Sunday, October 31, 2010

శ్రీ వేంకటేశ్వర..!!

పై రచనను గమనిస్తే ఇది ఒక చిత్ర కవిత్వం గా బోధపడుతుంది.
మొత్తం పన్నెండు పాదాలు. ప్రతీ పాదం లోనూ ముప్పై ఆరు అక్షరాలు. పాదం మొదలూ చివరా ఒకే అక్షరం ఉంది.. మొత్తం పన్నెండు పాదాలూ కలిపి నిలువుగా మొదటి అక్షరాలను కలిపి చదివితే ' వేంకటేశ్వర' దర్శనమవుతుంది...! అలాగే చివరి అక్షరాలు కూడా...!! మధ్యలో స్వామి గురించిన ప్రశస్తి. ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామిని ఒక చిన్న కవిత లో ప్రత్యేకించి ఆది అంత్యాలలోదర్శించడం చిత్రం గా లేదూ..!!


ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి చిత్రమైన రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.


(శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు అక్టోబర్ 22 కి డెబ్భై ఏడో వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా... ఆయురారోగ్యాలతో వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ వారిపై శ్రీ వేంకటేశ్వర కృప ఎల్లప్పుడూ ఉండాలనీ ప్రార్ధిస్తూ...- కుటుంబ సభ్యులందరి తరఫునా ...- రాధేశ్యాం )

పూర్తిగా చదవండి...

Friday, October 29, 2010

వపా ఉత్తరాలు - వారి అంతరంగం...



