందు ఆ బిల్డింగ్ లో Renovation Work జరిగిందనీ, ఆ ఫోటో ని బ్యాక్ డ్రాప్ గాఎందుకు పెట్టారో తెలీదనీ, చెప్పింది. మాకు నిస్పృహ వచ్చేసింది. అయితే ఆ బిల్డింగ్ ని కూలగొట్టి మళ్ళీ మామూలుగా కట్టేసి వుంటారనుకున్నాం. పోనీ ఆ renovate చేసిన ఆర్కిటెక్ట్ వివరాలు చెబితే పోనీ అతని తోటే మాట్లాడతామంటే కూడా వివరాలు చెప్పలేదు. ఇంకేం చేస్తాం..! ఆ ఉన్న బిల్డింగ్ కే ఫోటో తీసుకొని వెనక్కి వచ్చేశాం..!!
ఇండియా కి వచ్చేశాక గూగుల్ లో మళ్ళీ వెతికితే అప్పుడు తెలిసింది దాని అసలు రహస్యం. ఇంతకీ దాని అసలు సంగతేమిటంటే: ఆ బిల్డింగ్ ఓనర్ దానికి పెద్ద ఎత్తున రిపేర్ వర్క్ మొదలుపెట్టినప్పుడు.. మనకులాగా సిమెంటు సంచీలూ లేదా మెటల్ రేకులతో కట్టే పరదాల బదులూ, ముందు ఉన్న భవనానికి (తిన్నగా ఉన్నదే సుమండీ..) ఫోటోలు తీసి, వాటికి ఈ రకమైన వొంపు సొంపులు సృష్టించి బిల్డింగ్ మొత్తం కవర్ ఐపోయే సైజులో ప్రింట్లు తీసి తగిలించారు. తద్వారా బిల్డింగ్ ని ఏ మూల నుంచీ చూసినా పై ఫోటోలలో కనిపించే విధం గా కనికట్టు చేసారన్న మాట. బిల్డింగ్ Renovation పూర్తయిపోగానే ఆ తెరలు తీసేశారు. భలేగా ఉందికదూ..!!
పైగా అది నిఝం గా నిజమే అనిపించటానికి కొన్ని డిజైన్ ఎలెమెంట్స్ ని నిజంగానే అలా కరిగిపోతున్నట్టుగా తయారు చేసి అతికించారు. అన్ని ఫోటోలనీ ఇంకోసారి పరీక్షగా చూడండి..! పైభాగం లో బాల్కనీలు, చూరు ఉన్నదగ్గర, కార్నర్స్ దగ్గర..! అర్ధం అవుతుంది..!!
ఈ రకమైన కళని ఫ్రెంచ్ లో Trompe-l’oeil అంటారు.
This building mural, Trompe-l’oeil, is an art technique involving extremely realistic imagery in order to create the optical illusion that the depicted objects really exist, instead of being just two-dimensional paintings. The name is derived from French for Trick the Eye, from tromper – to deceive and l’oeil – the eye.