Tuesday, October 5, 2010

ఏవీ ఆ మధురానుభూతులు..??

ఏవీ ఆ మధురానుభూతులు..??
బాలభానుని బంగారు కిరణాలు
వెండి వెన్నెలలో నిండు స్నానాలు
గోధూళి వేళలో గంటల గణగణలు
పక్కనపారే సెలయేటి గలగలలు..
కోయిల కూజితాలు, పక్షుల కిల కిలారావాలు

అన్నీ బాల్య కాలపు గత స్మృతులు !
నేడు స్వప్నాలకే పరిమితమైన వింత అనుభూతులు..!!
పెరుగుతున్న సౌఖ్యాలు..,
తరుగుతున్న మానవత్వపు విలువలు..
గమ్యమెరుగని పరుగులు..

ఎదుగుతున్నామన్న వెఱ్ఱి భ్రమలు
కార్ఖానాల కూతలే ఉభయ సంధ్యల సంకేతాలు
కలుషిత జల - వాయువులే ప్రాణాధారాలు
మచ్చుకైనా కానరాని పచ్చదనాలు
అడుగడుగునా వెలుస్తున్న "కాంక్రీటు వనాలు"

గుర్తు తెలియని పొరుగువారి ముఖాకృతులు
కాలు కదుపనీయని క్రొత్త ఆర్ధిక బంధాలు..
తనవారు పెరవారవుతున్న వింత వైనాలు
వలసలతో వెలవెల బోతున్న పల్లెసీమలు ;
"గ్లోబల్ విలేజి" లవుతున్న నగర జీవితాలు..

నీరెండ సౌఖ్యాలు - వనభోజనాలు..
ఆషాఢపు తొలకరులు - ఆకాశ దీపాలు
ఉగాది ఊహలు - సంక్రాంతి సంబరాలు
శ్రావణ మేఘాలు - శరత్ చంద్రోదయాలు..
మదిలో దాగిన మధురాలాపనలు..

కవులందించే వింత సోయగాలు
నిఘంటువులో నిలచిన శబ్దార్ధాలు
వెతికితే దొరకొచ్చుఅంతరార్ధాలు
వెదకి వేసారినా దొరకునా మధురానుభూతులు ?


***********************************
రచన : డా. ఆర్. సుమన్ లత
(ఈ కవిత ' ఆంధ్రప్రదేశ్ ' మాసపత్రిక జూన్ '09 లో ప్రచురితమైంది )
***********************************

2 comments:

  1. "కార్ఖానాల కూతలే ఉభయ సంధ్యల సంకేతాలు" excellent expression. Well said Dr.Lata garoo.

    ReplyDelete
  2. చాలా చాలా బాగుందండి!

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)