బాపు గారు, వపా గారు ఇద్దరూ శ్రీ న్యాయపతి కామేశ్వరరావు గారి 'బాల' లో బొమ్మలు వేస్తున్నప్పటినుంచి చూస్తే బాలవటువుగా వున్న ఇద్దరూ త్రివిక్రమావతారులుగా పరిణతి చెందడం స్పష్టంగా కనిపిస్తుంది..! ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని నిర్మించుకొని విస్తరించి.. శిఖరాగ్రాన నిలచిన వారే. బాపుగారు తన ప్రతిభను వివిధరంగాలకు (కార్టూన్లు, సినిమాలూ, టి వి సీరియల్స్, లాంటివి.. ) విస్తరించి..తన అభిమానులనూ, కళారాధకులనూ ఇంకా మురిపిస్తూనే వున్నారు. కానీ స్వతహాగా అంతర్ముఖులూ..ప్రదర్శనలు బొత్తిగా ఇష్టపడని వ్యక్తీ ఐన వపా గారు.. తనచుట్టూ తానే గిరిగీసుకొని..అదే లోకం లో ఉండిపోయారనిపిస్తుంది. వారు తన సన్నిహితులైన కొందరికి వ్రాసిన ఉత్తరాలు వారి అంతరంగానికి అద్దం పడతాయి.వారి బొమ్మలను చూసి వారి వ్యక్తిత్వాన్ని ఊహించడానికి ప్రయత్నించే వారికి వారి తాత్వికత, లోతైన భావజాలం ఆశ్చర్యాన్ని కలిగించక మానవు.
******
"కశింకోట, 23 -12 -1980
....'ఎందుకు?' అన్నది నాకు మూలమంత్రం.! ఆ గీత, ఆ వంపు, ఆ అస్పష్టత ఎందుకు అన్న ఆలోచనే చిత్ర రచనకు ఎంత దోహదమో..అదే 'ఎందుకు' నాకు చాలా ఉపయోగకరంగా ఇంతవరకూ ఉంది..!!
ఇక - చిత్రాలు ప్రదర్శింపజేయటమూ , ముఖ్య అతిధి ఆహ్వానానికి నేను పూర్తిగా విముఖుడినని వెంటనే తెలియ జేయడం చాలా అవసరమైనదిగా ఎంచుతూ ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీరు వస్తే పరిషత్ ప్రతినిధి గా కాక కేవలం స్నేహితునిగా రాగోర్తాను.' ......'చందమామకూ యువ కూ తప్ప ఏ బొమ్మ ఇతరులకు వెయ్యను.'..... ..'మొన్న మీరు వచ్చినప్పుడు బిరుదుల గురించీ, సన్మానాల గురించి వింటున్నప్పుడు నాకు నవ్వు వచ్చిందే తప్ప మరేమీ రాలేదు. ఇలాటి అన్నిటికీ అతీతంగా ఉండాలనే చిరకాలం క్రిందటే ఒక మార్గాన్ని ఎన్నుకొన్నవాడిని....మీరేదో పేపర్ పబ్లికేషన్ కోసం రాసి,పరిచయ వ్యాసం పంపాలన్నారు. పంపక పొతే సరే, ఒకప్పుడు పంపితే ఈ క్రింది వాక్యాలు చేర్చండి. ' యితడు మొండి వాడు.. గర్విష్టి..?? కూపస్థ మండూకం అన్నా అనవచ్చు . బయటి సంఘాన్ని చూడదు. చూడమని కోరాడు. ఇలాంటి తలబిరుసు తనకు మేలో కీడో అన్న విచక్షణా జ్ఞానం ఉన్నట్టు కూడా తోచదు. ఇలాంటి బిరుసుకి తన ఆత్మ విశ్వాసం ఇరుసు అంటాడు. అది ఎంత నిజమో అది అప్రస్తుతం."
********
"కశింకోట, 23 -12 -1980
'మనతరం అనుభూతిని మన తరువాత తరం వారికి చెప్పబూనే ప్రయత్నమే' కళ...! - ఎవరిదీ?? ఎక్కడిదీ బాబూ ఈ స్లోగన్..??!!
నలుగురు గుడ్డి వాళ్ళూ, ఏనుగూ ..కథ ఇది. నా మట్టుకు అనుభవం లో - తాత్కాలికంగానైనా మానసిక అశాంతిని తెమ్మనేర్ప గలిగేది మాత్రమే అది ఎలాంటిదైనా..బూతు అయినా అదే అర్ధమున్న కళ . ఈ మానసిక అశాంతికి కాలమూ స్థాయీ మారుతూ ఉంటాయి. జగత్తు స్వభావం పరిణామం. నిన్నటి కళ ఈ రోజు కళ అనిపించుకోదు. అనుకుంటే అది కుంటి నడక.' ...
.......అంచేత కళా నిర్వచనాల కంటే నిర్వాక్కుగా కళ అనిపించినదాన్ని ఆస్వాదించగల్గడమే తపస్సు..మునులంటే వాళ్ళే...!'......
చిత్రకళా తపస్వి అని మరో అభాండం వేశారు. ఏదీ కాను, 'కోటివిద్యలు కూటికే'' తపస్విని .. అంతే...!! ....
......ఆంధ్ర దేశం లో పుట్టడం వల్ల నాకు అంతగా మేలు జరగలేదన్నారు...ఇదే మనసులో వుండే అజ్ఞానం ఒకడి గురించి అతడికి జరిగిన కీడు మేళ్లను కొలబద్దలుగా అంచనా వేస్తారు. నేనెప్పుడూ ఇప్పుడూ అలాగ అనుకోలేదు. మనకు కావలసిన మేలు మన చేతిలోనే ఉంది. దేముడు కూడా మేలు చేయక్కర్లేదని నమ్మే వాడిని నేను. దేముడిని ప్రార్ధిస్తే - ఒరే దేముడూ నువ్వు ఎలాంటి మేలూ చెయ్యకు. అదే నువ్వు చెయ్య వలసిన కార్యం - అని.
......"
**********
"కశింకోట, 8-9 -1981
................
'ఎందుకూ పనికిరానివాళ్ళు విమర్శకూ వ్యాఖ్యానాలకూ దిగుతారనేది తరతరాల సంస్కృత కావ్యాల నాటి నుంచీ వస్తున్న మనదేశపు సంస్కృతి, కాళిదాసు లాగ వ్రాసే వాళ్ళు లేరు గానీ వ్యాఖ్యాతలు కోకోల్లలున్నారు.' ...... ' ఇది కమర్షియల్ , ఇది క్రేఅతివే అని చిలక పలుకులు పలికే వాళ్ళు నిజానికి ఏమీ తెలియని భూతాలు. ' బ్రహ్మజెముడు మొక్కలోనూ, శతపత్ర కుసుమంలోనూ ఒకే సౌందర్యం కనిపించినప్పుడే అది నిజమైన విమర్శ అవుతుంది.. కళ లో తేడాలూ, జాతులూ, శైలీ ఎంచడం అంత సంకుచితత్వం మరేదీ లేదు..! ఎందులో ఏముందో తెలుసుకున్న సొంత అనుభవం తర్వాతే - ప్రకర్ష.' .........."
***********
"కశింకోట, 21-6 -1982
.............
ఆధునిక లేదా నవీన చిత్ర కళ అంతే ఇది అని లేదు. ఈ రోజు నవీన రేపటికి పాతదైపోతుండగా, ఒకవంక కంపూటర్ల చేత డ్రాయింగులు చేయిస్తూ ఉంటే.. మరో ప్రక్క కలర్ ఫోటోగ్రఫి ట్రిక్కులతో అన్నీ సాధిస్తున్నై. కొంతమంది విజ్ఞులనిపించుకుందామని ఆధునిక చిత్రకళా అవగాహన చేసుకోలేకపోయినా తెగనాడడమో , పొగడ్డమో చేస్తున్నారు. ఈ రకం విదూషకులు, జోకర్ల కంటే.. ఏమాత్రం సారం వున్నా గ్రహించ గలిగే మూగ ప్రేక్షకుడు ఒక్కడుంటే చాలుకదా..??....
నా మట్టుకు చెప్పాలంటే - మనుగడ కోసం సాంప్రదాయకంగానే బొమ్మలు వేస్తున్నాను. ( ఈ దేశం లో ఆధునిక చిత్రకళకు పైసా సంపాదించే యోగం లేదుకాబట్టీ) అత్యంత ఆధునిక చిత్ర కళ పట్ల పరిపూర్ణమైన అభిమానమూ, ఆసక్తి గల వాడిని..! నమ్మండి మానండి...!! "
*****************
వపా గారు చిత్రకళ పట్ల వారికి వున్న అభిప్రాయాలను..నిర్మొహమాటం గా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు ఆ ఉత్తరాలలో..!!
ఒక చోట ఇలా వ్రాసారు: "ఈ రోజులు గడపటానికి ఇబ్బంది లేని ఆర్ధిక స్థోమత నిలవాలు వుంటే, నేను చిత్ర రచన జీవనోపాధిగా పెట్టుకోకుండా ఒకటో రకం ఆధునిక చిత్రకారుడిగా ఉండేవాడిని."
*****************
"కశింకోట, 21-6 -1982
.............
నేను ఇప్పటివరకు అవలంబించిన మార్గాన్నే ఉండాలని తలచి మీకు మీ షిప్ యార్డు వాళ్ళ ఎగ్జిబిషన్ కి బొమ్మలు ఇవ్వనని, ఇక ఆ ప్రశస్తి వద్దని వ్రాశాను. నేను ఒకటి సంకల్పించాను... అది నెరవేరాలి...ఇక్కడే మంచివన్నీ తీసి అన్నిటికీ అద్దాలూ, ఫ్రేములూ వేసి, రెండు చిన్న గదుల్లో గాలరీ లాగ తగిలించి ఉంచాలని..అది నెరవేరితే ఇదొక్క ప్రదర్శనా ఎల్లప్పుడూ ఉండాలనీ. ఇది నాకు నాగులచవితి నాడు కలిగింది. ఎవరు చూడాలని ఇంట్రెస్టు ఉన్నా చూడగలరు.
***********
'చందమామ'కీ , 'యువ' కీ తప్ప బొమ్మలు గీయను..ప్రదర్శనలకు దూరం అన్న వారి సిద్ధాంతం అభిమానులకి వారిని అందుబాటులో లేకుండా చేసింది. అందువల్లేనేమో..బాపు బొమ్మలు, వివరాలూ దొరికినంత సులువుగా వపా గారివి దొరకటం లేదు..వారు ఎక్కువగా బొమ్మలు గీసిన చందమామ ముఖ చిత్రం గా తప్ప మరెక్కడా వారి బొమ్మ కనిపించదు. కానీ వారే ఒక గ్యాలెరీ ఏర్పాటు చేద్దామని తలచినా అది ఎందుకో సఫలం అయినట్టు లేదు. చందమామ ఇంకో మూల స్తంభం ఐన దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక సంచికను 'రచన' వారు పూనుకొని తయారు చేసినట్టు మన వడ్డాది పాపయ్యగారిది కూడా ఎవరైనా ఒక సంచిక విడుదలైతే ఎంత బాగుంటుందో కదా!! అదే సంకల్పం తో వపా గారి వీరాభిమానీ, వారికి ఆప్త మిత్రుడూ, వారు కశింకోటలో వున్న పన్నెండేళ్ళ పాటూ వారిని ఎంతో దగ్గరగా గమనించి, వారి స్వహస్తాలతో ఉత్తరాలూ, గ్రీటింగ్ కార్డులూ, అందుకున్న అదృష్టవంతులు..మా విశాఖపట్నానికే చెందిన ప్రముఖ చిత్రకారులు శ్రీ సుంకర చలపతి రావుగారు( చిత్ర కళా పరిషత్), వపా గారిమీద 'The waking dreamer in colours' పేరిట ఒకటీ, 'లేఖలు' పేరిట ఇంకొకటీ పుస్తకాలు రిలీజ్ చేసారు అంతే కాక వపా గారి చిత్రాలు వారికి సాధ్యమైనన్ని సేకరించి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేసి విశాఖ వాసులకి కన్నుల పండుగ చేసారు. అలాగే ఆ బొమ్మలన్నిటినీ వాటిని స్కాన్ చేసి ఒక CD గా కూడా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వారు చేస్తున్న కృషికి వారిని వపా గారి అభిమానులంతా మనస్పూర్తి గా అభినందించాలి.
( పైన 'వాలు' గా వ్రాసిన పంక్తులు వపా గారి ఉత్తరాలలోనివి...శ్రీ సుంకర చలపతి రావు గారి సౌజన్యం తో)
వపా గారి మరిన్ని చిత్రాలు ఇక్కడ చూడండి. మరియు వికీ పెడియా లో..
పూర్తిగా చదవండి...

Wednesday, October 27, 2010

ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..




ఈ ఫోటోలు ఎవరివో చెప్పుకో మంటే చాలా కష్టపడాలి..!! బహుశా ఎవరూ చెప్పలేక పోవచ్చు...!!!
అయితే
పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం..
అని వినగానే గుర్తుపట్టని తెలుగువాడు ఉండడు.  అని వినిపించగానే ఠక్కున చెప్పేస్తాం...!!

తెలుగు ప్రజానీకానికి ఈ గొంతు సుపరిచితమే..ఈ గొంతు వినని చెవులు.. ఆహా!! అనుకోని మనసు ఉండవంటే అతిశయోక్తికాదు..!!  గానగంధర్వుడు మన ఘంటసాల గారి(పాట)ని విన్నవారు చాలామందే వుంటారు..!! కానీ వారిని చూసిన వాళ్ళు బహు తక్కువ. అక్కడా ఇక్కడా ఫోటోలు చూసినా ఆయన తన ఆత్మీయుల తోనూ..అభిమానులమధ్యనూ వున్న ఫోటోలు అరుదైనవనే చెప్పాలి.. ఆ లోటు ను భర్తీ చెయ్యడానికే ఈ ఫోటోలు...!! చూసి ఆనందించండి...!
అలాగే ఈ ఫోటోలలో ఘంటసాల గారితో పాటు తెలుగువారు అభిమానించే ఇంకొందరు ఆ తరం ప్రముఖులు, నటులు, నటీ మణులు, గాయకులూ వున్నారు. పరిశీలన గా చూస్తే కనిపిస్తారు...!! మరి వారిని కనుక్కోండి చూద్దాం.!!
ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..
(ఈ ఫోటో లు నేను మా మామాయ్య సుసర్ల శ్రీనివాస్ గారి దగ్గర తీసుకున్నాను. ఆయనకి ఎవరిచ్చారో -ఆయన స్నేహితుడెవరో నట - నాకు తెలీదు..! కానీ ఆమహానుభావునికి మన బ్లాగర్లందరి తరఫున శతకోటి వందనాలు)
పూర్తిగా చదవండి...

Sunday, October 24, 2010

చిన్నారుల 'సుందరకాండ' గానం

ప్రతీ ఏడాదిలాగే ఈసారి దసరాకి కూడా మా సంగీతజనకులం లో గురువుగారైన కులపతి శ్రీ ఇంద్రకంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారి ఆధ్వర్యం లో సరస్వతీ పూజ, ఏకాహ మహోత్సవం ఘనంగా జరిగాయి. వేదిక:విశాఖపట్నం లో అక్కయ్యపాలెం శ్రీ వసంత వనేశ్వర ప్రసన్న గణపతి ఆలయం.
(విజయ దశమి నాడు ప్రొద్దున ఆరు గంటలకు గురువుగారి శిష్యులందరి సామూహిక సరస్వతీ పూజతో మొదలయ్యే కార్యక్రమం మర్నాడు పొద్దున ఆరు గంటలకు మంత్రపుష్పం, మంగళహారతి తో ముగుస్తుంది. ఈమధ్యలో ఇరవైనాలుగు గంటల పాటు సంగీత కచేరీలతో చదువుల తల్లి సరస్వతికి నిర్విరామంగా స్వరార్చన జరుగుతుంది. దీనిలో సంగీత జనకులం శిష్యులతో పాటుగా బయటి కళాకారుల కచేరీలుకూడా జరుగుతాయి.)


ఈసారి ఆరుగురు చిన్నారులు సుమారు రెండున్నర గంటలకు పైగా పాడిన ఎమ్మెస్ రామారావు గారి 'సుందరకాండ' మొత్తం కార్యక్రమానికి వన్నె తెచ్చింది. అందరూ పది పన్నెండేళ్ళ లోపు వారే కావటం విశేషం. వారు పాడటం మొదలుపెట్టింది రాత్రి సుమారు తొమ్మిది గంటలకు. ప్రార్ధనా శ్లోకాలూ, గణేశ పంచరత్నం తో మొదలు పెట్టి ఏకబిగిన పదకొండున్నర వరకూ అదే ఉత్సాహం తో గానం చేసారు. కార్యక్రమం ముగిసిన తరువాత,పిల్లల్నీ వారిగురువు ఐన దుర్గారావుగారిని అభినందించడానికి వెళ్తే మాటల్లో వారికి 'సుందరకాండ' తో పాటు
విష్ణు సహస్ర నామ పారాయణ, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, తిరుప్పావై పాశురాలూ, అన్నమాచార్య కీర్తనలూ మొదలైనవి గత నాలుగేళ్ళు గా నేర్పిస్తున్నానని, ఇది వారికి 66 కార్యక్రమమని చెప్పారు.

పిల్లల పేర్లు వరుసగా :
తేజస్విని, శ్యామ కీర్తి, మహతి, శోభా ఖ్యాతి, సాకేత,వంశీ. కుడివైపు కనిపిస్తున్నది ఈ పిల్లలకి 'సుందరకాండ' నేర్పించిన శ్రీ దుర్గారావు గారు. ( వీరిలో మహతి శ్రీ దుర్గారావుగారి కుమార్తె )
వీరికి
సుందరకాండ పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్ళు పట్టిందట. వీరు కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలలా వున్న ప్రసిద్ధ సభలూ, ఆలయాలలో చేసారట..వాటిలో కొన్ని:
  • తిరుమల శ్రీనివాసుని సన్నిధి - ఆస్థాన మండపం లో వరుసగా వారం రోజులపాటు గానం చేసారు.
  • భద్రాచలం శ్రీ రామాలయం
  • అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం
  • సింహాచలం దేవస్థానం
  • పిఠాపురం శ్రీ దత్త పీఠము
  • భీమిలి లో ఆనందవనం : సద్గురు శ్రీ శివానంద మూర్తి స్వామి వారి ఆశ్రమం
  • ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
  • తణుకు లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కూడా గానం చేసారు.
అంతేకాక శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద గానం చేసి వారి మెప్పు పొంది ఆశీర్వచనానికి పాత్రులయ్యారు.
ఇవికాక విశాఖపట్నం లో స్థానికం గా వున్న వేంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రతి శనివారం సుప్రభాతం, విష్ణు సహస్ర నామ పారాయణ, చేస్తారు. ఇది ఒకటిన్నర సంవత్సరాలుగా..నిరాటంకంగా కొనసాగుతోంది..! అలాగే ప్రతీ పౌర్ణమికీ స్థానిక జగన్నాధ స్వామి ఆలయం లో ఇదే కార్య క్రమం సంవత్సర కాలం గా చేస్తున్నారు.. నిరాఘాటంగా...!!


ఇలాంటి వారిని ఒక వంద మందిని తయారుచేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్న శ్రీ దుర్గారావుగారు నిజంగా అభినందనీయులు. ఆ చిన్నారులు కూడా అంతటి శ్రద్ధాసక్తులు చూపి నేర్చుకుంటున్నారు. వారినీ, వారిని ఈ విధమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రుల్నీ కూడా ఎంతైనా అభినందించాలి. టీవీ లలో 'ఆటా-పాటా' లే కళా ప్రదర్శన.. ఆ కార్యక్రమాలద్వారా మాత్రమే పిల్లలలోని టాలెంట్ వెలికి వస్తోందనే భ్రమలో వున్న నేటి తరానికి శ్రీ దుర్గారావు గారూ, వారి బృందం ఒక కొత్త దిశా నిర్దేశం చేసి మన సంసృతి, సంప్రదాయాలకు వారసులు గా నిలుస్తున్నారనటం లో సందేహం లేదు..! ధన్యోస్మి!!
ఈ బృందానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటూ ఇదే స్ఫూర్తీ, శక్తీ , సద్గురు కృప.. లభించి మరింత ఉన్నతిని సాధించాలని మంగళ కారుడైన మారుతిని ప్రార్ధిద్దాం!!



పూర్తిగా చదవండి...

Saturday, October 23, 2010

మనకు కనబడే వడ్డాది పాపయ్య...

మనకు కనబడే వడ్డాది పాపయ్య...
డ్డాది పాపయ్య గారు ఎప్పుడూ ప్రచారానికి దూరంగా వుండే వ్యక్తి కావడం తో ఆ మహోన్నత కళాకారుణ్ణి మనం ఆయన బొమ్మలలోనే చూసుకోగలుగుతున్నాం...తన కంటే తన కవితకూ, లేదా శిల్పానికీ లేదా చిత్రాలకూ శాశ్వతత్వం లభించాలని కోరుకొనే కవులూ, శిల్పకారులూ, చిత్రకారులూ వారి కళ కోసం జీవితాన్ని ధారబోసి వారు అజ్ఞాతంగా ఉండిపోయే దాఖలాలు ఎన్నో... అట్టివారు నిజంగా కారణ జన్ములూ త్యాగధనులూనూ ..
కానీ అజరామరమైన ఆ కళతో పాటూ వారికి కూడా సముచిత స్థానాన్ని ఇచ్చి వారి 'పేరు' కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలబడేలా చెయ్యడం కళారాధకులుగా మనందరికీ సమానమైన బాధ్యత వుంది.. వారి సేవలందుకున్న చందమామ యాజమాన్యానికి ఈ బాధ్యత కొంచం ఎక్కువ సమానం అని నా ఉద్దేశం .
*****
వపాగారి పెయింటింగ్స్ ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం..
మన భారతీయ సంస్కృతినీ, మన పురాణేతిహాసాలనీ ఆయన ఔపోసన పట్టారా, లేక వాటిలోని పాత్రలన్నిటినీ దర్శించ గలిగిన అపర వ్యాస భగవానుడా అన్నంతగా ఆ సన్నివేశాలను కథకు తగ్గట్లుగా చిత్రించారు. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ బొమ్మల్లో ఎంతో లోతైన భావ చిత్రణ...బొమ్మ composition లో కూడా ప్రాధాన్యత బట్టీ ఆ పాత్రల సైజు.. ఆహార్యం..నేపథ్యం..వాతావరణం..ఇలా చాలా అంశాలు పరిగణనలోకి తీసుకున్నట్టుంటాయి. అలాగే మొదటి సారి చూచినప్పుడు మన కళ్ళబడని అంశాలు..రెండోసారీ మూడోసారీ చూస్తున్నప్పుడు..కనబడితే..ఒక రకమైన సంభ్రమం కలిగే సందర్భాలు అనేకం. భూ నభొంతరాలని, గడ్డిపూవునీ, అలాగే విశ్వరూప వినాయకుడినీ ప్రక్కనే చిట్టెలుకని గీసేటప్పుడు కూడా కూడా అదే శ్రద్ధ, అదే నిశిత దృష్టి...!అన్నిటినీ hormonize చేస్తూ ఆయన గీసే గీతాల వంపు సొంపులూ, వాటి లయ విన్యాసం..దానిలోనే ప్రణవ స్వరూపమైన ఓంకారం.. అదో నవలోకం!!. నభూతో .. అనిపించే రీతిలో ఇన్ని అంశాలను తనలో ఇముడ్చుకున్న ఆ సంపన్నత (richness) వారి కళదే కానీ అది వేసేందుకు వాడిన ఉపకరణాలది కాదు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం..వారు చిత్తుకాగితం లాంటిదానిమీద కూడా కేవలం వాటర్ కలర్స్ / చార్కోల్ పెన్సిల్ వాడి అద్భుతాలు సృష్టించేవారని వారిని దగ్గరగా చూసిన ఇంకొక ఆర్టిస్ట్ శ్రీ చలపతిరావుగారు చెపుతారు.
రాజా రవివర్మ గారిది కేలండర్ ఆర్ట్ లో ఒక ప్రత్యేకమైన శైలి. అవి ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్స్. చాలా సహజంగా వుంటాయి. దేవతా మూర్తుల బొమ్మల proportions ..మనుషుల లాగే చాలా స్వాభావికం గా వుంటాయి. exaggeration వుండదు.. కానీ వపా గారిది శైలి, ఆ ఒరవడి అనితరసాధ్యం అనిపిస్తుంది. సబ్జెక్టు తో పాటు గా ఆయన సృష్టించే మాయాలోకం ముందు ఎంతటివారికైనా సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవు. మనవాళ్ళు ఇప్పుడు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసే గ్రాఫిక్ వర్క్ అంతా ఆయన కసింకోట లో కొన్న మామూలు కామెల్ వాటర్ కలర్స్ తోటే సృష్టించేసే అపర బ్రహ్మ. తేడా అల్లా ఏంటంటే రవివర్మ గారి పెయింటింగ్స్ వేలం పాటల్లో తిరుగుతూ.. ఖరీదైన భవంతుల్లో అలంకరణగా వినియోగమైతే మన వపా గారివి..సామాన్యుల గుండెల్లో పదిలంగా వున్నాయి. ఆ అట్ట మీద బొమ్మలోనే దేవుడిని చూడగలిగి ఫ్రేము కట్టించి పెట్టుకున్నవారెందరో వున్నారు. (మా ఇంట్లో వపా గారి పెయింటింగ్ రాములవారిది బ్లాకు అండ్ వైట్ లో వుండేది. అది మా నాన్నగారు వారి చిన్నప్పుడు 'యువ' లో పడితే కట్ చేసి ఫ్రేం కట్టించి పెట్టుకున్నారు. ఒకపక్క కలర్ , ఇంకోపక్క బ్లాకు అండ్ వైట్.. ఇంచుమించు మేము పదో క్లాసు చదివేతంట వరకు కూడా బయటకెళ్ళే టప్పుడు ఆ రాముడి ఫోటో కి దండం పెట్టవలసిందే..పరీక్షల టైం లో మరీను.. ఇల్లు కడుతున్నప్పుడు అనుకుంటా నానిపోయి చెదపట్టేసి పాడైపోయింది.)

ఎం చూసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అలాంటి అపురూప చిత్ర రాజాలను (ఒరిజినల్స్ అని నా భావన) 'కలిగి' ఉండడమనే అదృష్టానికి తోడూ సరైన రీతి లో భద్రపరచడం అనే బాధ్యత కూడా చందమామ యాజమాన్యం మీద వుంది. అలా చేసి వుంటారనే నమ్ముతున్నాను. అయితే వాటిని చందమామ ముఖచిత్రంగా మాత్రమే కాక మరింత విస్తృతంగా ప్రచారం కల్పించి మనలాంటి అభిమానులకి వారిగురించీ వారి చిత్రాలను గురించీ మరింత తెలుసుకొనే అవకాశాలను కల్పించగలిగితే బాగుంటుంది.
1 . వారి paintings అన్నిటినీ గుది గ్రుచ్చి ఒక catalog లాగా ప్రచురించాలి..
2 . వారు మొత్తం మీద వేసిన చిత్రాలెన్ని.. ?! వీలైతే chronological order and details జతపరచ గలిగితే మరీ మంచిది. క్లుప్తంగానైనా వారి జీవితం గురించి ఓ నాలుగు ముక్కలు..!!
3 . కళ పోషకులకు వాటిలోంచి catalog no చెప్పి ఆర్డర్ మీద తెప్పించుకోగలిగే సదుపాయం వుండాలి.
4 . అన్నిటినీ మించి వారి ఒరిజినల్ పెయింటింగ్స్ ని అపుడప్పుడైనా అభిమానుల సందర్శనార్ధం ప్రదర్శించాలి..శాశ్వత ప్రాతిపదికన ఒక మ్యుజియం పెడితే మంచిది.. (బొంబాయికి తరలిపోయి.. వున్న మంచి శీర్షికలే తీసేస్తున్న చందమామ యాజమాన్యం మన తెలుగు వాడైన వపా గారి మీద అంత శ్రద్ధ కనబరుస్తుందా... ? వారినుంచి ఇన్ని ఆశించడం అత్యాశ అవుతుందా... ??)
******
మన అభిమానుల అభిలాష ఇలా వుంటే వపా గారి మనస్తత్వం ఇంకోలా వుండేది...!! ఆయన తన సన్నిహితులకి వ్రాసిన ఉత్తరాలు.. ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి...!! ఆ విషయాలు ఇంకో టపాలో...
(పైన వ్రాసిన విషయాలు నేను చిన్నప్పటినుంచి చూస్తున్న వపా గారి బొమ్మల గురించి నాకు తోచిన విషయాలు మాత్రమే...ఏమైనా తప్పులుంటే విజ్ఞులెవరైనా సరి చేస్తే సంతోషం)
(వపా గారి ఫోటో చిత్రకళా పరిషత్ సౌజన్యంతో )
ఈ పోస్ట్ ఇంతకు ముందు ప్రచురించినదే కానీ చిత్రంగా నా బ్లాగ్ లోంచీ మాయమయ్యింది. అందుకని మళ్ళీ ప్రచురించాను.
పూర్తిగా చదవండి...

Sunday, October 17, 2010

గంధర్వ చక్రవర్తి కూతురు...చందమామ మినీ సీరియల్






గంధర్వ
చక్రవర్తి కూతురు...


ది నేను చందమామలు చదవడం మొదలెట్టాక తోకచుక్క, మకర దేవత సీరియల్స్ తరువాత అంతగా నచ్చిన, బాగా గుర్తుండిపోయిన మినీ సీరియల్... అరేబియా కథలు సీరీస్ లో భాగంగా -1981 అక్టోబర్ లో వచ్చిన సీరియల్ ఇది. కథ బస్రా అనే నగరంలో మొదలవుతుంది..అదే అరేబియన్ నేపధ్యం లో నడుస్తుంది.

స్థూలంగా...హసన్ అనే అందమైన ఒక కుర్రవాడు ఆ ఊళ్ళో ఒక చిన్న నగల దుకాణం నడుపుతుంటాడు. ఒక పర్షియన్ మాంత్రికుడు ఆత్మీయత నటించి బంగారం చేసే విద్య నేర్పిస్తాననే నెపంతో దగ్గర చేరుతాడు. కుర్రవాడు తన తల్లి అత్యాశకు పోవద్దని ఇతను నమ్మదగ్గవాడిలా లేడని ఎంతచెప్పినా వినడు. నమ్మిన హసన్ ను ఆ మాంత్రికుడు మోసగించి క్షుద్రోపాసనలో బలివ్వడానికి తనతో ఒక విచిత్రమైన ద్వీపానికి తీసుకుపోతాడు. తెలివి వచ్చిన హసన్ చాకచక్యంతో ఆ మాంత్రికుడినే మట్టుబెట్టి ఆ దీవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక గంధర్వ సామంత రాజు కుమార్తెల వద్ద చేరుతాడు. వారు హసన్ ని తమ్ముని వలె ఆదరిస్తారు.

ఇం
తలో అనుకోకుండా మన కథానాయిక ఐన గంధర్వ చక్రవర్తి కూతురిని చూసిన హసన్ మనసు పారేసుకొని ఆమెని కలవలేక చిక్కి శల్యమవుతాడు. పక్షి తొడుగులు ధరించి ఎగురుతూ వచ్చిన ఆ చిన్నదానిని తన అక్క సలహా మీదట ఆ తొడుగు తస్కరించి తన వశం చేసుకుంటాడు. తరువాత ప్రేమతో ఆమె దగ్గర చేరి ఆమె మనసు గెలుచుకొని, ఆమెని పెళ్లి చేసుకొని మళ్ళీ తన ఊరికి చేరుకుంటాడు. అయితే కొంతకాలం గడిచాక తన అక్కలకిచ్చిన మాట మీద వారిని మళ్ళీ చూడడానికి బయలుదేరతాడు. వెళుతూ తన భార్య, పిల్లలను తల్లికి అప్పజెప్పి భార్య యొక్క పక్షి తొడుగుల గురించి చెప్పి అది కంటపడితే తన భార్యకు మళ్ళీ గంధర్వ లోకం వైపు మనసు మళ్ళి తనకు దక్కకుండా పోతుందని...జాగ్రత్త చెప్పి వెళ్తాడు.

కానీ అనుకున్నంతా జరిగి ఆమె పిల్లలతో సహా ఎగిరిపోతుంది. అయితే హసన్ ఎంతో సాహసంతో మళ్ళీ ఆ గంధర్వచక్రవర్తి రాజ్యమైన వాక్ - వాక్ దీవులకి చేరుకొని తన భార్యా పిల్లలను ఎలా దక్కించుకోగలిగాడనేది మిగతా కథ.


చాలా మలుపులతో సాగుతుంది. కానీ మన NTR గారి 'జగదేక వీరుని కథ', పాతాళభైరవి టచ్ ఉన్నట్టుంటుంది.. కొంత సారూప్యత వున్నా కథనం, ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా వుంటుంది. మాంత్రికుడూ, రెక్కల గుర్రాలూ, మంత్రించిన చూర్ణం, పక్షి తొడుగులూ...ఇలా చాలా చిత్రంగా వుంటుంది. ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. దీనికి తోడు శంకర్ గారి బొమ్మలు మనకు ఆ సన్నివేశాలని కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు... అరేబియన్, పర్షియన్ నేపధ్యం.. ఆ పాత్రల ఆహార్యం, రూపకల్పన, సన్నివేశాలకి తగ్గ బాగ్రౌండ్ ని చూపించడంలో 'సరిలేరు నీకెవ్వరూ' అని మరోసారి నిరూపించుకున్నారు.

నేను మూడో క్లాసు చదివేటప్పుడు ఇది సీరియల్ గా వచ్చింది. మొత్తం పది భాగాలు. ఈ కథకి మూలం ఏమిటో ఎవరు రాసారో తెలీదు. కాని టైటిల్ పేజీ కిందమాత్రం ' అరేబియా కథలు' అని వుండేది. మేము ఆ పేజీలను వేరు చేసి పుస్తకం గా కుట్టుకొని వుంచుకున్నాం. చాలా సీరియల్స్ ని ( తోకచుక్క, మకరదేవత, విఘ్నేశ్వరుడు, ఇంకా చాలా..) అలా దాచుకున్నా...ఆ మా తొలినాటి చందమామ జ్ఞాపకంగా చివరకు మిగిలింది ఇది ఒక్కటే (ఈ పుస్తకం లోనే 'ఇద్దరు మోసగత్తెలు' అని ఇంకో సీరియల్ కూడా వుండేది...దానిగురించి ఇంకో టపాలో ముచ్చటిస్తాను). అందుకే ఈ సీరియల్ నాకు ఎంతో ప్రత్యేకం.
ఈ సీరియల్ లింక్ చందమామ ఆర్కైవ్స్ లో మీకోసం...
గంధర్వ చక్రవర్తి కూతురు 1 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 2
పేజీ నెం. 60
గంధర్వ చక్రవర్తి కూతురు 3 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 4 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 5 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 6 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 7 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 8 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 9 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 10 పేజీ నెం. 61



పూర్తిగా చదవండి...

Saturday, October 16, 2010

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...


వడ్డాది పాపయ్య గారి వర్ణ చిత్రాల కోసం చందమామ కవర్ పేజిలు చూస్తోండగా ఈ బొమ్మ కనిపించింది. విఘ్నేశ్వరుడు ధారావాహిక కోసం వేసిన ఈ బొమ్మ చాలా చిత్రం గా అనిపించింది..!
పైబొమ్మ - లోభ గుప్తుడనే వ్యాపారి తన స్నేహితుడైన సత్యగుప్తుడిని మోసం చెయ్యబోతే విఘ్నేశ్వరుడు ఎలా అతనికి శాస్తి చేసాడో తెలిపే కథకి చిత్ర రూపం. క్రింద బొమ్మ - కలహ కంఠి అనే ఒక గయ్యాళి అత్త విఘ్నేశ్వరుని భక్తురాలైన తనకోడలిని రాచిరంపాన పెట్టినా చివరకు ఆమెకే విధంగా శాస్తి జరిగిందో చెప్పే కథ కు ఇది బొమ్మ గా వేసారు మన వపా !!

అయితే కవర్ పేజీ పైన వేసే వపాగారి రెగ్యులర్ శైలికి భిన్నం గా ఇది కార్టూన్ వేసినట్టుగా అనిపించింది..కథ యొక్క సాంఘిక / జానపద నేపథ్యం వల్లనేమో మరి..??!! సాధారణంగా కవర్ పేజి మీద ఒకటే బొమ్మ వుంటుంది కానీ ఇది రెండుబొమ్మల తో, చుట్టూ గోల్డ్ కలర్ ఫ్రేం తో చిత్రంగా అనిపించింది. పైగా ఇవి రెండూ కూడా ఒకే సంచిక లోవి కాదు..1982 జూన్ , జులై లలో పడిన రెండు కథల బొమ్మలు ఇవి..మరి అలా ఎందుకు వేసారో!!
****

పోన్లెండి..దానిగురించి వదిలేసి..వపా గారి ఇంకో బొమ్మ: వినాయకుడు ఎన్ని భంగిమల్లో ఉన్నాడో గమనించండి..

చివరగా సత్రాజిత్తు శ్యమంతక మణి నీ, సత్యభామనూ శ్రీ కృష్ణునికి సమర్పిస్తున్న దృశ్యం... ప్రసన్నవదనం తో వినాయకుడు ఆశీర్వదించడం..సత్యభామా పాణి గ్రహణం.. విజయ ఫల పరిష్వంగం తో ఉప్పొంగిన కృష్ణుని వక్షస్థలం...జాంబవంతుని ఆశ్చర్యం..జాంబవతి అమాయకత్వం.. నిశితంగా చూసేకొద్దీ క్రొంగొత్త విషయాలు కనిపిస్తూనే వుంటాయి...ఆ మణి యొక్క ధగ ధగలు, సత్యభామ దండ వంకీ, మిగిలిన అలంకరణ..ఆహా !! అద్భుతం ..!! అనిపించక మానదు కదూ...
పూర్తిగా చదవండి...

పద్యరచన

మిత్రుడు బ్లాగాగ్ని గారి వ్యాసం "పద్యరచన for dummies" చదివిన ఉత్సాహంలో నా చేయి కాల్చుకున్న విధంబెట్టిదనిన:

బిడియముతో దాగుకొనిన
యమ్మగువను దరిచేర బిలిచి
నేర్పున పరుగిడక నిలిపి
ముద్దడిగితి చిన్నదాన నెద కెత్తుకొని!!

బ్లాగాగ్ని గారూ!
ఇది నేను రాసిన మొట్టమొదటి పద్యం.. మీ వ్యాసమే స్ఫూర్తి.. శ్రీ గురుభ్యోనమః...
చిన్నప్పుడు నేర్చుకున్న ఛందస్సు కొంచం కొంచం తప్ప గుర్తులేదు. పైన నేను రాసిన నాలుగు ముక్కలూ అసలేదైనా వృత్తం లోకి వస్తాయో లేదో చూసి అవసరమైతే కొంచం మరమ్మత్తు చేసి పెట్టండీ...(అని ఆయనమీదకే ప్రయోగించి.. కరెక్ట్ చేయించుకున్నాను..)

దీనికి వారి జవాబు..
రాధేశ్యాం గారు: నేను మీకు గురువుగా తగను. ఎందుకంటే నాకే సరిగా ఏవీ తెలియవు కాబట్టి. ఓ మిత్రుడిగా మీ పద్యాన్ని ఆటవెలదిగా ఈ క్రిందివిధంగా దిద్దాను. ఆటవెలది నియమాలు చదివి, ఈ క్రింది పద్యం అర్థం చేసుకుందుకు ప్రయత్నించగలరు.అన్నట్టు మీ పద్యం భావం బహు చక్కగా ఉంది.

ఆ.వె

బిడియము వలనను కనబడక దాగు
నమ్మగువను దరికి రమ్మటంచు
నయమున పరుగిడక నిల్పి నందనమున
ముద్దడిగితి పాప వద్ద నేను!!

ధన్యవాదాలు.. మేష్టారూ..దీనికి గురుదక్షిణ గా కనీసం ఒక కందపద్యం (నాకు చాలా ఇష్టమైనది) ఎలాగోలా వండివార్చేస్తాను...

*****************************

ఇదే ఇతివృత్తానికి మా మామయ్యగారు శ్రీ బి. వి. ఎస్. మూర్తిగారు వ్రాసిన సీస పద్యం :



పూర్తిగా చదవండి...

Sunday, October 10, 2010

రాగ సుధా రస వాహిని

రాగ సుధా రస వాహిని
రచన: డా. ఆర్. సుమన్ లత
**********************


'అలకలల్లలాడే రాముని గని'





స్వర"రాగ రత్నమాలిక" లల్లెదనని





దివికేగిన త్రిస్వర సామ్రాజ్ఞి గళం





రాగబ్రహ్మార్చనలో తులసిదళం.





మృదుమధురం ఆమె అపూర్వగాత్రం.





సదాశివార్చనకేతెంచిన బిల్వపత్రం





ఆమె నోట రాగం - తానం,





జన్య- జనక రాగాల మధురసంకీర్తనం





"వసంతో"దయంలో సరస - స్వర "భూపాలం",





సప్తస్వరాల "కదనకుతూహలంహలం",





అష్టపదుల "గానమూర్తి" జీవితం,





"త్రికాలాలూ" స్వరార్చనకే అంకితం.





"భావయామి రఘురామం"





నిత్య-నవరాగమాలికల సమాహారం.





అన్నమయ్య మధుర పద సంకీర్తనం.





భజగోవిందానంద ఆలోక దర్శనం.





"బృందావన సారంగం" లో "శ్రీ"రంగ విహారం





భక్తి భావాల అపురూప సంగమం.





రామభక్తి సామ్రాజ్య సందర్శనం





నాలుగు పురుషార్థాల పరమ పద సోపానం




నిత్యం పల్లవించే రస - రాగ - తాళ త్రివేణి,




సతతం గొంతులో జాలువారే " అమృతవర్షిణి"




ఆమె - ఎల్లరూ ఎరిగిన రసరాగ రంజని,




ఎల్లలే లేని "ఎమ్మెస్" ఒక రాగసుధారసవాహిని.

(స్వర్గీయ శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి అక్షర నివాళి)
*************************************************************************************************
డా. ఆర్. సుమన్ లత గురించి:
MA., Ph.D (अष्टछाप और ताल्लापक कवियों का तुलनात्मक अध्ययन)
హైదరాబాద్ హిందీ మహావిద్యాలయ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తెలుగునుంచి హిందీ కి , హిందీ నుండి తెలుగు కు అనువాదాలు.. సుమారు ఇరవై అయిదు కి పైగా పేపర్లు, పది వరకూ పుస్తకాలూ ప్రచురితమయ్యాయి. ఈ మధ్యే ప్రచురితమైన పుస్తకం "పిలిచినంతనే పలికే దైవం" - విష్ణు సహస్ర నామావళి గాధలు ( ఆంగ్ల మూలం: శ్రీ వి. ఎస్. కరుణాకరన్) ఇంతకు ముందు వాక్ - voice of temples అనే పత్రిక లో ధారావాహిక గా వచ్చింది. ఇది చిలుకూరు బాలాజీ ఆలయం నుండీ మూడు భాషలలో వెలువడే ఆధ్యాత్మిక మాస పత్రిక. హిందీ, తెలుగులో కూడా అనువాదం చేసారు. హిందీ - తెలుగు భాషలలో కవితలు, వివిధ అంశాలపై వ్యాసాలూ ప్రచురితమయ్యాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యక్ష్య వ్యాఖ్యానం హిందీ లో ఎనిమిది సార్లు చెప్పారు.
AIR (ఆకాశవాణి) లో ఎన్నో కార్ర్యక్రమాలలో పాలుపంచుకున్నారు. సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం అన్న అంశం పై పిల్లలకూ, పెద్దలకూ స్పెషల్ లెక్చర్స్ ఇస్తున్నారు.
వీరు వ్రాసిన పుస్తకాలు ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
अष्टछाप और ताल्लापक कवियों का तुलनात्मक अध्ययन
गदाई की कहानी
स्वतान्त्रयोतर हिंदी और तेलुगु नाटकों मैं नारी समस्या మొదలైనవి..

- రాధేశ్యాం





పూర్తిగా చదవండి...

Tuesday, October 5, 2010

ఏవీ ఆ మధురానుభూతులు..??

ఏవీ ఆ మధురానుభూతులు..??
బాలభానుని బంగారు కిరణాలు
వెండి వెన్నెలలో నిండు స్నానాలు
గోధూళి వేళలో గంటల గణగణలు
పక్కనపారే సెలయేటి గలగలలు..
కోయిల కూజితాలు, పక్షుల కిల కిలారావాలు

అన్నీ బాల్య కాలపు గత స్మృతులు !
నేడు స్వప్నాలకే పరిమితమైన వింత అనుభూతులు..!!
పెరుగుతున్న సౌఖ్యాలు..,
తరుగుతున్న మానవత్వపు విలువలు..
గమ్యమెరుగని పరుగులు..

ఎదుగుతున్నామన్న వెఱ్ఱి భ్రమలు
కార్ఖానాల కూతలే ఉభయ సంధ్యల సంకేతాలు
కలుషిత జల - వాయువులే ప్రాణాధారాలు
మచ్చుకైనా కానరాని పచ్చదనాలు
అడుగడుగునా వెలుస్తున్న "కాంక్రీటు వనాలు"

గుర్తు తెలియని పొరుగువారి ముఖాకృతులు
కాలు కదుపనీయని క్రొత్త ఆర్ధిక బంధాలు..
తనవారు పెరవారవుతున్న వింత వైనాలు
వలసలతో వెలవెల బోతున్న పల్లెసీమలు ;
"గ్లోబల్ విలేజి" లవుతున్న నగర జీవితాలు..

నీరెండ సౌఖ్యాలు - వనభోజనాలు..
ఆషాఢపు తొలకరులు - ఆకాశ దీపాలు
ఉగాది ఊహలు - సంక్రాంతి సంబరాలు
శ్రావణ మేఘాలు - శరత్ చంద్రోదయాలు..
మదిలో దాగిన మధురాలాపనలు..

కవులందించే వింత సోయగాలు
నిఘంటువులో నిలచిన శబ్దార్ధాలు
వెతికితే దొరకొచ్చుఅంతరార్ధాలు
వెదకి వేసారినా దొరకునా మధురానుభూతులు ?


***********************************
రచన : డా. ఆర్. సుమన్ లత
(ఈ కవిత ' ఆంధ్రప్రదేశ్ ' మాసపత్రిక జూన్ '09 లో ప్రచురితమైంది )
***********************************
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)